సాక్షి, హైదరాబాద్: ‘రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఓటర్లే కాంగ్రెస్ పార్టీకి బలం. అణగారినవర్గాలే మన సంప్రదాయ ఓటు బ్యాంకు. కానీ, ఆ వర్గాలను శాస్త్రీయంగా అంచనా వేయడంలో మనం విఫలం అవుతున్నాం. ఆ వర్గాల మద్దతు కోల్పోవడంతోనే తెలంగాణ కాంగ్రెస్‌కు వరుస ఓటములు ఎదురవుతున్నాయి. రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్ జాతీయ నాయకత్వం మీద, సోనియాగాంధీ మీద సానుకూలత ఉంది. అయితే, రాష్ట్ర కాంగ్రెస్ నేతల తీరు వారిని పార్టీకి దూరం చేస్తోంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను విస్మరిస్తూ పెత్తన రాజకీయాలు చేస్తున్న కారణంగానే పడిపోతున్నాం’అని తెలంగాణ ‘సామాజిక కాంగ్రెస్’బృందం అభిప్రాయపడింది.
ఈ మేరకు టీపీసీసీ నేతలు అద్దంకి దయాకర్, రాములునాయక్, గోమాస శ్రీనివాస్, సాజిద్‌ఖాన్ తదితరులతో కూడిన బృందం ఢిల్లీ వెళ్లి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతోపాటు పార్టీ ముఖ్యులకు నివేదిక అందజేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలను నిలబెట్టుకోవడంలో విఫలమైన కారణంగానే 2014 ఎన్నికల తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి నానాటికీ దిగజారిపోతోందని, ఈ వర్గాలు నాయకత్వంపై నమ్మకం ఉంచకపోతే రాష్ట్రంలో పార్టీ మనుగడ సాగించలేదని ఈ నివేదికలో ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలకు సామాజిక కాంగ్రెస్ బృందం నివేదించింది. ఉదయ్‌పూర్ డిక్లరేషన్‌లో భాగంగా ఈ వర్గాలకు అన్ని అంశాల్లో ప్రాధాన్యత ఉంటుందని భావించామని, కానీ ఆ విధంగా జరగలేదని తెలిపారు. 2023 అసెంబ్లీ, 2024 పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో ఉదయ్‌పూర్ డిక్లరేషన్ అమలుకు అధిష్టానం చొరవ తీసుకోవాలని కోరారు.
వాళ్లు డబ్బులు... మనం సోషల్ ఇంజనీరింగ్
రాష్ట్రంలోని టీఆర్‌ఎస్, బీజేపీలు ఎన్నికల సమయంలో భారీఎత్తున డబ్బులు వెదజల్లుతూ ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్న నేపథ్యంలో సోషల్ ఇంజనీరింగ్ ద్వారానే కాంగ్రెస్ పార్టీ ఆ రెండు పార్టీలను ఎదుర్కోగలదని నివేదికలో వివరించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల ఓట్లు తెలంగాణలో 90 శాతం ఉన్నాయని, ఈ వర్గాలకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. పార్టీ విధేయులుగా పోలింగ్ బూత్‌స్థాయిలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసే కార్యక్రమాలు చేపట్టేవిధంగా తమకు అవకాశం ఇవ్వాలని కోరారు. నివేదికలో భాగంగా రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్యం ఠాగూర్‌ను మార్చాలని పరోక్షంగా అధిష్టానాన్ని సామాజిక కాంగ్రెస్ బృందం కోరడం గమనార్హం.
సామాజిక కాంగ్రెస్ బృందం
డిమాండ్లు ఇవే...: పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి ప్రధానకార్యదర్శిగా హరీశ్ రావత్ లాంటి సీనియర్ నేతను తెలంగాణకు పంపాలి.టీపీసీసీ కార్యవర్గంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ప్రాధాన్యతనివ్వాలి ∙రాష్ట్రంలోని 35 జిల్లాల కాంగ్రెస్ అధ్యక్ష పదవుల్లో 25 పదవులను ఈ వర్గాలకే కేటాయించాలి ∙రాబోయే ఎన్నికల కోసం 60 శాతం సీట్లను అంటే కనీసం 50 సీట్లు ఓబీసీ వర్గాలకు ఇవ్వాలి ∙ఎస్సీ, ఎస్టీ రిజర్వ్‌డ్ నియోజకవర్గాల్లో అగ్రవర్ణాల నాయకుల పెత్తనాన్ని కట్టడి చేయాలి.
Comments
Please login to add a commentAdd a comment