తెలంగాణ ఎన్నికల చరిత్ర.. ఆసక్తికర సమాచారం
ఈ రోజుల్లో ఏకగ్రీవ ఎన్నికలు అంటే ఆశ్చర్యం కలగవచ్చు. ఒకప్పుడు కొందరు నేతలు శాసనసభకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారన్నది అతిశయోక్తి కాదు. తెలంగాణకు సంబందించినంతవరకు చివరి ఏకగ్రీవ ఎన్నిక 2002 సంవత్సరంలో జరిగింది.
దేవరకొండ ఎస్టీ నియోజకవర్గం నుంచి 1999 ఎన్నికల్లో గెలుపొందిన కాంగ్రెస్ నేత ధీరావత్ రాగ్యానాయక్ నక్సల్స్ కాల్పులలో మరణించారు. తత్ఫలితంగా జరిగిన ఉప ఎన్నికలో ఆయన భార్య భారతి ఏకగ్రీవకంగా ఎన్నికయ్యారు. మరణించిన రాగ్యానాయక్ గౌరవార్దం అప్పట్లో అధికారంలో ఉన్న తెలుగుదేశంతో పాటు, ఇతర రాజకీయ పార్టీలు ఈ మేరకు నిర్ణయించాయి. అంతకుముందు కూడా పలు ఏకగ్రీవ ఎన్నికలు జరిగాయి.
తెలంగాణలో సుమారు ఇరవై మంది ఇంతవరకు ఇలా ఎన్నిక కాగలిగారు. ఈ ఏకగ్రీవ ఎన్నికలన్నీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే జరగడం విశేషం. మాజీ ముఖ్యమంత్రి టంగుటూరి అంజయ్య కూడా ఒకసారి ఉప ఎన్నికలో పోటీ లేకుండా శాసనసభకు నెగ్గారు. 1972 లో ఇందిరా గాంధీ ప్రభంజనంలో ఎక్కువ మంది ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అప్పట్లో యునానిమస్‌గా ఎన్నికైనవారిలో కోదాటి రాజమల్లు(చెన్నూరు), పి.నర్సారెడ్డి(నిర్మల్), జి.గడ్డెన్న(ముధోల్), ఎస్.భూపాల్(అమరచింత), ఎన్.రామచంద్రారెడ్డి(డోర్నకల్ ))కళ్యాణి రామచంద్రరావు(మక్తల్) ఎమ్.మాణిక్యరావు(తాండూరు) ఉన్నారు.
ఏకగ్రీవంగా ఎన్నికైన వారిలో మరికొందరు ప్రముఖులు ఉన్నారు. టి.రంగారెడ్డి(ఆర్మూరు-1962), జి.రాజారామ్(బాల్కొండ-1967), సీతాకుమారి(బాన్స్ వాడ-1957),కె.లక్ష్మినరసింహారావు(జగిత్యాల-1967),టి.అంజయ్య(రామాయంపేట-1981),వీరాస్వామి(కొడంగల్-1952), పద్మనాభరెడ్డి (వనపర్తి-1957) ఆర్.సురేంద్రరెడ్డి(డోర్నకల్ -1974), కె.రాంభూపాల్ (గద్వాల- 1962),పి.మహేంద్రనాద్ (నాగర్ కర్నూల్ -1957), ఎన్.యతిరాజారావు(చెన్నూరు-1975), కె.రామయ్య(బూర్గంపాడు-1968) మొదలైనవారు ఉన్నారు.
వీళ్లలో ఒకరిద్దరు తప్ప ఇలా ఏకగ్రీవంగా ఎన్నికైవారంతా కాంగ్రెస్కు చెందినవారే కావడం విశేషం. అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఒక్క ఏకగ్రీవ ఎన్నిక కూడా జరగలేదు.
:::కొమ్మినేని శ్రీనివాస రావు, ఏపీ మీడియా అకాడెమీ చైర్మన్
Comments
Please login to add a commentAdd a comment