సాక్షి, హైదరాబాద్: హుజూరాబాద్ ఉప ఎన్నిక లక్ష్యంగా ప్రత్యర్థి పార్టీలకు ఏ ఒక్క అవకాశాన్ని వదలకుండా జాగ్రత్తగా టీఆర్‌ఎస్ పార్టీ పావులు కదుపుతోంది. ఆ పార్టీలకు చెందిన బలమైన నేతలను చేర్చుకోవడంతో పాటు, హుజూరాబాద్ కేంద్రంగా పలు పథకాలకు శ్రీకారం చుడుతోంది. కొత్తగా పార్టీలోకి వచ్చే నేతలకు కూడా ఉజ్వల భవిష్యత్తు ఉంటుందటూ హామీలు ఇస్తోంది. హుజూరాబాద్ ఉప ఎన్నికలో గెలిచి తీరాలనే లక్ష్యంతో మంత్రులు, పార్టీ నేతలు సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. కాగా, ఇన్నాళ్లూ నియోజకవర్గానికే పరిమితమైన నాయకులకు రాష్ట్ర స్థాయి పదవులు కట్టబెట్టడం ద్వారా పార్టీ వెంట నడిస్తే గుర్తింపు వస్తుందనే సంకేతాలు టీఆర్‌ఎస్ ఇస్తోంది. కాంగ్రెస్ నుంచి ఇటీవలే టీఆర్‌ఎస్‌లో చేరిన పాడి కౌశిక్‌రెడ్డిని రాష్ట్రస్థాయిలో గుర్తింపు ఇస్తామని పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ప్రకటించారు. కౌశిక్‌రెడ్డికి టీఆర్‌ఎస్ టికెట్ దక్కని పక్షంలో రాష్ట్ర స్పోర్ట్స్’ అథారిటీ (సాట్స్) చైర్మన్‌గా నియమించే సూచనలు కన్పిస్తున్నాయి. ఈటల వెంట నడిచి ఆ తర్వాత పార్టీ గూటికి చేరిన జమ్మికుంట మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సమ్మిరెడ్డితో పాటు ఒకరిద్దరు స్థానిక నేతలు రాష్ట్ర స్థాయి పదవులకు నామినేట్ అయ్యే అవకాశముందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
కొత్త వారికి భవిష్యత్తు
పార్టీలో దీర్ఘకాలంగా పనిచేస్తున్న నేతలకు ప్రాధాన్యత ఇస్తూనే, కొత్తగా చేరే వారికి ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని టీఆర్‌ఎస్ హామీ ఇస్తోంది. కాంగ్రెస్ నుంచి పాడి కౌశిక్‌రెడ్డి, కష్యప్‌రెడ్డి తదితరులను చేర్చుకున్న టీఆర్‌ఎస్ మరికొందరు నేతలను కూడా చేర్చుకునేందుకు మంతనాలు చేస్తోంది. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రెండు రోజుల కింద బీజేపీకి రాజీనామా చేయగా, ఈ నెల 30న టీఆర్‌ఎస్‌లో చేరేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. నియోజకవర్గంలో ప్రత్యర్థి పార్టీలకు చెందిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఒకరిద్దరు మినహా మిగతా అందరూ ఈటల రాజీనామా తర్వాత టీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. బీసీ కమిషన్ మాజీ సభ్యుడు వకుళాభరణం కష్ణమోహన్‌రావు, టీఆర్‌ఎస్‌వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్‌యాదవ్‌తో పాటు మరికొందరు హూజూరాబాద్ టికెట్ ఆశిస్తున్నారు. పార్టీ మాత్రం అభ్యర్థి విషయంలో అత్యంత గోప్యత పాటిస్తోంది.
దళితవాడల స్థితిగతులపై సర్వే
దళితవాడల్లో మౌలిక సదుపాయాల కల్పనపై బుధవారం కరీంనగర్ కలెక్టరేట్‌లో జిల్లా కలెక్టర్ ఆర్వీ.కర్ణన్ సమావేశం ఏర్పాటు చేశారు. హుజూరాబాద్ నియోజకవర్గంలోని ప్రతి గ్రామపంచాయతీలో సర్పంచ్, పంచాయతీ కార్యదర్శులు, పంచాయతీరాజ్ ఏఈ, ట్రాన్స్‌కో ఏఈ, స్థానిక యువకులు, రిటైర్డ్ ఉద్యోగులు, రిసోర్స్ పర్సన్లతో కలసి దళితవాడలను సందర్శించి నివేదిక తయారు చేయనున్నారు. రెండు రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తికానుంది. కాగా, దళితవాడల్లో అభివృద్ధి పనులు, కనీస సదుపాయాల కల్పనను పర్యవేక్షించేందుకు ఇంజనీర్లను నియమించినట్లు పంచాయతీరాజ్ ఈఎన్‌సీ సంజీవరావు తెలిపారు.
దళితవాడల మోడల్ హుజూరాబాద్
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: దళితబంధుకు తోడు దళితవాడల్లో మౌలిక వసతుల కల్పనను కూడా ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోంది. హుజూరాబాద్ నియోజకవర్గంలోని 5 మండలాల్లో ఉన్న 139 దళితవాడల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, వీధిదీపాలు, కమ్యూనిటీ హాళ్ల నిర్మాణం, హెచ్‌టీ లైన్ల క్రమబద్ధీకరణ, వైద్య తదితర సదుపాయాలన్నింటినీ ఏకకాలంలో కల్పించేందుకు రంగం సిద్ధమైంది. ఒక్కోవాడలో రూ.10 కోట్ల నుంచి రూ.12 కోట్ల వరకు వెచ్చించే అవకాశం ఉంది. తద్వారా ఈ మౌలిక సదుపాయాల కల్పనకు రూ.1,500 కోట్ల వరకు ఖర్చు కానున్నట్లు అంచనా. దళితబంధుకు హుజూరాబాద్ నియోజకవర్గంలో రూ.2 వేల కోట్లు, దళితవాడల్లో సౌకర్యాల కల్పనకు రూ.1,500 కోట్లు మొత్తం రూ.3,500 కోట్లు వెచ్చించాలని నిర్ణయించినట్లు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment