సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో టీఆర్‌ఎస్ తిరుగులేని రాజకీయ శక్తిగా ఎదిగిందని ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఈ నెల 25న హైదరాబాద్‌లో జరిగే పార్టీ ప్లీనరీ, వచ్చే నెల 15న వరంగల్‌లో జరగనున్న తెలంగాణ విజయగర్జన సభ సన్నాహాలపై ఆయన వరుస సమావేశాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో నాలుగో రోజు గురువారం ఉమ్మడి మెదక్, కరీంనగర్, నల్లగొండ జిల్లాల పరిధిలోని 18 అసెంబ్లీ నియోజకవర్గాల ముఖ్యనేతలతో భేటీ అయ్యారు.
ఈ సమావేశాల్లో మంత్రులు జగదీశ్‌రెడ్డి, పువ్వాడ అజయ్‌కుమార్, ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు బి.వినోద్‌కుమార్‌తో పాటు సంబంధిత నియోజకవర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ, ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ వాటి పరిష్కారం దిశగా ముఖ్యమంత్రి కేసీఆర్ చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు పార్టీని ప్రజలకు మరింత దగ్గర చేశాయన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణకు నోరు, నీరు లేకుండా పోయిందని, అలాంటి పరిస్థితుల్లో ఆవిర్భవించిన టీఆర్‌ఎస్‌తో తెలంగాణ ప్రజలకు ఆత్మగౌరవం దక్కిందని పేర్కొన్నారు.
రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో 103 మంది టీఆర్‌ఎస్‌కు చెందిన ఎమ్మెల్యేలు ప్రాతినిథ్యం వహించడం, 32 జిల్లా పరిషత్‌లను టీఆర్‌ఎస్ పార్టీ సంపూర్ణంగా కైవసం చేసుకోవడం గొప్ప విషయమని కేటీఆర్ వ్యాఖ్యానించారు. వచ్చే నెల 15న వరంగల్‌లో జరిగే తెలంగాణ విజయగర్జన సభకు అన్ని నియోజకవర్గాల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చేలా చూడాలని ఆయన సూచించారు. విజయగర్జన సభకు బయలుదేరే ముందు గ్రామాల్లో పార్టీ జెండాలను ఆవిష్కరించాలని ఆదేశించారు.
పటాన్‌చెరు, నర్సాపూర్, మెదక్, అందోల్, నారాయణఖేడ్, జహీరాబాద్, జగిత్యాల, మంథని, వేములవాడ, మానకొండూరు, భువనగిరి, ఆలేరు, మునుగోడు, కోదాడ, నాగార్జునసాగర్, నకిరేకల్, నల్లగొండ, మిర్యాలగూడ నియోజకవర్గాలకు చెందిన నాయకులకు మంత్రి కేటీఆర్ పలు సూచనలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment