కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు తీవ్ర అన్యాయం
సీఎం రేవంత్‌రెడ్డి మండిపాటు
తెలంగాణ అనే పదం పలకడానికే కేంద్రం ఇష్టపడలేదు
నిరసన తీర్మానం కేంద్రానికి పంపుతాం
ఇది కుర్చీ బచావో బడ్జెట్..ఏపీ, బిహార్ కోసం పెట్టినట్లుంది
నితీశ్, నాయుడు డిపెండెంట్ అలయెన్స్‌గా ఎన్‌డీఏ
సాక్షి, హైదరాబాద్: బడ్జెట్‌లో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందని, దీనిపై బుధవారం శాసనసభలో చర్చిస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ నిరసనను తెలియజేస్తూ తీర్మానం ఆమోదించి కేంద్రానికి పంపిస్తామని చెప్పారు. బడ్జెట్ ప్రసంగంలో తెలంగాణ అనే పదాన్నే నిషేధించిన కేంద్రం వైఖరిని ఎండగట్టడానికి శాసనసభలో జరిగే చర్చలో అన్ని పార్టీలు పాలుపంచుకోవాలని కోరారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా చర్చలో పాల్గొనాలని సూచించారు.
‘కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై వివక్షతో కాదు.. కక్ష పూరితంగా వ్యవహరించింది..’అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర బడ్జెట్‌ను కుర్చీ బచావో బడ్జెట్‌గా అభివరి్ణంచారు. నితీశ్, నాయుడు డిపెండెంట్ అలయెన్స్‌గా ఎన్‌డీఏ మారిందని ధ్వజమెత్తారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలంగాణ విషయంలో వైఖరిని మార్చుకుని, బడ్జెట్‌ను సవరించి విభజన హామీలతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కోరిన అంశాలకు అనుగుణంగా కేటాయింపులు జరపాలని కోరారు. మంగళవారం తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడారు.
పెద్దన్నలా వ్యవహరించాలని కోరినా..
‘మా ప్రభుత్వం, మంత్రివర్గ సహచరులు 18 సార్లు ఢిల్లీ వెళ్లి ప్రధానిని, కేంద్ర హోం మంత్రి,ని ఇతర మంత్రులను కలిశారు. స్వయంగా నేను మూడుసార్లు ప్రధానిని కలిసి తెలంగాణ అభివృద్ధి కోసం నిధులు ఇవ్వాలని కోరా. రాష్ట్రానికి వచ్చినప్పుడు అభివృద్ధి విషయంలో పెద్దన్నలా వ్యవహరించాలని ప్రధానికి చెప్పాం. కానీ మొత్తం బడ్జెట్‌లో తెలంగాణ అనే పదం పలకడానికే కేంద్రం ఇష్టపడలేదు. వారి మనసులో తెలంగాణ పట్ల ఇంత కక్ష ఉందని అనుకోలేదు. పునర్విభజన చట్టాన్ని ప్రస్తావిస్తూ ఏపీకి నిధులు కేటాయించిన కేంద్రం, అదే చట్టం ప్రకారం తెలంగాణకు నిధులు ఎందుకు కేటాయించలేదు?..’అని సీఎం నిలదీశారు.
వికసిత్ భారత్‌లో తెలంగాణ భాగం కాదా?
‘బయ్యారం, ఖాజీపేట కోచ్‌ఫ్యాక్టరీ, పాలమూరు– రంగారెడ్డి ప్రాజెక్టు, గిరిజన యూనివర్సిటీకి నిధుల ఊసు లేదు. సబ్ కా సాత్ సబ్ కా వికాస్ అనేది బోగస్ నినాదం. వికసిత్ భారత్‌లో తెలంగాణ భాగం కాదని ప్రధాని భావిస్తున్నారా? ఇది వికసిత్ భారత్ బడ్జెట్ కాదు.. కుర్చీ బచావో బడ్జెట్. బిహార్, ఏపీకి తప్ప ఇతర రాష్ట్రాలకు నిధులు కేటాయించలేదు. ఇంతటి వివక్ష, కక్షపూరిత వైఖరి ఎప్పుడూ చూడలేదు. బీజేపీని 8 సీట్లలో గెలిపించిన రాష్ట్రానికి ఇంత మోసం చేస్తారా? కేంద్ర వైఖరికి నిరసనగా కిషన్‌రెడ్డి కేంద్ర మంత్రివర్గానికి రాజీనామా చేసి బయటకు రావాలి.
ప్రధానిని మేం పెద్దన్నగా భావిస్తే.. ఆయన దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు. కేవలం క్విడ్ ప్రో కో విధానంలో కుర్చీ కాపాడుకునేందుకే ప్రధాని బడ్జెట్లో ప్రాధాన్యతనిచ్చారు. తెలంగాణ హక్కుల కోసం పార్లమెంట్‌లో కాంగ్రెస్ నిరసన తెలుపుతుంది. బడ్జెట్‌ను సవరించి బయ్యారం ఉక్కు కర్మాగారం, ఖాజీపెట్ కోచ్ ఫ్యాక్టరీ, పాలమూరు ప్రాజెక్టు, మెట్రో విస్తరణ, మూసీ అభివృద్ధికి నిధులు ఇవ్వాలి. లేకపోతే బీజేపీకి తెలంగాణలో నూకలు చెల్లినట్లే. కిషన్‌రెడ్డి మౌనం, బానిస మనస్తత్వంతో తెలంగాణకు అన్యాయం జరుగుతోంది. మంత్రి పదవి కోసం తెలంగాణ ఆత్మగౌరవాన్ని మోదీ వద్ద తాకట్టు పెట్టొద్దు..’అని రేవంత్ అన్నారు.
త్వరలో దక్షిణాది రాష్ట్రాల సీఎంల సమావేశం
‘ఏపీలో అమరావతికి వేల కోట్లు ఇస్తామన్న కేంద్ర ప్రభుత్వం, హైదరాబాద్‌లో అభివృద్ధి పనులకు, మౌలిక వసతుల కల్పనకు నిధులు ఎందుకు ఇవ్వదు? పోలవరానికి నిధులు ఇచ్చినప్పుడు.. తెలంగాణలో పాలమూరు ఎత్తిపోతలకు ఎందుకు ఇవ్వరు? బిహార్, ఏపీ కోసం బడ్జెట్ పెట్టినట్లు ఉంది. కుర్చీ లాలూచీలో తెలంగాణ ప్రజల ఆకాంక్షలను కాలరాస్తే ఊరుకోం. పార్లమెంట్‌లో నిరసనకు బీజేపీ ఎంపీలూ, ఎంఐఎం కూడా కలిసి రావాలి.
దక్షిణాది రాష్ట్రాలపై కేంద్రం వివక్ష చూపుతోంది. అందుకే త్వరలో దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం ఏర్పాటు చేయాలని భావిస్తున్నా. ఇప్పటికే తమిళనాడు, కర్ణాటక సీఎంలు ఒప్పుకున్నారు. కేరళ, ఆంధ్రప్రదేశ్ కలిసి వస్తాయో లేదో చూస్తాం. వివక్షతోనే తెలంగాణ ఉద్యమం వచ్చింది. ఇలాగే కొనసాగితే మరో ఉద్యమం తప్పదని కేంద్ర ప్రభుత్వానికి చెబుతున్నాం.’అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.
చర్చలో కేసీఆర్ పాల్గొనాలి..
‘బుధవారం ప్రశ్నోత్తరాల తరువాత స్పీకర్ అనుమతితో కేంద్ర బడ్జెట్‌పై తెలంగాణకు జరిగిన అన్యాయం గురించి చర్చించాలని శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్‌బాబుకు సూచిస్తున్నా. ఈ చర్చలో ఎవరు విలీనాల ప్రక్రియలో ఉన్నారో.. ఎవరు చీకటి ఒప్పందాలు చేసుకున్నారో బయటపడుతుంది. తెలంగాణ హక్కులు, నిధులపై జరిగే చర్చలో కేసీఆర్ పాల్గొనాలని సూచిస్తున్నా. లేకపోతే కేసీఆర్ కూడా మోదీకి మోకరిల్లినట్లే భావించాల్సి వస్తుంది..’అని రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. సమావేశంలో మంత్రులు శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, సీతక్క, సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment