ములుగు జిల్లా కేశవాపూర్‌లో పత్తి ఏరుతున్న కూలీలు తమ భోజనాన్ని రేవంత్, సీతక్కలకు పెడుతున్న దృశ్యం
ములుగు/వెంకటాపురం(ఎం): 2001లో రబ్బరు చెప్పులకు కూడా గతిలేని కేసీఆర్ కుటుంబం నేడు రాష్ట్రాన్ని దోచుకుని రూ.లక్షల కోట్లకు పడగలెత్తిందని, అది చాలదన్నట్లు ఇప్పుడు దేశాన్ని దోచుకోవడానికి ముఖ్యమంత్రి బయలుదేరారని టీపీపీసీ అధ్యక్షుడు ఎ.రేవంత్‌రెడ్డి ఆరోపించారు. డ్రామారావు (కేటీఆర్‌నుద్దేశించి) రాష్ట్ర ప్రజలు తమ కుటుంబ సభ్యులని, కుటుంబ పాలన ఉంటుందని అనడం హాస్యాస్పదమన్నారు.
తెలంగాణ ద్రోహులు ఎర్రబెల్లి, తలసాని శ్రీనివాస్, మల్లారెడ్డిని చుట్టూ చేర్చుకొని దిక్కుమాలిన రాజకీయాలు చేస్తున్నాడని విమర్శించారు. హాథ్ సే హాథ్ జోడో యాత్ర రెండో రోజు మంగళవారం ములుగు జిల్లా వెంకటాపురం(ఎం) మండలంలోని రామప్ప దేవాలయాన్ని ఎమ్మెల్యే సీతక్కతో కలిసి రేవంత్ సందర్శించారు. రామలింగేశ్వరస్వామికి అభిషేకం పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయం ముందు విలేకరుల సమావేశంలో, రాత్రి 8 గంటలకు పాదయాత్ర ములుగుకు చేరుకున్నాక గ్రామ పంచాయతీ ఎదుట ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్‌లో ఆయన మాట్లాడారు.
అధికారంలోకి రాగానే సమ్మక్క–సారలమ్మ జిల్లా
రాష్ట్రంలో లక్షలాది మంది ప్రజలు సరైన ఇల్లు లేక రోడ్లపై అవస్థలు పడుతుంటే 160 పడక గదుల భవనంలో దొర దర్జాగా గడుపుతున్నారని విమర్శించారు. ములుగు ప్రజల ఆదరణ, పౌరుషాన్ని పుణికి పుచ్చుకొని రాష్ట్ర మంతటా సీతక్కతో కలిసి యాత్ర కొనసాగించి అధికారంలోకి వస్తామని అన్నారు. అధికారంలోకి రాగానే ములుగు జిల్లాను సమ్మక్క–సారలమ్మల పేరు మీద మారుస్తూ తొలి సంతకం పెడతామని ప్రకటించారు. వచ్చే ఏడాది జనవరి 1వ తేదీన కొత్త ప్రభుత్వాన్ని నెలకొల్పుతామని పునరుద్ఘాటించారు.
భోజనం పెట్టిన కూలీలు
ములుగు జిల్లా కేశవాపూర్ రోడ్డు మీదుగా యాత్ర సాగుతుండగా మధ్యాహ్నం సమయంలో పక్కనే పత్తి, మిర్చి ఏరుతున్న కూలీలను రేవంత్ పలకరించారు. ఇప్పటి ప్రభుత్వం బాగుందా? కాంగ్రెస్ ప్రభుత్వం బాగుందా? అని అడగడంతో ఇందిరమ్మ రాజ్యం కోరుకుంటున్నట్లు కూలీలు తెలిపారు. తాము తెచ్చుకున్న టిఫిన్ బాక్సులను తెరిచి రేవంత్‌రెడ్డి, సీతక్కలకు భోజనం పెట్టారు.
Comments
Please login to add a commentAdd a comment