సాక్షి, హైదరాబాద్: సీఎం కేసీఆర్ తీరుతో రాష్ట్రంలోని అన్ని వర్గాలు ఇబ్బంది పడుతున్నాయని.. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు, టీఆర్‌ఎస్–బీజేపీల రాజకీయ డ్రామాలను నిలదీసేందుకే రాహుల్‌గాంధీ రాష్ట్రానికి వస్తున్నారని టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి చెప్పారు. ఓరుగల్లులో నిర్వహించే రాహుల్ సభతోనే రాష్ట్రంలో టీఆర్‌ఎస్, కేసీఆర్ పతనానికి పునాది పడబోతోందన్నారు.
కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ కోతుల గుంపుచేతిలో చిక్కుకుపోయిందని, ఆ గుం పును రాష్ట్ర పొలిమేరలు దాటించే బాధ్యత రాష్ట్రంలోని యువతదేన ని వ్యాఖ్యానించారు. ఈ నెల 6, 7 తేదీల్లో రాహుల్ రాష్ట్ర పర్యటన, వరంగల్ సభ, ఓయూ సందర్శన వివాదం నేపథ్యంలో రేవంత్ ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే..
వస్తున్నది నిలదీసేందుకే..
‘‘తెలంగాణలో రైతులు ఆత్మగౌరవంతో బతుకుతారని ఆశించి కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చింది. కానీ సీఎం కేసీఆర్ విధానాల వల్ల రైతుల జీవితాలు చిన్నాభిన్నం అవుతున్నాయి. ఎన్ని పథకాలు అమలు చేసినా పంటను కొనుగోలు చేయకపోతే రైతు నిండా మునుగుతాడు. దళారులు, మిల్లర్లు, ప్రభుత్వ పెద్దలు, కేసీఆర్ కుటుంబసభ్యులు కలిసి మాఫియాగా ఏర్పడి రైతుల పంటను దోచుకుంటున్నారు.
రైతుల కోసం పనిచేసేది కాంగ్రెసే..
రైతులకు కాంగ్రెస్ ఏం చేసిందని అడగడానికి టీఆర్‌ఎస్ నేతలకు బుద్ధి ఉండాలి. దేశంలో పేదలకు భూములను పంచింది కాంగ్రెస్ పార్టీనే. దున్నేవాడిదే భూమి అనే నక్సలైట్ సిద్ధాంతాన్ని అమల్లోకి తెచ్చింది మేమే. ఆ భూముల్లో పంటలు పండేందుకు నాగార్జునసాగర్ నుంచి రాజీవ్‌సాగర్ వరకు ప్రాజెక్టులు కట్టించి నీళ్లు ఇచ్చింది.. 2004లో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పాదయాత్ర సందర్భంగా రైతులకు ఇచ్చిన అన్ని హామీలను నెరవేర్చి రైతు పక్షపాతిగా కాంగ్రెస్ పార్టీ నిలిచింది. ఇది మా ఘన చరిత్ర. కానీ దేశంలో ఎన్నడూ లేనివిధంగా ధాన్యం కొనుగోలు సమస్యను సృష్టించింది టీఆర్‌ఎస్, బీజేపీలే. అవి పోటీలు పడి ధర్నాలు చేసి రైతులను మోసం చేశాయి.
ఓయూకు వెళ్తే ఎందుకు భయం?
తెలంగాణ ఉద్యమానికి ఊపిరినిచ్చింది ఉస్మానియా యూనివర్సిటీ. పీవీ నర్సింహారావు, జైపాల్‌రెడ్డి, మర్రి చెన్నారెడ్డి, జార్జిరెడ్డి లాంటి మేధావులను అందించింది. అలాం టి యూనివర్సిటీకి వెళ్లేందుకు ఒక పార్లమెంటేరియన్‌గా, తెలంగాణ ఇచ్చిన కుటుంబ సభ్యుడిగా రాహుల్‌కు అన్ని అర్హతలు ఉన్నాయి. రాహుల్ ఓయూకు వస్తానంటే టీఆర్‌ఎస్ ఎందుకు భయపడుతుందో అర్థం కావడం లేదు. ఈ విషయంలో ప్రభుత్వ తీరును బుద్ధిజీవులు వ్యతిరేకించాలి.
టీఆర్‌ఎస్, బీజేపీ ఒకటే..
ఎనిమిదేళ్ల పాటు బీజేపీతో అంటకాగిన టీఆర్‌ఎస్.. ప్రత్యేక విమానాల్లో ఎంపీలను తీసుకెళ్లి మరీ 50 బిల్లులకు మద్దతిచ్చింది. ఇన్నే ళ్లు కేసీఆర్, మోదీ యుగళగీతాలు పాడుకున్నారు. తెలంగాణ రాష్ట్ర మనుగడే మోదీకి ఇష్టం లేదు. అలాంటి పార్టీకి తెలంగాణ ప్రజలు ఓట్లు వేయరు. బీజేపీని బలోపేతం చేసేందుకే.. ఆ పార్టీని టార్గెట్ చేసినట్టు కేసీఆర్ మాట్లాడుతున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ఉందో లేదో వరంగల్ సభతో తెలుస్తుంది.
ఈసారి అధికారం మాదే..
ప్రజలు 1994, 99లో టీడీపీని, 2004, 2009లో కాంగ్రెస్‌ను, 2014, 2018లో టీఆర్‌ఎస్‌ను గెలిపించారు. పదేళ్లకోసారి ఒక్కో పార్టీకి అవకాశమిస్తున్నారు. ఈసారి ఆ అవకాశం కాంగ్రెస్‌కే. 90సీట్లు లక్ష్యంగా పెట్టుకున్నాం. కచ్చితంగా అధికారంలోకి వస్తాం. మా ఎమ్మెల్యేల సంఖ్య 60 దాటితే ఎవరూ ఏ పార్టీలోకి వెళ్లరు. తెలంగాణకు పుర్వవైభవం తెచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. మరో 12 నెలల్లో ఎన్నికలు రాబోతున్నాయి. ఈ 12 నెలల పాటు కాంగ్రెస్ కార్యకర్తలు అయ్యప్ప మాల మాదిరిగా ఎన్నికల మాల ధరించి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు కృషి చేయాలి.
పార్టీలో నాకు స్వేచ్ఛ లేదు!
కాంగ్రెస్ జాతీయ పార్టీ, రాష్ట్రస్థాయిలో నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ పార్టీలో నాకు లేదు. పార్టీ ఏం చెప్తే అది చేయాల్సిందే. రాజకీయ వ్యవహారాల కమిటీ నిర్ణయం, కేంద్ర నాయకత్వం ఆమోదం మేరకు ముందుకెళ్లాల్సిందే. వారు పరుగెత్తమంటే పరుగెత్తుతా. పాదయాత్ర, బస్సుయాత్ర.. ఏదైనా చేస్తా. నేను నేతల నాయకుడిని కాదు. కార్యకర్తలే నా బలం, బలగం. రాష్ట్రంలోని ప్రధాన పార్టీల అధ్యక్షుల్లో నేనే యువకుడిని.. ఈ రాష్ట్ర యువతకు ప్రతినిధిని.
కొత్తగా వచ్చినా.. పెత్తనం వారిదే!
మనం 20 ఏళ్లు పెంచుకున్న ఆడపిల్లను పెళ్లిచేసి పంపిస్తే.. మరో ఇంటి కోడలవుతుంది. అక్కడి పెత్తనం ఆమెకే వస్తుంది. ఈ విషయంలో ఆ కుటుంబ బిడ్డలకు కొంత బాధ ఉంటుంది. అయినా కోడలిదే పెత్తనం. కాంగ్రెస్ పార్టీ కూడా అంతే. చిన్న చిన్న సమస్యలుంటాయి. కొన్నాళ్ల తర్వాత సర్దుకుంటాయి. కాంగ్రెస్‌లో మొదట ఎవరి ఆట వారే ఆడతారు. ఒక్కసారి విజిల్ వచ్చిందంటే అందరం ఒకే ఆట ఆడుతాం. ముప్పేట దాడి చేసి అధికారంలోకి వస్తాం. ఎన్నికల్లో సమయంలో అప్పుడున్న పరిస్థితుల ఆధారంగా పొత్తుల నిర్ణయాలు ఉంటాయి. ఇప్పుడే చెప్పడం కుదరదు.
Comments
Please login to add a commentAdd a comment