రాజకీయ పార్టీ ఏదైనా కళ్ళు, చెవులు, నోరు అధికార ప్రతినిధులు. ఏ సందర్భమైనా, ఏ సమస్య అయినా పార్టీ మీడియా ముందు వాయిస్ వినిపించేది వారే. కాని తెలంగాణ కాంగ్రెస్ బలంగా వాయిస్ వినిపించాల్సిన స్పోక్స్ పర్సన్స్ గొంతు మూగపోయింది. పార్టీకి బలంగా ఉండాల్సినవారే భారంగా మారారు. గాంధీభవన్లో అసలు ఏం జరుగుతోంది?
అధికారం లేని ప్రతినిధులేరి?
ఢిల్లీ నుంచి హైదరాబాద్ వరకు రాజకీయ పార్టీల్లో వివిధ అంశాలపై మీడియాతో మాట్లాడేది అధికార ప్రతినిధులే. పార్టీ విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్ళేది, ప్రత్యర్థి పార్టీల విమర్శలను ఎదుర్కొనేది, తిప్పి కొట్టేది వీరే. అన్ని పార్టీల్లోనూ అఫీషియల్ స్పోక్స్ పర్సన్స్ కీలక పాత్ర పోషిస్తారు. తాజా పరిణామాల నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్లో పార్టీ గురించి మాట్లాడేవారే కరువయ్యారు. ఉండటానికి డజన్‌గా పైగా ప్రతినిధులున్నా.. ప్రజా సమస్యల మీద, రాజకీయాల మీద స్పందించేవారు కనిపించడంలేదు. అసలు స్పోక్స్ పర్సన్స్ ఎవరో కూడా పార్టీ నాయకులకు తెలియదంటూ అతిశయోక్తి కాదు. పార్టీలో జరిగిన కొన్ని ఘటనలతో తమకెందుకీ గొడవ అనుకుంటున్న అధికార ప్రతినిధులు సైలంట్ అయినట్లు సమాచారం.
నోరు మెదపరా? కాలు కదపరా?
పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి వచ్చాక పార్టీలో ఏవైనీ నియామకాలు జరిగాయంటే... అది అధికార ప్రతినిధులను అపాయింట్ చేయడం మాత్రమే. కొత్త అధికార ప్రతినిధుల నియామకం జరిగి ఏడాదిన్నర అవుతున్నా... సగం మంది కూడా గాంధీ భవన్ వైపు కన్నెత్తి కూడా చూడటంలేదు. రాష్ట్రంలో జరుగుతున్న ఏ ఒక్క పరిణామం మీదా ఈ స్పోక్ పర్సన్స్ స్పందించిన దాఖలాలే లేవు. టీ.కాంగ్రెస్కు అసలు అధికార ప్రతినిధులు ఉన్నారా అనే సందేహం కలిగేవిధంగా వారి ప్రవర్తన ఉందంటున్నారు. పార్టీకి అండగా ఉండాల్సిన అధికార ప్రతినిధులు సైలెంట్ గా ఉంటూ తమ సొంత పనులు చేసుకుంటూ పార్టీకి టైమ్ కేటాయించడంలేదనే టాక్ పార్టీలో బలంగా వినిపిస్తోంది.
కండీషన్స్ అప్లై ఎందుకు?
కాంగ్రెస్ పార్టీ కష్టాల్లో ఉంటే అధికార ప్రతినిధుల తీరు చర్చనీయాంశంగా మారింది. టీ.కాంగ్రెస్‌లోని ఐదుగురు సీనియర్ అధికార ప్రతినిధుల్లో ఒకరైన బెల్లయ్య నాయక్ భారత్ జోడోయాత్రలో పాదయాత్ర చేస్తున్నారు. అద్దంకి దయాకర్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పై కామెంట్స్ చేసినప్పటి నుండి గాంధీ భవన్‌లో మీడియా సమావేశాలు బంద్ చేశారు. ఇలా ఒక్కొక్కరు ఒక్కో విధంగా...పార్టీ నాయకుల వైఖరితో విసిగిపోయి కొందరు.
వివిధ పనుల్లో బీజీ అయిపోయి మరికొందరు పార్టీలో తమ విధులకు దూరంగా ఉంటున్నారు. 8 మంది కొత్త వాళ్ళలో ఇద్దరు ముగ్గురు ప్రతినిధులు మాత్రమే అప్పుడప్పుడు పార్టీ వాయిస్ వినిపిస్తున్నారు. మిగతా వారు పార్టీ గొంతు వినిపించడంలో ముందుకు వచ్చిన దాఖలాలు లేవు. అంతేకాదు ప్రజా సమస్యలపై ఏదైనా విషయం పై సమీక్ష జరిగేటప్పుడు...పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో తెలుసుకోవడానికి కూడా వారు ఇష్టపడటం లేదు. ఏ ఒక్క సమావేశానికి అధికార ప్రతినిధులు పూర్తిస్థాయిలో హాజరుకావడం లేదు.
సార్ వారి సమావేశానికి డుమ్మా
పార్టీ నిర్వహించే సమావేశాలకు, మీడియా సమావేశాలకి డుమ్మా కొడుతూ ఏదో ఒక సాకు చెబుతున్నారట ఆ అధికార ప్రతినిధులు. కిసాన్ కాంగ్రెస్ సమీక్ష సమావేశానికి అధికార ప్రతినిధులందరికీ ఆహ్వానం పంపించినప్పటికీ అందరూ డుమ్మా కొట్టారు. దీంతో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేగాకుండా సమావేశానికి ఎందుకు హాజరు కాలేదో వివరణ ఇవ్వాలంటూ పీసీసీ తరపున నోటీసులు జారీ చేశారు. కొద్ది రోజుల క్రితం సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి కాంగ్రెస్‌ను వీడుతూ పార్టీ పైన , పీసిసి చీఫ్ రేవంత్ తో పాటు ఏఐసీసీ అగ్రనేతలపైనా తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
ఇంత జరిగిన తర్వాత కూడా మర్రి వ్యాఖ్యల మీద పార్టీలో ఏ ఒక్క అధికార ప్రతినిధి కూడా స్పందించలేదు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీద కామెంట్స్ చేసిన తర్వాత జరిగిన పరిణామాలతో అధికార ప్రతినిధులు సీనియర్ల మీద స్పందించడానికి భయపడుతున్నారట. అందరూ అద్దంకి దయాకర్‌ను ఉదాహరణగా తీసుకుని జాగ్రత్త పడుతున్నారని టాక్ నడుస్తోంది. పార్టీకి అండగా నిలవాల్సిన అధికార ప్రతినిధులు భారంగా మారడంతో... వారిపై వేటు వేసేందుకు పీసీసీ సిద్ధమవుతోందట.
పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్
feedback@sakshi.com
Comments
Please login to add a commentAdd a comment