ఇక దూకుడే దూకుడు.. తెలంగాణ కాంగ్రెస్‌కు ‘కర్ణాటక’ కిక్‌! | Telangana Congress Politics Turn After Karnataka Assembly Election | Sakshi
Sakshi News home page

ఇక దూకుడే దూకుడు.. తెలంగాణ కాంగ్రెస్‌కు ‘కర్ణాటక’ కిక్‌!

Published Sat, May 20 2023 7:58 AM | Last Updated on Sat, May 20 2023 8:30 AM

Telangana Congress Politics Turn After Karnataka Assembly Election - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కర్ణాటక ఎన్నికల ఫలితాలు ఇచ్చిన ఉత్సాహంతో దూకుడుగా ముందుకెళ్లేందుకు తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ ప్రణాళికలు రచిస్తోంది. అక్కడి ఫలితాలు రాష్ట్రంలోనూ పునరావృతమవుతాయనే ధీమా వ్యక్తం చేస్తున్న నేతలు.. ఎన్నికలు జరిగే వరకు ఇదే ఊపును కొనసాగించాలని భావిస్తున్నారు. అందులో భాగంగానే ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా పరిధిలోని జడ్చర్లలో ఈ నెల 25న భారీ బహిరంగ సభకు సిద్ధమవుతున్నారు.

సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్‌ మార్చ్‌ పాదయాత్రలో భాగంగా నిర్వహిస్తోన్న ఈ సభకు రాజస్తాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లాట్‌తో పాటు ఇతర కీలక నేతలను ఆహ్వానించనున్నారు. పీపుల్స్‌ మార్చ్‌లో భాగంగా రాష్ట్రంలో మూడు చోట్ల సభలు నిర్వహించాలని కాంగ్రెస్‌ నేతలు గతంలోనే నిర్ణయించారు. అందులో భాగంగా గత నెలలో మంచిర్యాలలో సత్యాగ్రహ సభను నిర్వహించి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను ముఖ్య అతిథిగా ఆహ్వానించారు.

ఇప్పుడు జడ్చర్లలో రెండో సభను నిర్వహించనున్నారు. ఈ నెల 8వ తేదీన సరూర్‌నగర్‌ స్టేడియంలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ సమక్షంలో యూత్‌ డిక్లరేషన్‌ ప్రకటించిన నేతలు.. జడ్చర్ల సభకు భారీ ఎత్తున కేడర్‌ను సమీకరించాలని నిర్ణయించారు. ఉమ్మడి మహబూబ్‌నగర్‌తో పాటు రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల నుంచి జన సమీకరణకు సిద్ధమవుతున్నారు.  

ఆగస్టు కల్లా 50 మంది వరకు అభ్యర్థుల ఖరారు! 
మరోవైపు అభ్యర్థుల ఖరారులోనూ కర్ణాటక ఫార్ములానే తెలంగాణలో అమలు చేయాలనే డిమాండ్‌ చాలా కాలంగా వినిపిస్తోంది. వీలున్నంత మంది అభ్యర్థులను 6 నెలల ముందే ప్ర­క­టించడం ద్వారా ఎన్నికలకు పూర్తిస్థాయిలో సిద్ధమయ్యే అవకాశాన్ని కల్పించాలని చాలామం­ది నేతలు అధిష్టానాన్ని కోరుతున్నారు. ఈ నేపథ్యంలో 45–50 మంది అభ్యర్థులను ఈ ఏడాది ఆగస్టు కల్లా ప్రకటించే అవ­కా­శముందనే చర్చ గాంధీభవన్‌ వర్గాల్లో జరుగుతోంది.  

మరిన్ని డిక్లరేషన్‌లు 
యూత్‌ డిక్లరేషన్‌కు మంచి స్పందన రావడం, దీనిపై ప్రత్యర్థి పార్టీలు కూడా విమర్శలు చేసే పరిస్థితి లేకపోవడంతో మరిన్ని డిక్లరేషన్‌లకు టీపీసీసీ సిద్ధమవుతోంది. మహిళలతో పాటు బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల కోసం డిక్లరేషన్‌లు ప్రకటిస్తామని, తాము అధికారంలోకి వస్తే ఆయా వర్గాలకు చేసే మేలు గురించి వాటిల్లో వివరిస్తామని సరూర్‌నగర్‌ సభలోనే టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ప్రకటించారు. ఈ మేరకు వచ్చే నెలలో మహిళా, బీసీ డిక్లరేషన్‌లు ప్రకటించేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. మహిళా డిక్లరేషన్‌కు సోనియాగాంధీని, బీసీ డిక్లరేషన్‌కు దేశంలోని కాంగ్రెస్‌ ముఖ్యమంత్రులను ఆహ్వానించాలని, తద్వారా కేడర్‌లో ఉత్సాహం నింపాలని, ప్రజలకు మరింత భరోసా కల్పించాలని భావిస్తున్నారు. ఇందుకుగాను సోనియా, రాహుల్‌లలో ఒకరి అపాయింట్‌మెంట్‌ కోసం టీపీసీసీ నేతలు ఇప్పటికే అధిష్టానానికి ప్రతిపాదనలు పంపారు. 

చేరికలపై ప్రత్యేక దృష్టి 
ఇతర పార్టీల నుంచి వీలైనంతగా వలసలు ప్రోత్సహించాలని టీపీసీసీ నిర్ణయించింది. అందులో భాగంగానే బీజేపీ నేతలు ఈటల రాజేందర్, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, వివేక్‌ వెంకటస్వామిలతో పాటు మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావులను రేవంత్‌ కాంగ్రెస్‌లోకి ఆహ్వానించారు. వారు పార్టీలో చేరేందుకు తానే ఇబ్బందిగా ఉన్నట్టయితే పది మెట్లు దిగేందుకు కూడా సిద్ధంగా ఉన్నానని ఆయన ప్రకటించారు. ఈ నేపథ్యంలో పార్టీ చేరికల కమిటీని పరిపుష్టం చేయాలని టీపీసీసీ భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ కమిటీకి ఇప్పటికే జానారెడ్డి చైర్మన్‌గా ఉండగా, సీనియర్‌ నేతలు పొన్నాల లక్ష్మయ్య, జీవన్‌రెడ్డి లాంటి నేతలకు కూడా బాధ్యతలు అప్పగించాలని యోచిస్తున్నారు. వీరు కాంగ్రెస్‌ను వీడిన వారితో, ఇతర పార్టీల్లో అసంతృప్తితో ఉన్న వారితోనూ త్వరలోనే చర్చలు ప్రారంభించనున్నట్టు సమాచారం.

చదవండి👉 ఫ్లాష్‌బ్యాక్‌: ఆ నిర్ణయంతో..అతలాకుతలం  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement