TPCC Chief Revanth Reddy Serious Allegations On CM KCR - Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌ కీలక నేతకు రూ.500 కోట్ల ఆఫర్.. రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Published Thu, Jan 19 2023 8:22 AM | Last Updated on Thu, Jan 19 2023 9:07 AM

Tpcc Chief Revanth Reddy Serious Allegations On Brs Kcr - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కర్ణాటకలో త్వరలో జరిగే శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీని ఓడించేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కుట్రలు చేస్తున్నారని టీపీసీసీ అధ్యక్షుడు ఎ.రేవంత్‌రెడ్డి ఆరోపించారు. కర్ణాటక కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఓ కీలక నేతను లొంగదీసుకునేందుకు రూ. 500 కోట్లు ఆఫర్‌ చేశారన్నారు. బుధవారం సాయంత్రం రేవంత్‌ రెడ్డి మీడియాతో మాట్లాడారు. కర్ణాటకలో కాంగ్రెస్‌ 130 సీట్లు గెలుస్తుందని, బళ్లారి నుంచి రాయచూరు వరకు 25–30 స్థానాల్లో స్వల్ప తేడాతో కాంగ్రెస్‌ పార్టీ విజయం సాధిస్తుందని నివేదికలు చెబుతున్నాయని పేర్కొన్నారు. ఆ 30 సీట్లలో కాంగ్రెస్‌ పార్టీ పరాజయం కోసం పనిచేయాలని కర్ణాటకకు చెందిన ఓ కీలక నేతకు కేసీఆర్‌ రూ.500 కోట్లు ఆఫర్‌ ఇచ్చింది నిజం కాదా? ఆయనతో ఫామ్‌ హౌస్‌లో బేరసారాలు సాగించింది నిజం కాదా? అని ప్రశ్నించారు. ఇది ఆరోపణ కాదని, ఆధారాలతో సహా నిరూపించేందుకు సిద్ధమని చెప్పారు. 

కర్ణాటకలో తెలంగాణ ఇంటెలిజెన్స్‌ వర్గాలు 
ప్రభాకర్‌ రావు నేతృత్వంలో పనిచేస్తున్న ఇంటెలిజెన్స్‌ అధికారులను కర్ణాటక రాష్ట్రంలో నియమించారని, వారి నుంచి కాంగ్రెస్‌ మద్దతుదారులు, ఓటు వేసే వాళ్ల వివరాలను సేకరిస్తున్నారని ఆరోపించారు. ఈ విషయాలన్నీ తెలిసే జేడీఎస్‌ నేత కుమార స్వామి ఖమ్మంలో జరిగిన బీఆర్‌ఎస్‌ సమావేశానికి రాలేదన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్‌ను ఓడించేందుకు కేసీఆర్‌ ఎవరి దగ్గర సుపారీ తీసుకున్నారో ప్రజలకు తెలియాలన్నారు. 

మోదీతో వైరం ఉన్నట్లు నమ్మించే ప్రయత్నం ఇది.. 
ఖమ్మంలో కేసీఆర్‌ ఉపన్యాసం వింటే మోదీతో వైరం ఉందని నమ్మించే ప్రయత్నం చేసినట్లు కనిపిస్తోందని రేవంత్‌రెడ్డి ఆరోపించారు. బీఆర్‌ఎస్‌ పారీ్టగా నమోదైన తర్వాతనే జరిగిన గుజరాత్, హిమాచల్‌ప్రదేశ్‌ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల్లో ఎందుకు ప్రచారం చేయలేదని, యూపీ ఉప ఎన్నికలు, ఢిల్లీ మున్సిపల్‌ ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా కేసీఆర్‌ ఎందుకు ప్రచారం చేయలేదో చెప్పాలని డిమాండ్‌ చేశారు. కేసీఆర్‌ వ్యూహాత్మకంగానే డిసెంబర్‌లో జరపాల్సిన శీతాకాల సమావేశాలు జరపలేదని, ఫిబ్రవరి చివరిలో ప్రభుత్వాన్ని రద్దు చేసినా ఆశ్చర్యపోనవసరం లేదని వ్యాఖ్యానించారు.  

రూ. 100 లక్షల కోట్లు అప్పు చేసిన మోదీతో కాంగ్రెస్‌ను పోలుస్తారా? 
1947 నుంచి 2014 వరకు దేశాన్ని పాలించిన ప్రధానులందరు రూ.56 లక్షల కోట్ల అప్పులు చేస్తే... ఎనిమిదేళ్లలో ప్రధాని మోదీ రూ.100 లక్షల కోట్లు అప్పు చేశారని రేవంత్‌ ఆరోపించారు. అలాంటి మోదీతో కాంగ్రెస్‌ను పోల్చడం కేసీఆర్‌ దుర్మార్గానికి పరాకాష్టగా అభివరి్ణంచారు. ప్రభుత్వ సంస్థలను అమ్ముకుంటున్న మోదీకి పార్లమెంట్‌లో మద్దతు ఇచ్చింది కేసీఆరేనని అన్నారు. మన దేశం చైనా మార్కెట్‌ అయిందంటున్న కేసీఆర్‌.. సెక్రటేరియట్‌ దగ్గర ఏర్పాటు చేయబోయే అంబేడ్కర్‌ విగ్రహం కోసం మంత్రుల బృందం చైనా వెళ్లిన విషయమై ఏం సమాధానం చెపుతారని రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు.
చదవండి: భారత జాతి విముక్తి కోసమే బీఆర్‌ఎస్‌!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement