రాజకీయ నాయకులు పదవులంటే తెగ మోజు పడతారు. వాటి కోసం పెద్ద నాయకుల చుట్టూ తిరుగుతారు. కాని హస్తం పార్టీలో పదవులిస్తామంటే పారిపోతున్నారట. ఆ పదవి మాకొద్దు.. అదేదో మీరే అనుభవించండని సీనియర్లకు తెగేసి చెబుతున్నారట. ఇంతకీ తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో పదవులంటే ఎందుకు భయపడుతున్నారు?
జేబుకు చిల్లు?
కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఇతర పార్టీల కంటే కొంచెం ఎక్కువే. ప్రతి విషయంలోనూ నాయకులు ఉత్తర, దక్షిణ ధృవాల్లా వ్యవహరిస్తుంటారు. పదవుల కోసం కుస్తీ కూడా అందరికీ తెలిసిందే. కాని తెలంగాణ కాంగ్రెస్‌లో ఇటీవల ఏదైనా హోదా ఇస్తామన్నా.. పదవి ఇస్తామన్నా వద్దు బాబోయ్ అంటూ పారిపోతున్నారట. పెద్దవారు మీరే ఆ బాధ్యత తీసుకోండని చెప్పి చల్లగా జారుకుంటున్నారట నాయకులు.
రెండుసార్లు అధికారం లేక అల్లాడిపోతోంది కాంగ్రెస్ పార్టీ. నాయకుల జంపింగ్‌లతో రాష్ట్రంలో రాను రాను నీరసించిపోతోంది. ఉన్నవారు నిధుల కోసం నానాపాట్లు పడుతున్నారు. ఏదైనా కార్యక్రమం జరిగినపుడు దాని బాధ్యత తీసుకోమంటే అధికారంలో ఉన్నపుడు అయితే పోటీ పడేవారు. ఇప్పుడు మాత్రం డబ్బు ఖర్చు పెట్టాల్సిన బాధ్యతలు వద్దని తప్పుకుంటున్నారు.
పిలిస్తే ఖర్చు, పిలవకపోతే ఖాళీ
ఏ చిన్న కార్యక్రమం నిర్వహించాలన్నా నిధులు అవసరం అవుతాయి. పెద్ద నాయకులైతే ఏదో విధంగా డబ్బు సమకూర్చుకుంటారు. రాష్ట్ర స్థాయి అయితే గాంధీభవన్ చూసుకుంటుంది. స్థానికంగా జరిగే కార్యక్రమాలు... రాష్ట్రం అంతటా ప్రాంతాలవారీగా జరిగే కార్యక్రమాలైతే అక్కడి నాయకులే భరించాల్సి ఉంటుంది. ఈ 8 సంవత్సరాల్లో జరిగిన అనేక కార్యక్రమాలు నిర్వహించి, ఉప ఎన్నికల బాధ్యతలు మోసిన.. చోటా మోటా నాయకుల నుంచి సీనియర్ల వరకు చాలా ఖర్చు చేశారు. అందుకే ఇటీవల ఏదైనా కమిటీ బాధ్యతలు అప్పగిస్తున్నా.. కార్యక్రమాల బాధ్యత అప్పగిస్తున్నా వద్దని ఖరాకండీగా చెప్పేస్తున్నారట. తమ చేతి చమురు వదులుతుందని భయపడి పారిపోతున్నారని గాంధీ భవన్ వర్గాలు చెబుతున్నాయి.
జోడో అనగానే బాగో
తాజాగా..మునుగోడు ఉప ఎన్నిక, రాహుల్ గాంధీ పాదయాత్ర రెండు ఓకేసారి రావడంతో కాంగ్రేస్ నేతలు కలవరపడుతున్నారు. రెండూ ఆర్టికంగా భారమైనవే కావడంతో నేతలు డీలా పడిపోతున్నారు. ఇప్పటికే మునుగోడు ఉప ఎన్నిక కోసం చాలామంది నేతలకు గ్రామాల వారిగా ఇంఛార్జ్ బాధ్యతలను అప్పగించింది పీసీసీ. చాలా రోజుల నుంచి ఆయా గ్రామాలలో ఖర్చంతా ఇంఛార్జ్ నేతలే భరిస్తున్నారు.
కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి నామినేషన్ వేసిన తర్వాత పార్టీ తరుపున కొంత మోత్తాన్ని ఆయా గ్రామాల ఇంచార్జ్ లకు పార్టీ తరపున ఇస్తున్నట్లు సమాచారం. కానీ చాలా మంది నేతలు ఇంఛార్జ్ బాధ్యతలు తీసుకోవడానికి ఇష్ట పడడంలేదు. మరికొందరు బాధ్యతలు ఇచ్చినట్లు ప్రకటించినా తమకు వద్దని తప్పించుకుంటున్నారు.
గాంధీ భవన్‌కు దూరం
దామోదర రాజనర్సింహా, గీతారెడ్డి, మధు యాష్కి, మహేశ్వర్ రెడ్డి లాంటి వారు సైలెంట్ గా మునుగోడు భాధ్యతల నుంచి తప్పించుకున్నారని తెలుస్తోంది. కనిపిస్తే ఇంచార్జ్ బాధ్యతలు ఎక్కడ ఇస్తారో అని మరికొందరు అసలు గాంధీ భవన్‌కే దూరంగా ఉంటున్నారు. దీంతో భారం అంతా పీసీసీ ఛీఫ్ మోయాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.
మరో వైపు భారత్ జోడో యాత్రకు ఇంఛార్జ్ భాద్యతలు తీసుకునేందుకు చాలా మంది వెనకా ముందు ఆలోచిస్తున్నారు. ఇంఛార్జ్ బాధ్యతలు తీసుకుంటే ఖర్చంతా తమ మీదే వేస్తారేమోనని నేతలు భయపడుతున్నారు. ఈ పరిణామాలు గమనిస్తున్న కొందరు సినియర్ నేతలు పార్టీ పరిస్థితి ఎక్కడి నుంచి ఎక్కడకు దిగజారిందంటూ నిట్టూరుస్తున్నారు.
ఖర్చొద్దు.. పదవులొద్దు
ఒకప్పుడు కమిటీల్లో పదవులు ఇవ్వలేదని అలిగిన నాయకులే.. ఇప్పుడు ఆ పదవులంటే పారిపోతున్నారు. గాంధీభవన్‌కు మళ్ళీ పూరన్వ వైభవం రావాలంటే కనీసం మునుగోడులో మంచి ఫలితం సాధించాలి..అలాగే రాహుల్ గాంధీ తెలంగాణ టూర్ సూపర్ హిట్ కావాల్సిందే అంటున్నారు కాంగ్రెస్ నాయకులు.
చదవండి: కాంగ్రెస్ భిక్షతో ఎదిగినవాళ్లే వెన్నుపోటు పొడిచారు.. రేవంత్ షాకింగ్ కామెంట్స్
Comments
Please login to add a commentAdd a comment