ఆ తర్వాతే బీఆర్‌ఎస్ నేతలు అక్కడికి వెళ్లాలి: జగ్గారెడ్డి
సాక్షి, హైదరాబాద్: అది మేడిగడ్డనో, బొందలగడ్డనో ముందు కేసీఆర్ తేల్చాలని, ఆ తర్వాతే బీఆర్‌ఎస్ నేతలు మేడిగడ్డకు వెళ్లాలని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే టి. జగ్గారెడ్డి స్పష్టం చేశారు.మేడిగడ్డలో పిల్లర్లు కుంగింది నిజం కాదా అని ప్రశ్నించారు. బుధవారం గాందీభవన్‌లో టీపీసీసీ ఫిషర్‌మెన్ కమిటీ చైర్మన్ మెట్టు సాయికుమార్, టీపీసీసీ నేతలు కోట్ల శ్రీనివాస్, చరణ్‌కౌశిక్ యాదవ్‌తో కలిసి జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడారు.
ఏం పీకడానికి మేడిగడ్డ వెళుతున్నారంటూ నల్లగొండ సభలో కేసీఆర్ ప్రశ్నించారని గుర్తు చేసిన జగ్గారెడ్డి.. కాళేశ్వరం పేరుతో కేసీఆర్ చేసిన అవినీతిని పీకడానికి, కట్టిన డబ్బు సంచులు పీకడానికి వెళ్లామని బదులిచ్చారు. బీఆర్‌ఎస్ నేతలు ముందుగా మంచి బుద్ధి తెచ్చుకోవాలని, మీరు ఒకటి అంటే మా కార్యకర్తలు వంద అంటారన్న విషయం మర్చిపోద్దని చెప్పారు. మంత్రి పొన్నం ప్రభాకర్‌నుద్దేశించి బీజేపీ ఎంపీ బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు సరైనవి కావని, ఆయన వెంటనే క్షమాపణలు చెపితే వివాదం ఇంతటితో ముగిసిపోతుందన్నారు.
బాల్కసుమన్ చిన్నపిలగాడు.. కడియం గాలిపటం మాదిరి
బాల్కసుమన్ చిన్నపిలగాడని, పిలగాడు పిలగాడి తీరులోనే ఉండాలని జగ్గారెడ్డి హితవు పలికారు. కడియం శ్రీహరికి రాజకీయ జ్ఞానం లేదని గాలిపటం లాంటి వాడని ఎద్దేవా చేశారు. ఏ పార్టీలో పనిచేసినా ఆ పార్టీ అధినేతల లైన్ ప్రకారం నడుచుకోవాల్సి ఉంటుందని, అది కూడా తెలియని కడియం శ్రీహరి తన వద్దకు వస్తే క్లాసులు చెపుతానని వ్యాఖ్యానించారు. తన టైం బాగాలేక సంగారెడ్డిలో ఓడిపోయాయని, ఐదేళ్లు రెస్ట్ ఇచ్చినందుకు సంగారెడ్డి ప్రజలకు కృతజ్ఞతలని చెప్పిన జగ్గారెడ్డి తాను మెదక్ ఎంపీగా పోటీ చేయడం లేదని, ఈ అంశంలోకి మరోమారు తనను లాగవద్దని విజ్ఞప్తి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment