ప్రభుత్వ ఉన్నతాధికారులు రాజకీయాల్లోకి రావడం, తమదైన తీరులో ముద్ర వేయడం కొత్తేమీ కాదు. గతంలో అనేక మంది ఐఏఎస్, ఐపీఎస్‌లతో పాటు అనేక మంది ఉన్నతాధికారులు పాలిటిక్స్‌లో సత్తాచాటారు. వారిలో కొంతమంది రాజకీయాలు తమకు సరిపోవని తూర్పు తిరిగి దండంపెట్టి గుడ్ బై చెప్పారు. అయితే వారంతా తమ పదవులకు రాజీనామా చేసి ఆ తర్వాతనే రాజకీయాల్లో మునిగి తేలారు. వారు పద్ధతి ప్రకారం నడుచుకుంటే తెలంగాణకు చెందిన ఓ ఉన్నతాధికారి మాత్రం ఆ సంప్రదాయాన్ని పాటించడం లేదు. వివాదస్పద వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో ఉంటున్నారు.
శ్రీనివాస్ రూటే సపరేటు
ఈయన పేరు గడల శ్రీనివాసరావు.. తెలంగాణ రాష్ట్ర హెల్త్ డైరెక్టర్. కరోనా మహమ్మారి సమయంలో ఎప్పటికప్పుడు తాజా సమాచారం తెలియజేస్తూ టీవీల్లో కనిపించేవారు. అలా ప్రజలకు పరిచయమైన ఈయన ఈ మధ్యకాలంలో వివాదాస్పద ప్రకటనల కారణంగా తరచుగా వార్తల్లో వుంటున్నారు. సాధారణంగా ప్రభుత్వ అధికారి ప్రభుత్వ కార్యక్రమాలకు మాత్రమే పరిమితం కావాలి కానీ గడల శ్రీనివాసరావు రూటే సపరేటు. ఏ కాస్త అవకాశం దొరికినా సరే పొలిటీషియన్‌లాగా వ్యవహరించడానికి ఆయన ఇష్టపడుతున్నారు.
రాజకీయాలకే ఎక్కవ టైం
ఉన్నత అధికారిగా నిర్వహించాల్సిన సేవలకు కాకుండా రాజకీయాలకే ఆయన ఎక్కువ సమయం కేటాయిస్తున్నారనే విమర్శలు ఈ మధ్యకాలంలో ఎక్కువయ్యాయి. ప్రజాప్రతినిధిగా గెలిచి అసెంబ్లీలో అధ్యక్షా అనాలనే కోరిక గడల శ్రీనివాసరావుకు బలంగా వున్నట్లుంది. అందుకేనేమో ఆయన హెల్త్ డైరెక్టర్ విధులను మర్చిపోయి కొత్తగూడెంనకు మాత్రమే పరిమితం అయ్యారన్న చర్చ నడుస్తోంది.
చదవండి: ‘ధరణి’ని కాదు.. కాంగ్రెస్‌ను బంగాళాఖాతంలో కలిపేయాలి: సీఎం కేసీఆర్
టార్గెట్ వనమా!
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కొత్తగూడెం నుంచి పోటీ చేసి తీరతానంటూ ఇప్పటికే పలుమార్లు ఆయన తన మనసులో మాట వెలిబుచ్చారు. అంతేకాదు ఒకడుగు ముందుకేసి కొత్తగూడెం సిట్టింగ్ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావును టార్గెట్ చేశారు. కొత్తగూడెం నియోజకవర్గం ఉల్వనూరులో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఎమ్మెల్యేను ఉద్దేశించి వివాదాస్పద కామెంట్స్ చేయడం అధికార పార్టీలో చర్చనీయాంశంగా మారింది. వనమాకు 80 ఏళ్ళు వచ్చాయి. ఆయన రిటైర్మెంట్ తీసుకోవాల్సిన సమయమని.. ఇంకా ఎంతకాలం ఆయన రాజీకాయల్లో ఉంటారంటూ గడల శ్రీనివాసరావు సెటైర్లు విసిరారు.
వేడేక్కిన రాజకీయం
అంతటితో ఆగకుండా నేను అభివృద్ధి చేయడానికి వస్తే అడ్డుకుంటారా అంటూ ఆవేదన చెందారు. కొత్త కొత్తగూడెంను చూద్దాం. కొత్త కొత్తగూడెంను నిర్మించుకుందాం అని ప్రజలకు పిలుపు నిచ్చారు. మీరంతా నాతో కలిసి నడవడానికి సిద్ధంగా ఉన్నారా అని కార్యక్రమానికి వచ్చినవారిని అడగడం సంచలనంగా మారింది. దీంతో ఒక్కసారిగా రాజకీయ వాతావరణం వేడెక్కింది.
స్థాయికి సరిపోని వ్యాఖ్యలు, విమర్శలు
రాష్ట్ర హెల్త్ డైరెక్టర్‌గా పని చేస్తున్న గడల శ్రీనివాసరావుకు వివాదస్పద వ్యాఖ్యలు చేయడం కొత్త కాదు. ఆయన పలుమార్లు తన స్థాయికి సరిపోని వ్యాఖ్యలు, విమర్శలు చేసి వార్తల్లో వ్యక్తిగా నిలిచారు. ప్రభుత్వ ఉన్నతాధికారిగా ఉండి ఆయన ఈ రకంగా వ్యవహరించడాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ఎందుకు ఉపేక్షిస్తున్నారు? అనేది ప్రస్తుతం రాజకీయాల్లో చర్చనీయాంశమవుతోంది. రాజకీయాలంటే ఇంట్రెస్ట్ వుంటే ఉద్యోగానికి రాజీనామా చేయాలి. అంతే తప్ప అధికారిగా ఉంటూ రాజకీయాలు చేయడం ఏంటన్న చర్చ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో జోరుగా సాగుతోంది.
చదవండి: వీరి సంగతేంటి?.. బీజేపీకి పెద్ద దెబ్బే పడుతుందా?
Comments
Please login to add a commentAdd a comment