
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో జెండా మోసిన వారికి న్యాయం జరగడం లేదన్నారు మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు. కష్టపడిని వారిని పట్టించుకోవడం లేదని కామెంట్స్ చేశారు. గోషామహల్‌లో తనకు ఓడిపోయే సీటు ఇచ్చారని ఆరోపించారు.
కాగా, సునీతా రావు తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ అమలు చేస్తున్న నారీ న్యాయ్ తెలంగాణలో జరగడం లేదు. అసెంబ్లీ టికెట్ వదులుకుంటే రూ.5కోట్లు ఇస్తానని బీఆర్‌ఎస్ నేత గడ్డం శ్రీనివాస్ ఆఫర్ ఇచ్చాడు. అయినా నేను వదులుకోలేదు. ఓడిపోయే గోషామహల్ టికెట్ నాకు ఇచ్చారు. నాకు బీజేపీ, బీఆర్‌ఎస్ నుంచి టికెట్ ఇస్తానని ఆఫర్ ఇచ్చారు. చివరకు బీజేపీ మహిళా అధ్యక్షురాలి పదవి కూడా ఇస్తానని చెప్పారు.. అయినా నేను పార్టీని వీడలేదు.
ఇప్పుడు నన్ను అధ్యక్ష పదవి నుండి తప్పించాలని చూస్తున్నారు. కార్పొరేషన్ పదవులలో మహిళలకు అన్యాయం జరిగింది. పురుషులకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. కష్టపడ్డ వారిని పట్టించుకోలేదు. మేము చేపట్టిన కార్యక్రమాలకు ఇంఛార్జ్ దీపాదాస్ మున్షీ రాలేదు. దీపాదాస్ మాకు టైమ్ ఇవ్వలేదు. మా ఫోన్ ఆమె లిఫ్ట్ చేయట్లేదు. ఈ విషయంలో కేసీ వేణుగోపాల్, ఏఐసీసీ పెద్దలని కూడా కలిశాను. నేను చేసిన తప్పు ఏంటి?. ఎన్నికల్లో పోటీ చేయడం నా తప్పా?.
మహిళ కాంగ్రెస్‌ను నడిపించడం అంత ఈజీ కాదు. కాంగ్రెస్ మహిళలకు తగిన ప్రాధాన్యత ఇవ్వలేదు. అల్ ఇండియా మహిళా కాంగ్రెస్ ప్రెసిడెంట్ అల్కా లాంబ దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్తాం. పార్టీలో కష్ట పడ్డవారికి కాకుండా వేరే వాళ్లకు అవకాశం ఇస్తే పోరాటం చేస్తాను. నేను అందరిని కలుపుకొనిపోయే వ్యక్తిని. అన్ని పదవులకు నేను అర్హురాలిని. మహిళలకు ఇక్కడ ప్రాధాన్యత లేదని ఏఐసీసీ ఇంచార్జ్ గురదీప్ సింగ్ సపర్ చెప్పారు. ఏ పదవి ఇచ్చినా చేపట్టడానికి నేను సిద్ధం. త్వరలో 33% మహిళ రిజర్వేషన్ అమలు చేస్తామని కేసీ వేణుగోపాల్, అల్కా లాంబ మాట ఇచ్చారు అంటూ కామెంట్స్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment