సాక్షి ప్రతినిధి నల్లగొండ: ‘రైతుల గురించి తెలియని రాహుల్‌గాంధీ వచ్చి వరంగల్‌లో రైతుల సంఘర్షణ సభ అన్నారు. అది రైతు సంఘర్షణ సభ కాదు.. కాంగ్రెస్‌లో సంఘర్షణ సభ’అని మంత్రి కేటీఆర్ విమర్శించారు. రాహుల్‌కు ఎడ్లు తెలియదు, వడ్లు తెలియదని.. విందులు, చిందులు, వేరే దేశాల్లో పబ్బులు, క్లబ్బులు బాగా తెలుసని ఎద్దేవా చేశారు.
అలాంటి ఆయన వరంగల్‌కు వచ్చి రైతులను ఉద్ధరిస్తామని, ఒక్క చాన్స్ ఇవ్వాలని అడుగుతున్నారని.. నాగార్జునసాగర్‌లో ఏడుసార్లు, దేశంలో పదిసార్లు ఆ పార్టీకి అవకాశమిచ్చినా ఏం చేయలేదని ధ్వజమెత్తారు. నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని సుంకిశాలలో ఇన్‌టేక్ వెల్ నిర్మాణం, నందికొండ, హాలియా మున్సిపాలిటీల్లో అభివృద్ధి పనులకు కేటీఆర్ శనివారం శంకుస్థాపన చేశారు.
బుద్ధవనాన్ని ప్రారంభించారు. తర్వాత హాలియాలో బహిరంగ సభలో మాట్లాడారు. ఇన్నేళ్లలో రైతుబంధు, 24 గంటల కరెంటు, రైతుబీమా, రూ.2 వేల పెన్షన్‌ను కాంగ్రెస్ ఎందుకు ఇవ్వలేదని నిలదీశారు. సంక్రాంతికి గంగిరెద్దులవాళ్లు వచ్చినట్లు మళ్లీ వస్తారని, వారిని నమ్మొద్దని అన్నారు.
సాగర్‌కు ఇన్నాళ్లూ ప్రాతినిధ్యం వహించిన పెద్దలేం చేశారు?
సాగర్‌లో టీఆర్‌ఎస్ నుంచి భగత్ గెలిచాక అనతి కాలంలోనే సీఎం కేసీఆర్ హామీ మేరకు నియోజకవర్గంలో రూ.826 కోట్లతో అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయని కేటీఆర్ చెప్పారు. నెల్లికల్లు పనులు రూ.670 కోట్లతో పరుగులు పెడుతున్నాయని, పూర్తి చేసే బాధ్యత తమదేనని చె ప్పారు. దశాబ్దాలపాటు సాగర్ నుంచి ప్రాతినిధ్యం వహించిన పెద్దలు జిల్లాకు ఏం చేశారని ప్రశ్నించారు.
ఫ్లోరోసిస్ మహమ్మారితో లక్షలాది మంది జీవచ్ఛవాలుగా మారారన్నారు. పక్కనే కృష్ణానది ఉన్నా ఆ నీళ్లను తెచ్చి ఇవ్వలేని అసమర్థత గతంలో పరిపాలించిన వారిదేనని విమర్శించారు. కేసీఆర్ సీఎం అయ్యాక రూ.46 వేల కోట్లతో మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ నల్లా నీరు అందించి ఫ్లోరోసిస్‌ను తరిమికొట్టారన్నారు. కార్యక్రమంలో మంత్రులు జగదీశ్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ కోటిరెడ్డి, సాగర్ ఎమ్మెల్యే భగత్ పాల్గొన్నారు.
మేనమామగా పెళ్లి కట్నం
అమ్మాయి పెళ్లయితే మేనమామ కట్నం పెడతాడో పెట్టడో కానీ.. కేసీఆర్ మాత్రం మేనమామగా తెల్లకార్డున్న ఆడపిల్ల పెళ్లికి రూ.1.16 లక్షల చొప్పున కట్నం కల్యాణలక్ష్మి, షాదీముబారక్ ద్వారా ఇస్తున్నారని మంత్రి కేటీఆర్ చెప్పారు. కేసీఆర్ తీసుకున్న నిర్ణయంతో ముసలి వారికి గౌరవం పెరిగిందని, నేడు.. అత్తా టిఫిన్ తింటావా అన్నం తింటావా అనే పరిస్థితి వచ్చిందంటే దానికి కేసీఆర్ ఇస్తున్న రూ. 2 వేల పెన్షన్ కారణమన్నారు. కేసీఆర్ మనవడు, మనవరాలు ఏ సన్న బియ్యం బువ్వ తింటున్నారో గురుకుల పాఠశాలల్లో విద్యార్థులూ అదే సన్న బియ్యం బువ్వ తింటున్నారని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment