సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తెలంగాణలో సుదీర్ఘ పాదయాత్రకు రేపు శ్రీకారం చుడుతున్నారు. సోమవారం లోటస్‌పాండ్‌లోని పార్టీ కార్యాలయంలో పార్టీ అధికార ప్రతినిధి తూడి దేవేందర్‌రెడ్డి పాదయాత్ర వివరాలను మీడియాకు వెల్లడించారు. షర్మిల పాదయాత్ర దాదాపు 400 రోజులు.. 90 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 4 వేల కిలోమీటర్ల మేర సాగుతుందన్నారు. 14 పార్లమెంట్ నియోజక వర్గాల పరిధిలో కొనసాగుతుందని చెప్పారు.
ఉదయం 8.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు, మధ్యాహ్నం 3.00 నుంచి సాయంత్రం 6.00 గంటల వరకు పాదయాత్ర సాగుతుందన్నారు. 9 ప్రాంతాల్లో బహిరంగ సభలకు ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. రోజూ సాయంత్రం పలు సమస్యల పరిష్కారంపై షర్మిల స్థానిక నాయకులు, ప్రజలతో భేటీ అవుతారని చెప్పారు. రచ్చబండ తరహాలో ప్రజలతో మాటముచ్చట కార్యక్రమం సాగుతుందని తెలిపారు.
ప్రతి నియోజకవర్గంలో మూడు మండలాలను కలుపుకొనిపోయేలా రూట్ మ్యాప్‌ను రూపొందిస్తున్నట్లు తెలిపారు. ప్రజల సమస్యలను తెలుసుకోవడమే లక్ష్యంగా షర్మిల పా దయాత్ర సాగుతుందన్నారు. ప్రతి మంగళవారం పాదయాత్ర ఎక్కడ జరుగుతుంటే అక్కడే నిరుద్యోగ నిరాహార దీక్ష జరుగుతుందని వెల్లడించారు.
నేడు తల్లి విజయమ్మతో ఇడుపులపాయకు..
తన తల్లి విజయమ్మతో కలసి షర్మిల మంగళవారం ఉదయం ఇడుపులపాయ వెళ్తారు. అక్కడ వైఎస్సార్ సమాధి వద్ద నివాళులు అర్పిస్తారు. సాయంత్రం తిరిగి హైదరాబాద్ చేరుకుంటారు. కాగా, ఇడుపులపాయకు వెళ్తున్న నేపథ్యంలో నేడు జరగాల్సిన నిరుద్యోగ నిరాహార దీక్షను వాయిదా వేసినట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.
షర్మిలను ఆదరించండి..
రాజన్న అమలు చేసిన సంక్షేమం, అభివృద్ధి కోసం.. మీ కోసం మీ రాజన్న బిడ్డ షర్మిల చేపడుతున్న ప్రజాప్రస్థానం పాదయాత్రను ఆదరించాలని వైఎస్ విజయమ్మ ప్రజలకు పిలుపునిచ్చారు. షర్మిల పాదయాత్ర చేపడుతున్న నేపథ్యంలో ఆమె సోమవారం ఓ సందేశాన్ని విడుదల చేశారు.
చేవెళ్ల నుంచి ప్రారంభించనున్న షర్మిల పాదయాత్రను జయప్రదం చేయాలని కోరారు. షర్మిల అడుగులో అడుగు వేసి ఓ ప్రభంజనాన్ని సృష్టించాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment