Telangana CM Revanth Reddy: తెలంగాణ సీఎంగా రేవంత్‌రెడ్డి.. ఎల్లుండే ప్రమాణం | Revanth Reddy To Be The Next Telangana Chief Minister - Sakshi
Sakshi News home page

Telangana CM Revanth Reddy: తెలంగాణ సీఎంగా రేవంత్‌రెడ్డి.. ఎల్లుండే ప్రమాణం

Published Tue, Dec 5 2023 6:36 PM | Last Updated on Tue, Dec 5 2023 9:10 PM

Telangana CM Candidate Name Officially Announced  - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా అనుముల రేవంత్‌రెడ్డి(54) ప్రమాణం చేయబోతున్నారు. సీఎల్పీ నేతగా రేవంత్‌ పేరును అధికారికంగా ప్రకటించింది కాంగ్రెస్‌ పార్టీ. మంగళవారం సాయంత్రం ఏఐసీసీ కార్యాలయంలో కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ ఈ నిర్ణయం వెల్లడించారు.

ఒకవైపు ప్రకటన జరుగుతున్న సమయంలోనే.. రేవంత్‌రెడ్డి హుటాహుటిన ఢిల్లీకి బయల్దేరారు. మరోవైపు జూబ్లీహిల్స్‌లోని రేవంత్‌ ఇంటి వద్ద పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఎల్లుండి ఉదయం పదిన్నర గంటల ప్రాంతంలో తెలంగాణ కొత్త ముఖ్యమంత్రిగా  రేవంత్‌ ప్రమాణం చేయనున్నారు.

చివరికి రేవంత్‌ పేరే.. 
తెలంగాణ రాజ్‌భవన్‌ వద్ద నిన్నంతా హైడ్రామా నడిచింది. తెలంగాణ కొత్త ముఖ్యమం‍త్రి ప్రమాణ స్వీకారం కోసం ఏర్పాట్లు కూడా జరిగాయి. అయితే.. నిన్న ఎమ్మెల్యేల అభిప్రాయ సేకరణ, ఇవాళ ఢిల్లీలో తెలంగాణ సీనియర్ల చర్చల పరిణామాల తర్వాత మంగళవారం సాయంత్రం ఈ నిర్ణయం వెల్లడించింది హైకమాండ్‌. పలువురు సీనియర్ల నుంచి అభ్యంతరాలు వ్యక్తం అయినప్పటికీ.. మెజార్టీ ఎమ్మెల్యేల అభిప్రాయం పరిగణనలోకి తీసుకున్న పార్టీ అధిష్టానం, చివరకు రేవంత్‌ పేరునే ఖరారు చేసింది.    

‘‘కొత్త సీఎల్పీ నేత ఎంపికపై నిన్న భేటీ జరిగింది. అందులో మూడు తీర్మానాలు చేశారు.  కాంగ్రెస్ విజయం అందించిన ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతూ ఒక తీర్మానం.  ప్రచారంలో పాల్గొన్న సీనియర్‌ నేతల కోసం మరో తీర్మానం. అలాగే తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి పేరును ఖరారు చేస్తూ మరో తీర్మానం. అన్ని అంశాల్ని పరిగణనలోకి తీసుకున్నాకే ఈ ఎంపిక జరిగింది. పార్టీలో సీనియర్లందరికీ న్యాయం జరుగుతుంది. అంతా టీంగా పని చేస్తారు’’ అని మంగళవారం సాయంత్రం జరిగిన మీడియా సమావేశంలో కేసీ వేణుగోపాల్‌ వ్యాఖ్యానించారు.  


స్వతంత్రుడిగా అసెంబ్లీలోకి.. 
రాజ‌కీయ అటుపోట్లు, ఒడిదుడుకుల‌ను ఎదుర్కొని సీఎం పదవి స్థాయికి ఎదిగిన రేవంత్‌ ప్రస్థానం ఆసక్తికరమే. విద్యార్థి దశలో ఏబీవీపీలో పని చేశారాయన. ఆ తర్వాత 2002లో బీఆర్‌ఎస్‌(అప్పుడు టీఆర్‌ఎస్‌)లో చేరి కొంతకాలం కొననసాగారు. ఆ తర్వాత 2006లో జడ్పీటీసీ మెంబర్‌గా స్వతంత్ర అభ్యర్థిగా విజయం సాధించి ప్రత్యక్ష రాజకీయాల్లో అడుగుపెట్టారు రేవంత్‌. సొంతూరైన కొండారెడ్డిపల్లి అచ్చంపేట నియోజకవర్గంలో ఉన్నా.. కల్వకుర్తి నియోజకవర్గంలోని మిడ్జిల్‌ మండలంలో అధికార కాంగ్రెస్‌ పార్టీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలను కూడగట్టి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి.. జడ్పీటీసీ సభ్యునిగా గెలుపొందడం విశేషం. 

అనంతరం 2007లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కొడంగల్‌ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా నెగ్గి శాసన మండలి సభ్యుడిగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. మహబూబ్‌నగర్‌లో దాదాపు 100 ఓట్ల ఆధిక్యమున్న అధికార కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిని రేవంత్‌ ఓడించడం గమనార్హం. ఆ తర్వాత టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి దగ్గరై.. 2009లో కొడంగల్‌ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా 6వేలకు పైగా మెజార్టీతో నెగ్గి శాసనసభకి చేరారు . 

తిరిగి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత 2014 అసెంబ్లీ ఎన్నికల్లోనూ కొడంగల్‌ నుంచే పోటీ చేసి.. 14 వేల మెజార్టీతో మళ్లీ నెగ్గారు. ఆపై అసెంబ్లీలో ఆయన్ని ఫ్లోర్‌ లీడర్‌గా నియమించింది టీడీపీ. అయితే 2017 అక్టోబర్‌లో కాంగ్రెస్‌లో చేరతారనే ప్రచారం నడుమ.. ఆయన్ని ఆ పదవి నుంచి తప్పించగా, చివరకు 2017 అక్టోబర్‌ 31వ తేదీన ఆయన కాంగ్రెస్‌లో చేరారు. 

2018 ఎన్నికల్లో కొడంగల్‌ నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా  పోటీ చేసి పట్నం నరేందర్‌రెడ్డి చేతిలో తొలి ఓటమి చవిచూశారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడినా.. 2019 సార్వత్రిక ఎన్నికల్లో మల్కాజ్‌గిరి లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసి 10వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారాయన. 

దూకుడు స్వభావం ఉండడం, కేసీఆర్‌ ప్రభుత్వాన్ని నిలదీసే తత్వం ఆయనకు డైనమిక్‌ లీడర్‌ అనే గుర్తింపును జనాల్లో తెచ్చిపెట్టాయి. రేవంత్‌కు 2018 సెప్టెంబర్‌లో తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌కమిటీలో(ముగ్గురు సభ్యులుండే..) వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ బాధ్యతల్ని, 2021 జులైలో ఏకంగా టీపీసీసీ చీఫ్‌ బాధ్యతలు అప్పజెప్పింది. 

ఈ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా కొడంగల్‌ నుంచి, కామారెడ్డి నుంచి పోటీ చేసి.. కొడంగల్‌లో మంచి మెజారిటీతో(32 వేల ఓట్ల) గెలుపొందగా, కామారెడ్డిలో మాత్రం ఓటమి పాలయ్యారు. 

వివాదాలున్నా.. 
కాంగ్రెస్‌ విజయ సారథిగా ఈ ఎన్నికలతో గుర్తింపు దక్కించుకున్న రేవంత్‌రెడ్డి పేరు సీఎం రేసులో ముందు నుంచే వినిపిస్తూ వచ్చింది.  అయితే ఓటుకు నోటు లాంటి కేసు, పార్టీలో పలువురితో పొసగడకపోవడంతో పాటు లోక్‌సభ ఎన్నికల్లో మల్కాజ్‌గిరి నుంచి పెద్ద మెజార్టీతో గెలుపొందలేదనే కారణాలను చెప్పి కాంగ్రెస్‌ సీనియర్లు రేవంత్‌ ఎంపికకు అడ్డుపడ్డారు. అయినప్పటికీ రేవంత్‌రెడ్డి పేరునే ఎక్కువ మంది ఎమ్మెల్యేలు సమర్థించగా.. తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను గెలుపు బాట పట్టించారని భావించిన అధిష్టానం సైతం ఆయన వైపే మొగ్గు చూపించింది.

వ్యక్తిగత జీవితం..
రేవంత్‌రెడ్డి 1969, నవంబర్‌ 8వ తేదీన మహబూబ్‌నగర్‌ కొండారెడ్డి పల్లిలో జన్మించారు. తల్లిదండ్రులు నర్సింహారెడ్డి, రాంచంద్రమ్మ. వనపర్తిలో పాలిటెక్నిక్‌ చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ ఏవీ కాలేజ్‌ నుంచి బీఏ చేశారాయన. జర్నలిస్ట్‌గానూ ఆయన ఓ వార్త పత్రికలో పని చేసినట్లు తెలుస్తోంది. అలాగే కొన్నాళ్లపాటు ప్రింటింగ్‌ ప్రెస్‌ కూడా నడిపారాయన. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జైపాల్‌రెడ్డి దగ్గరి బంధువైన గీతాను 1992లో రేవంత్‌రెడ్డి వివాహం చేసుకున్నారు. రేవంత్‌రెడ్డి-గీత దంపతులకు ఒక బిడ్డ నైమిషా రెడ్డి. ఈమె వివాహం 2015లో ఏపీకి చెందిన వ్యాపారవేత్త వెంకట్‌రెడ్డి తనయుడు సత్యనారాయణతో జరిగింది. ఈ జంటకు ఓ బాబు. మనవడు పుట్టిన సమయంలో తాత అయ్యాననే ఆనందంలో ఓ ఫొటో, అలాగే ఈ పంద్రాగష్టు రోజున మనవడితో దిగిన మరో ఫొటోను రేవంత్‌రెడ్డి తన సోషల్‌మీడియా ప్లాట్‌ఫామ్‌లో సంబురంగా షేర్‌ చేసుకున్నారు కూడా. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement