తనకు అచ్చొస్తుందని పవన్ కళ్యాణ్ నమ్ముతున్న గోదావరి జిల్లాల్లో జనసేనకు పొత్తు పార్టీ తెలుగుదేశంతో సెగ తగులుతోంది. కాపు సామాజిక వర్గం ఎక్కువగా ఉన్న కొన్ని నియోజకవర్గాల్లో పోటీ చేయాలని పవన్ కళ్యాణ్ భావిస్తే.. దానికి విరుద్ధమైన పరిస్థితులనుటీడీపీ నేతలు సృష్టిస్తున్నారు.
తణుకు.. ఎవరికి వణుకు?
పశ్చిమ గోదావరి జిల్లాలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పర్యటనతో జనసేన- టీడీపీ రాజకీయం ముదిరి పాకాన పడినట్టయింది. తణుకు అసెంబ్లీ సీటుపై పవన్ కళ్యాణ్ భారీ ఆశలు పెట్టుకున్నారు. తణుకు జనసేన అభ్యర్ధిగా విడివాడ రామచంద్రరావు పోటీ చేస్తారని వారాహియాత్రలో కూడా ప్రకటించాడు పవన్ కల్యాణ్. కానీ ఇక్కడ తెలుగుదేశం కర్చీఫ్ వేస్తున్నట్టు ప్రకటించడం జనసేన క్యాడర్‌కు మింగుడు పడడం లేదు. తణుకులో టీడీపీ ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవదని, ఓడిపోయే సీటు కోసం పోటీ ఎందుకు పడుతున్నారని జనసైనికులు వాదిస్తున్నారు. ఇక్కడ తెలుగుదేశం నుంచి తణుకు టికెట్‌ను టీడీపీ మాజీ ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ ఆశిస్తున్నారు. పైకి టీడీపీ, జనసేనకు పొత్తులు ఉన్నా.. విడివాడ రామచంద్రరావు, మాజీ ఎమ్మెల్యే అరిమిల్లి మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. ఇద్దరూ టికెట్టు నాదంటే నాదంటూ ప్రచారం చేసుకుంటున్నారు.
నరసాపురం.. ఎవరి పరం?
పొత్తులో భాగంగా నరసాపురం టికెట్ జనసేనకు తీసుకోవాలని పవన్ కళ్యాణ్ ఉవ్విళ్లూరుతున్నారు. ఇక్కడ కొత్తపల్లి సుబ్బారాయుడుని పార్టీలోకి తీసుకోవాలన్నది పవన్ ప్లాన్. గత వారం రోజులుగా సుబ్బరాయుడుతో పార్టీ నేతలు చర్చలు జరుపుతున్నట్టు తెలిసింది. ఒకటి రెండు రోజుల్లో పవన్ సమక్షంలో కొత్తపల్లి సుబ్బరాయుడు చేరతాడంటూ జనసేన నేతలు ప్రచారం చేస్తున్నారు. అయితే నరసాపురంలో తామే పోటీ చేస్తామని టీడీపీ నేతలు ఖరారుగా చెబుతున్నారు.
పైకి పొత్తులు.. లోన కత్తులు
ఇప్పటికే తూర్పుగోదావరిలో పర్యటన సందర్భంగా పవన్ కళ్యాన్ చేసిన హడావిడి రెండు పార్టీల మధ్య భగ్గుమనేలా చేసింది. రాజమండ్రి రూరల్, రాజానగరంలో తమ అభ్యర్థులు పోటీ చేస్తారంటూ పవన్ కళ్యాణ్ చేసిన ప్రకటన టీడీపీ సీనియర్లకు మంట పుట్టిస్తోంది. గోరంట్ల బుచ్చయ్య చౌదరీ లాంటి సీనియర్‌ను పట్టించుకోకుండా.. పవన్ కళ్యాణ్ ఏకపక్షంగా ప్రకటనలు ఎలా చేస్తారంటూ టీడీపీ సీనియర్లు మండిపడుతున్నారు. పవన్‌తో పొత్తు వల్ల టీడీపీకి వచ్చే లాభమేమీ లేకపోగా.. కీలక స్థానాల్లో అభ్యర్థులను పెట్టడం వల్ల అసలుకే మోసం వస్తుందంటున్నారు. పైగా తనవల్లే బీజేపీ ఒప్పుకుంటుందని పవన్ ప్రకటనలు చేయడం టీడీపీ స్థాయిని తగ్గించడమేనని, పవన్ పక్కన ఉండగానే జనసేన నాయకులు మూడో వంతు సీట్లలో అంటే 58 నియోజకవర్గాల్లో పోటీ చేస్తామని ప్రకటించడం సరికాదని తప్పుబడుతున్నారు.
అయినను హస్తినకు..!
భీమవరం టూర్ తర్వాత ఢిల్లీకి పవన్ కల్యాణ్ వెళతాడని జనసేన నాయకులు చెబుతున్నారు. అక్కడి నుంచి పిలుపేమీ లేకున్నా.. ఓ సారి అటెండెన్స్ వేసుకురావాలన్న తొందర పవన్‌లో కనిపిస్తోంది. ఎన్నికలు దగ్గర పడుతున్నా... బీజేపీ ఇంకా పొత్తులకు సంబంధించి ఏమీ చెప్పకపోవడం.. ఢిల్లీ పర్యటన తర్వాత చంద్రబాబుకు తేలు కుట్టిన దొంగలా కిమ్మనకుండా ఉండడం పవన్‌ను చిర్రెత్తిస్తున్నాయి. ఈనెల 25లోపు ఏదో ఒక రోజు ఢిల్లీ వెళ్లి అపాయింట్‌మెంట్ ఇచ్చే పెద్దలను కలిసి రావాలన్నది పవన్ ఆలోచనలా కనిపిస్తోంది. ఇప్పటికే తాను వస్తానని రెండు సార్లు సమాచారం పంపినా.. నేషనల్ కౌన్సిల్ సమావేశాల వరకు ఆగుమని బీజేపీ నేతలు చెప్పినట్టు సమాచారం. ముందు క్షేత్ర స్థాయిలో బాగా ప్రచారం చేసుకోవాలని, తర్వాత పొత్తుల గురించి మాట్లాడుదామని బీజేపీ నేతలు సూచించినట్టు సమాచారం.
అగ్రనేతలు కలుస్తారా?
పవన్ ఢిల్లీకి వెళ్తే.. ప్రధాని మోదీ, అమిత్ షాలను పవన్ కల్యాణ్ కలుస్తారని జనసేన నాయకులు చెబుతున్నారు. అక్కడ మాత్రం అంత సీను లేదని, సార్వత్రిక ఎన్నికలతో ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్‌షా చాలా బిజీగా ఉన్నారని, అసలు ఏపీపై వారిద్దరి దృష్టి అంతగా లేదని తెలిసింది. ఈ నేపథ్యంలో ఢిల్లీకి వెళ్లి అపాయింట్‌మెంట్ దొరక్కపోతే ఏంటన్న ఆందోళన కూడా జనసేన నేతల్లో కనిపిస్తోంది. ఆలూ లేదు చూలూ లేదు అల్లుడి పేరు అన్నట్టు.. పార్టీ సమావేశాల్లో పవన్ కళ్యాణ్ త్యాగాల గురించి చెబుతున్నారట. ఢిల్లీ పర్యటన తర్వాత టీడీపీ అధిష్టానంతో కలిసి టికెట్లు ప్రకటిస్తామని, టికెట్లు రాని వారు త్యాగాలకు సిద్ధపడాలని పవన్ కల్యాణ్ విజ్ఞప్తి చేస్తున్నారట. ముక్తాయింపుగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే.. జనసేనలో చేరే వాళ్లందరూ త్యాగరాజులేనని పార్టీ పెట్టిన నాటి నుంచి ప్రచారంలో ఉంది.
Comments
Please login to add a commentAdd a comment