![Uttar Pradesh Assembly Election 2022: jayant chaudhary talks on up assembly elections - Sakshi](/styles/webp/s3/article_images/2022/01/22/JAYANTHI123.jpg.webp?itok=gP55G7uM)
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో మతపరంగా ఓట్లను సంఘటితం చేసే రాజకీయాలకు ఇక చోటులేదని రాష్ట్రీయ లోక్‌దళ్ (ఆర్‌ఎల్‌డీ) చీఫ్ జయంత్ చౌధురి అన్నారు. హిందుత్వ ఎజెండా రాజకీయాలతో ప్రజలు విసిగిపోయారన్నారు. ముస్లిం వ్యతిరేకతని తమ నైపుణ్యం అంతా ఉపయోగించి భావోద్వేగాలు రెచ్చగొట్టే ప్రయత్నం ఎంత చేసినా... ఎవరూ వినే పరిస్థితి లేదన్నారు. సమాజ్‌వాదీ పార్టీతో పొత్తు పెట్టుకొని బీజేపీకి సవాల్ విసురుతున్న జయంత్ చౌధరి ఒక వార్తా సంస్థతో తన అంతరంగాన్ని ఆవిష్కరించారు.
ప్ర: బీజేపీని వీడి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర నాయకులు ఎందుకు ఎస్పీలో చేరుతున్నారు ?
జ: గత అయిదేళ్లుగా ప్రభుత్వంలో ఉండి ప్రజలకి ఏమీ చెయ్యలేకపోయామన్న అసంతృప్తి వారిలో కనిపిస్తోంది. సరైన ప్రత్యామ్నాయం కనిపించగానే వరసపెట్టి వస్తున్నారు.
ప్ర: ఎన్నికల్లో ప్రతిపక్షాల ఓట్లు చీలిపోయి బీజేపీకి అనుకూలంగా మారే పరిస్థితి ఉందా?
జ: విపక్షాల ఓట్లు చీలిపోయే ప్రసక్తే లేదు. గత ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేసిన వారంతా ఇప్పుడు ఎస్పీ కూటమి వైపే చూస్తున్నారు. పాలనా వైఫల్యం, నాయకత్వ లోపాలు, కాగడావేసి చూసినా కనిపించని అభివృద్ధి.. వీటన్నింటితో ఓటర్లు బీజేపీకి దూరమవుతున్నారు.
ప్ర: హిందూత్వ రాజకీయాలు ఈసారి ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తాయి?
జ: గత అయిదేళ్లలో హిందుత్వ ఎజెండాతో ఎన్నో ఘటనలు జరిగాయి. విద్వేషం రాజేయడం, దాడులు జరపడం కళ్లారా చూశాం. వాటితో వచ్చే ప్రయోజనం ఏమీ లేదని ప్రజలు గ్రహిస్తున్నారు. మథురలో మందిరం అంశంపై బీజేపీ పిలుపునిస్తే పట్టుమని పది మంది కూడా రాలేదు. మతం, మందిరం అంటే ప్రజలు వినే రోజులు పోయాయి. బీజేపీ వన్ గేర్ కారులో వెనక్కి వెళుతోంది.
ప్ర: ఈ ఎన్నికల్లో ప్రభావం చూపించే అంశాలేమిటి?
జ: రైతులు ఎదుర్కొంటున్న సంక్షోభ పరిస్థితులు, ఉపాధి అవకాశాలు, మహిళా సాధికారత, యువత ఎదుర్కొంటున్న సమస్యలన్నీ కీలకం కానున్నాయి. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా అన్నదాతలు చేసిన నిరసనలతో వారు బీజేపీపై ఎంత ఆగ్రహంగా ఉన్నారో తెలుస్తోంది.
ప్ర: ఎస్పీ–ఆర్‌ఎల్‌డీ కూటమి విజయావకాశాలు ఎంత?
జ: హిందుత్వ ఎజెండా ఓట్లను సంఘటితం చేస్తూ ఉండడం వల్ల ఇన్నాళ్లూ మేమెంతో నష్టపోయాం. ప్రజలెదుర్కొంటున్న అసలు సిసలు సమస్యలపై మేము దృష్టి పెట్టాం. ప్రజలు ఇప్పుడు మార్పుని కోరుకుంటున్నారు. దేశంలో ఒకట్రెండు రాష్ట్రాల్లో మినహా మరెక్కడా లేని విధంగా పాఠశాలల్లో విద్యార్థినులకు ఉచితంగా శానిటరీ ప్యాడ్స్ ఇస్తామని హామీ ఇచ్చాం. 22 తీర్మానాలతో మా పార్టీ ప్రవేశపెట్టిన మేనిఫెస్టో ప్రజల్లోకి బలంగా వెళ్లింది.అందుకే మా గెలుపు ఖాయం.
Comments
Please login to add a commentAdd a comment