హరీశ్, ఈటల తోడు దొంగలే.. | Telangana: Revanth Reddy Comments Over Harish Rao And Etela Rajender | Sakshi
Sakshi News home page

హరీశ్, ఈటల తోడు దొంగలే..

Published Sat, Oct 9 2021 4:03 AM | Last Updated on Sat, Oct 9 2021 4:22 AM

Telangana: Revanth Reddy Comments Over Harish Rao And Etela Rajender - Sakshi

హుజూరాబాద్‌లో జరిగిన సమావేశంలో మాట్లాడుతున్న రేవంత్‌రెడ్డి. చిత్రంలో షబ్బీర్‌ అలీ, మధుయాష్కీ, జీవన్‌రెడ్డి, బల్మూరి వెంకట్, శ్రీధర్‌బాబు తదితరులు 

హుజూరాబాద్‌: హరీశ్‌రావు, ఈటల రాజేందర్‌.. ఇద్దరూ తోడు దొంగలేనని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆరోపించారు. శుక్రవారం కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి బల్మూరి వెంకటనరసింగరావు.. మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌లతో కలసి నామినేషన్‌ వేశారు. అనంతరం హుజూరాబాద్‌ పట్టణంలోని డిపోక్రాస్‌ వద్ద జరిగిన ఎన్నికల ప్రచారంలో రేవంత్‌రెడ్డి మాట్లాడారు. విద్యార్థులు, నిరుద్యోగుల త్యాగం వల్ల తెలంగాణ వచ్చిందన్నారు.

వారి త్యాగాలు వృథా కాకుండా కేసీఆర్‌ను గద్దె దించేందుకే విద్యార్థి నాయకుడైన బల్మూరి వెంకట్‌ను కాంగ్రెస్‌ పార్టీ పోటీకి నిలిపిందన్నారు. హుజూరాబాద్‌లో టీఆర్‌ఎస్, బీజేపీ నాయకులు అక్రమ సంపాదనతో వందల కోట్లు ఖర్చు చేస్తున్నారని, అలాంటి సంపద కాంగ్రెస్‌ నాయకుల వద్ద లేదని అన్నారు. 25 ఏళ్ల యువకుడికి కాంగ్రెస్‌ అవకాశం ఇచ్చిందని.. ప్రజలకు సేవ చేసే అవకాశాన్ని కల్పించి యువకుడైన ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్‌ను ఆశీర్వదించాలని ప్రజలను కోరారు.

కేసీఆర్, ఈటల వద్ద ఉన్నంత డబ్బు కాంగ్రెస్‌ అభ్యర్థి దగ్గర లేదన్నారు. కేసీఆర్, ఈటల రాజేందర్‌లది ప్రజల సమస్య కాదని, పైసలు.. పంపకాల పంచాయతీ అని అన్నారు. హుజూ రాబాద్‌లో బీజేపీ, టీఆర్‌ఎస్‌ కోట్లు పోసి నాయకులను కొంటున్నాయని, అభివృద్ధి జరిగిందని చెబుతున్న టీఆర్‌ఎస్, ఆత్మగౌరవం అంటున్న ఈటల రాజేందర్‌లకు నేతలను కొనాల్సిన అవసర మేంటని ప్రశ్నించారు. కేసీఆర్‌ ఈ ఏడేళ్లలో ప్రజలకు చేసిందేమీ లేదని, కానీ అల్లుడిని అంబానీ, బిడ్డను బిర్లా, కొడుకును టాటా చేశారని విమర్శిం చారు.

కసబోడు అమ్ముడు పోయాడని, వాని పేరు తలవడమే తనకు ఇష్టం లేదని పరోక్షంగా పాడి కౌశిక్‌రెడ్డిని ఉద్దేశించి విమర్శించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ప్రజల సమస్యలను ఎప్పుడూ పట్టించుకోలేదని పేర్కొన్నారు. ఏడేళ్లుగా ఇటువైపు కన్నెత్తి చూడని వారు ఇప్పుడు హుజూరాబాద్‌కు వచ్చి అది చేస్తాం, ఇది చేస్తామని చెప్తున్నారని, ఎన్నికల తర్వాత ఎవరూ కనిపించరని ధ్వజమెత్తారు. కేసీఆర్‌ వంటి నయవంచకుడి మెడలు వంచాలంటే బల్మూర్‌ను గెలిపించాలని కోరారు.

నేను కరీంనగర్‌ జిల్లా బిడ్డనే..  
‘నేను కరీంనగర్‌ జిల్లా బిడ్డనే. మారుమూల పల్లె నుంచి వచ్చిన వాడిని. ఎంబీబీఎస్‌ విద్యార్థినైనా ఇతర విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం ఎంతో పోరాటం చేశాను. హుజూరాబాద్‌ ఎమ్మెల్యేగా నన్ను గెలిపిస్తే 365 రోజులు మీకు అండగా ఉంటా. విద్యార్థులకు, యువకులకు, ప్రజలకు సేవ చేయమని నా తల్లి పంపింది. ప్రజల సమస్యలపై పోరాడి పరిష్కరించే వరకు పనిచేస్తా. లేనిపక్షంలో రాజకీయాల నుంచి తప్పుకుంటా’అని కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి బల్మూరి వెంకట్‌ అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, మాజీ ఎంపీలు మధుయాష్కీగౌడ్, పొన్నం ప్రభాకర్, మాజీ మంత్రులు గీతారెడ్డి, షబ్సీర్‌ అలీ, ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు, మాజీ ఎమ్మెల్సీ ప్రేంసాగర్‌రావు తదితరులు పాల్గొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement