సాక్షి, అమరావతి: అభ్యర్థుల ఎంపికలో చంద్రబాబు చేస్తున్న హడావుడితో తెలుగుదేశం పార్టీ కేడర్‌లో అయోమయం నెలకొంది. తమ నియోజకవర్గానికి అభ్యర్థిగా రోజుకో నేత పేరు.. అదీ సంబంధం లేని ప్రాంతాలకు చెందిన వారి పేర్లు వస్తుండటంతో కేడర్ నిర్ఘాంతపోతున్నారు. టీడీపీ, జనసేన ఉమ్మడిగా 99 మంది అభ్యర్థుల జాబితా ప్రకటించడంతో ఇప్పటికే పలుచోట్ల ఆందోళనలు జరుగుతున్నాయి. మిగిలిన సీట్లలో అభ్యర్థులను ఖరారు చేసేందుకు చంద్రబాబు చేస్తున్న కసరత్తు కేడర్‌ను మరింత ఆందోళనకు గురిచేస్తోంది. ఎవరిని ఎక్కడి నుంచి బరిలోకి దింపుతారో, ఎందుకు అలా చేస్తున్నారో అర్థంకాక పార్టీ నేతలు, కార్యకర్తలు తలలు పట్టుకుంటున్నారు.
ఐవీఆర్‌ఎస్ సర్వే అంటూ కేడర్‌కు వారి నియోజకవర్గానికి సంబంధం లేని కొత్త వ్యక్తుల పేర్లు చెప్పి వారు ఆ స్థానంలో పోటీ చేస్తే గెలుసారో లేదో చెప్పండని నిలదీస్తుండటంతో ఏమి చేయాలో కార్యకర్తలకు పాలుపోవడం లేదు. మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు గతంలో ఉమ్మడి కృష్ణా జిల్లాలో మైలవరం నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించారు. ఈ సీటును వసంత కృష్ణప్రసాద్‌కి ఖరారు చేయడంతో ఉమా పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. పెనమలూరుకు సిద్ధంగా ఉండాలని ఉమాకు చంద్రబాబు సూచించారు.
పెనమలూరులో అభ్యర్థి ఉమా అయితే సమ్మతమేనా అని ఫోన్లు వస్తుండడంతో కేడర్ తెల్లబోతోంది. ఉన్నట్టుండి ఉమాను ఇక్కడకు దిగుమతి చేయడం ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు అక్కడి ఇన్‌ఛార్జి బోడె ప్రసాద్ తనకు కాకుండా మరొకరికి సీటు ఇస్తే తాను చేతగానివాడిలా చూస్తూ ఊరుకోనంటూ బహిరంగంగానే హెచ్చరిస్తున్నారు. దేవినేని ఉమా కూడా పెనమలూరులో కొందరు టీడీపీ నాయకులకు ఫోన్లు చేసి అక్కడి పరిస్థితి ఎలా ఉంటుందని ఆరా తీస్తుండటంతో ఇదేమి పరిస్థితంటూ స్థానిక నేతలు జుట్టు పీక్కుంటున్నారు.
ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందిన సీనియర్ నేత యరపతినేని శ్రీనివాసరావును నిన్నటి వరకు చంద్రబాబు గాల్లో పెట్టారు. మొదటి జాబితాలో ఆయన పేరు గల్లంతైంది. ఇప్పడు ఆయన్ని గురజాల నుంచి నర్సరావుపేటకు మార్చాలనే ఆలోచన చేస్తున్నారు. నర్సరావుపేట టీడీపీ అభ్యర్థిగా యరపతినేని అయితే ఎలా ఉంటుందోనని ఐవీఆర్‌ఎస్ సర్వే చేస్తున్నారు. దీంతో అక్కడి ఇన్‌ఛార్జి చదలవాడ అరవింద్‌బాబు వర్గం లబోదిబోమంటోంది. మరోవైపు గురజాలలో వలస వచ్చిన నేత జంగా కృష్ణమూర్తి అభ్యర్థిత్వంపై సర్వే చేస్తున్నారు. గురజాలలో తనను కాదని ఉన్నట్టుండి జంగాను తేవడంతో యరపతినేని కారాలు మిరియాలు నూరుతున్నారు.
విశాఖ జిల్లాకు చెందిన మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావును అయితే ఏకంగా జిల్లా దాటించే ప్రయత్నం చేస్తుండడంతో ఉత్తరాంధ్ర టీడీపీ ఆశ్చర్యం వ్యక్తం చేస్తోంది. ఆయన్ని విజయనగరం జిల్లా చీపురుపల్లి నుంచి పోటీ చేయాలని ఒత్తిడి తేవడం, ఆయన నిరాకరిస్తుండటం గందరగోళానికి దారితీసింది.
విజయవాడ పశ్చిమ సీటు కోసం మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న, మాజీ ఎమ్మెల్యే జలీల్‌ఖాన్ రకరకాల గిమ్మిక్కులు చేస్తున్నారు. మరోవైపు ఆ సీటు తమదేనని జనసేన హడావుడి చేస్తోంది. ఈ మూడు శిబిరాలు నివ్వెరపోయేలా కొత్తగా ఎంకే బేగ్‌ను చంద్రబాబు తెరపైకి తెచ్చారు. ఆయన అభ్యర్థిత్వంపై ఐవీఆర్‌ఎస్ సర్వే చేస్తుండటంతో స్థానిక నేతలు ముక్కున వేలేసుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment