కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం.. అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం
‘విభజన’ హామీల అమల్లో కేంద్రం విఫలం.. ఫెడరల్ స్ఫూర్తికి తూట్లు
సీఎం, మంత్రులు ఢిల్లీ వచ్చి ప్రధాని, కేంద్ర మంత్రులకు విజ్ఞప్తులు చేశారు
కానీ కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదు
ఈ తీరు పట్ల అసంతృప్తిని, నిరసనను తెలియజేస్తున్నాం..
బడ్జెట్‌కు సవరణలు చేసి తెలంగాణకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో తెలంగాణ పట్ల వివక్ష చూపారంటూ రాష్ట్ర శాసనసభ తీవ్ర అసంతృప్తిని, నిరసనను తెలియజేసింది. ప్రస్తుతం కొనసాగుతున్న బడ్జెట్ చర్చల్లోనే కేంద్ర బడ్జెట్‌కు సవరణలు చేసి తెలంగాణకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి ప్రవేశపెట్టిన తీర్మానాన్ని శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించింది. బుధవారం శాసనసభలో ప్రశ్నోత్తరాల సమయం ముగిశాక.. కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణ పట్ల చూపిన వివక్షపై విస్తృతంగా చర్చించారు.
మంత్రి శ్రీధర్‌బాబు చర్చను ప్రారంభించగా.. తర్వాత కేటీఆర్, బీజేపీపక్ష నేత మహేశ్వర్‌రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మాజీ మంత్రి హరీశ్‌రావు, మాజిద్ హుస్సేన్ (ఎంఐఎం), కూనంనేని సాంబశివరావు (సీపీఐ), వివేక్ వెంకటస్వామి (కాంగ్రెస్) తదితరులు మాట్లాడారు. చివరగా ఈ తీర్మానాన్ని శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించింది. అనంతరం సభను స్పీకర్ ప్రసాద్‌కుమార్ గురువారానికి వాయిదా వేశారు.
అసెంబ్లీ చేసిన ఏకగ్రీవ తీర్మానం ఇదీ..
‘‘డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ రచించిన రాజ్యాంగం ప్రకారం.. భారతదేశం అన్ని రాష్ట్రాల సమాఖ్య. అన్ని రాష్ట్రాల సమీకృత, సమ్మిళిత అభివృద్ధి కేంద్ర ప్రభుత్వం బాధ్యత. ఈ ఫెడరల్ స్ఫూర్తిని కేంద్ర ప్రభుత్వం విస్మరించింది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో తెలంగాణకు అన్యాయం జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచీ ఇదే ధోరణి కొనసాగుతోంది. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం రెండు రాష్ట్రాల సుస్థిర అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలి.
కానీ విభజన చట్టంలో పొందుపరిచిన హామీలను అమలు చేయటంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైంది. ఇది తెలంగాణ ప్రగతిపై తీవ్ర ప్రభావం చూపింది. తెలంగాణలో ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి, మంత్రులు పలు దఫాలుగా ప్రధాన మంత్రిని, ఇతర కేంద్ర మంత్రులను కలసి వివిధ విజ్ఞప్తులు చేశారు. రాష్ట్రానికి సంబంధించిన వివిధ ప్రాజెక్టులకు ఆర్థిక సాయం కోరటంతోపాటు చట్ట ప్రకారం రావాల్సిన నిధులు, అపరిష్కృతంగా ఉన్న అంశాలపై అనేక అభ్యర్థనలు అందించారు.
కానీ కేంద్ర ప్రభుత్వం వీటిని పట్టించుకోకుండా.. కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణ పట్ల పూర్తిగా వివక్ష చూపింది. తెలంగాణ పట్ల కేంద్రం అనుసరించిన తీరుపై శాసనసభ తీవ్ర అసంతృప్తిని, నిరసనను తెలియజేస్తోంది. ప్రస్తుతం కొనసాగుతున్న బడ్జెట్ చర్చల్లోనే కేంద్ర బడెŠజ్‌ట్‌కు సవరణలు చేసి.. తెలంగాణ రాష్ట్రానికి న్యాయం జరిగేలా తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ ఈ సభ తీర్మానం చేస్తోంది..’’
Comments
Please login to add a commentAdd a comment