సాక్షి, హైదరాబాద్: తామూ హిందువులమేనని, అయోధ్యలో రామమందిర నిర్మాణానికి తాము వ్యతిరేకం కాదని టీపీసీసీ చీఫ్ ఎన్. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. అయితే, భద్రాచలం రామ మందిరం అభివృద్ధికి నిధులు ఎందుకు ఇవ్వరని, ఈ ఆలయ భూములను కేంద్రం ప్రైవేటు వ్యక్తులకు ఎందుకు కేటాయించిందని ప్రశ్నిస్తున్నామని అన్నారు. సోమవారం గాంధీభవన్‌లో కాంగ్రెస్ పార్టీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థులకు ఆయన బీ–ఫారాలు అందజేశారు. అనంతరం ఎమ్మెల్సీ నియోజకవర్గాల అభ్యర్థులు ఎస్.రాములునాయక్, జి. చిన్నారెడ్డి, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జెట్టి కుసుమకుమార్, మాజీ మంత్రి కొండా సురేఖ, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి బొల్లు కిషన్ తదితరులతో కలసి ఆయన మీడియాతో మాట్లాడారు.
వచ్చే నెలలో జరగనున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాం గ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని యువతను కోరారు. రాష్ట్రంలో నిరుద్యోగ భృతి ఇవ్వకుండా, ఖాళీగా ఉన్న 1.90 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయకుండా టీఆర్‌ఎస్ ప్రభుత్వం అన్యాయం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. టీఆర్‌ఎస్‌కు బుద్ధి చెప్పాల్సిన రోజులు వచ్చాయని, ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ను దెబ్బ కొడితే నెలకు రూ.3,016 నిరుద్యోగ భృతి వస్తుందని, ఉద్యోగ ఖాళీలు భర్తీ అవుతాయని ఉత్తమ్ చెప్పారు. పల్లా రాజేశ్వర్‌రెడ్డి విద్యా వ్యాపారి అని, పైసా పని చేయని ఆయన్ను చిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు. నిజాయితీగా పనిచేస్తున్న నిజమైన తెలంగాణ వాదులకు పట్టభద్రులకు పట్టం కట్టాలని ఉత్తమ్ పిలుపునిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment