కమలంలో కలకలం! | Telangana: Many Top BJP Leaders Are Campaigning To Leave The Party - Sakshi
Sakshi News home page

Telangana BJP: కమలంలో కలకలం!

Published Sat, Sep 23 2023 3:39 AM | Last Updated on Sat, Sep 23 2023 9:50 AM

TS: Many top BJP leaders are campaigning to leave the party - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర బీజేపీలో అసంతృప్తి జ్వాలలు భగ్గుమంటున్నాయి. మరో రెండు వారాల్లో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ వెలువడొవచ్చనే అంచనాల నేపథ్యంలో...పార్టీలో ఏర్పడుతున్న పరిస్థితులు కమలనాథుల్లో కలవరం పుట్టిస్తున్నాయి. ఇటీవల జాతీయ కార్యవర్గసభ్యుడు, మాజీ ఎంపీ జి.వివేక్‌ వెంకటస్వామి నివాసంలో పలువురు అసంతృప్త నేతలు భేటీ అయ్యారు.

ఇతర జాతీయ కార్యవర్గసభ్యులు విజయశాంతి, గరికపాటి మోహన్‌రావుతో పాటు మాజీ ఎంపీలు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, చాడ సురేష్‌రెడ్డి, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, జి.విజయరామారావు, ఎం.రవీంద్రనాయక్, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి పాల్గొన్న ఈ సమావేశం పార్టీలో కలకలం సృష్టించింది. పార్టీలో తమకు తగిన ప్రాధాన్యత దక్కడం లేదని భావిస్తున్న ఈ నేతలంతా అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీకి గుడ్‌బై చెప్పే అవకాశం ఉన్నట్లు విస్తృతంగా ప్రచారం జరుగుతోంది.

మరోవైపు పార్టీ ఏర్పాటైనప్పటి నుంచి ఉన్న సీనియర్‌ నేత, నగర పార్టీ మాజీ అధ్యక్షుడు, మాజీ కార్పొరేటర్‌ బి.వెంకటరెడ్డి, ఆయన భార్య బాగ్‌అంబర్‌పేట కార్పొరేటర్‌ పద్మలు.. తాము పార్టీ కోసం నిస్వార్థంగా పనిచేసినా, తగిన గుర్తింపు లేదని పేర్కొంటూ బీజేపీకి రాజీనామా చేశారు.

సుదీర్ఘకాలంగా పార్టీలో ఉన్నందున తమకు అంబర్‌పేట అసెంబ్లీ టికెట్‌ కేటాయించాలని కోరితే నాయకత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని వెంకటరెడ్డి ఆరోపించారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఇటీవల భేటీ అయిన నేతల అసంతృప్తికి కారణాలు తెలుసుకుని వారిని బుజ్జగించే బాధ్యతను రాష్ట్ర ఎన్నికల ఇన్‌చార్జి ప్రకాష్‌ జవదేకర్‌కు నాయకత్వం అప్పగించినట్టు పార్టీవర్గాల సమాచారం.  

మాకేదీ గుర్తింపు..? 
రాష్ట్ర పార్టీలో ముఖ్య నేతలుగా, జాతీయ కార్యవర్గ సభ్యులు, సీనియర్లుగా ఉన్నా తమకు తగిన గుర్తింపు, ప్రాధాన్యత లభించడం లేదనేది అసంతృప్త నేతల ప్రధాన ఫిర్యాదుగా ఉన్నట్టు సమాచారం. అలాగే పార్టీ తీరు, నాయకత్వం వ్యవహారశైలి పైనా వారు ఆగ్రహంతో ఉన్నారని, అధిష్టానం వైఖరి, ముఖ్యంగా పార్టీ అగ్రనేత అమిత్‌ షా అనుసరిస్తున్న తీరు సైతం సమావేశంలో చర్చకు వచ్చినట్టు చెబుతున్నారు.

హైదరాబాద్‌ విమోచన దినోత్సవంలో పాల్గొనేందుకు వచ్చిన సందర్భంగా.. కేవలం రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి, జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్, రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్‌ ఈటల రాజేందర్‌లతోనే అమిత్‌ షా సమావేశం కావడం, తమను దూరం పెట్టడంపై వీరంతా కినుక వహించినట్టు తెలుస్తోంది. మోదీ, అమిత్‌షా, నడ్డాలు రాష్ట్ర పర్యటనకు వచ్చినపుడు సైతం ఆయనకే గుర్తింపునివ్వడం, వేదికపైనా తమ పక్కన అవకాశం కలి్పంచడం వంటి వాటిపై కొందరు నేతలు గుర్రుగా ఉన్నట్టు సమాచారం.  

ఈటల తీరుపై అసహనం! 
గతంలో పార్టీ చేరికల కమిటీ చైర్మన్‌గా, ఇప్పుడు ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్‌గా ఈటల వ్యవహరిస్తున్న తీరుపై పలువురు నేతలు అసహనంతో ఉన్నట్టు చెబుతున్నారు. తమకు తెలియకుండా, కనీసం సంప్రదించకుండా తమ ప్రాబల్య ప్రాంతాలు, నియోజకవర్గాల్లో చేరికలను ఈటల ప్రోత్సహించడంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల తమను సంప్రదించకుండా సంగారెడ్డి, ములుగు జిల్లాల్లో కొందరిని చేర్చుకోవడంపై వారు గుర్రుగా ఉన్నట్టు సమాచారం.  

వారు నిత్య అసంతృప్త వాదులే..! 
మరోవైపు అసంతృప్త నేతల తీరుపై ఇతర నాయకులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. వీరు నిత్య అసంతృప్తులంటూ మండిపడుతున్నారు. తాము అనుకున్న స్థాయిలో సమన్వయంతో పని చేయడం లేదని, ఇలాగైతే తామే ఢిల్లీ నుంచి ఎన్నికల కార్యాచరణను అమలు చేయాల్సి ఉంటుందంటూ క్లాస్‌ తీసుకునేందుకే.. కిషన్‌రెడ్డి, సంజయ్, ఈటలతో అమిత్‌ షా ప్రత్యేకంగా భేటీ అయ్యారని వారు వివరిస్తున్నారు. పార్టీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు డా.కె.లక్ష్మణ్, జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణను కూడా అమిత్‌షా పిలవలేదంటూ వారు గుర్తు చేస్తున్నారు.

అధినేతల తీరుతో తప్పుడు సంకేతాలు! 
కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో భారీ అవినీతి జరిగిందని, ఇది కేసీఆర్‌ సర్కార్‌కు, బీఆర్‌ఎస్‌కు ఏటీఎంగా మారిందంటూ విమర్శలు గుప్పించిన అమిత్‌ షా, నడ్డాలు.. ఇదిగో విచారణ, అదిగో విచారణ అంటూ తాత్సారం చేయడమే తప్ప ఎలాంటి చర్య తీసుకోకపోవడం, ఢిల్లీ లిక్కర్‌ స్కాంలో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఇంకా అరెస్టు చేయకపోవడం వంటివి ప్రజల్లో తప్పుడు సంకేతాలకు కారణమౌతున్నాయని అసంతృప్త నేతలు అభిప్రాయపడుతున్నట్టు తెలిసింది. కీలక ఎన్నికల నేపథ్యంలో బీఆర్‌ఎస్, బీజేపీ ఒకటేనని జరుగుతున్న ప్రచారాన్ని ఈ కారణంగా గట్టిగా తిప్పికొట్టలేకపోతున్నామని వారు పేర్కొంటున్నట్లు సమాచారం. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement