సాక్షి, న్యూఢిల్లీ: ఉత్తర్ ప్రదేశ్ చివరి దశ (ఏడో దశ) ఎన్నికలు ముగియడంతో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ తుది అంకానికి చేరుకుంది. మార్చి 10న తుది ఫలితాలు వెల్లడికానున్నాయి. ఈక్రమంలో సోమవారం సాయంత్రం ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు విడుదలయ్యాయి. ఓటర్ల నాడీ ఎలా ఉంది? ఏ పార్టీకి ఓటరు దేవుళ్లు పట్టం కట్టనున్నారో పలు ఎగ్జిట్ పోల్స్ సంస్థలు తమ సర్వే వివరాల్లో తెలిపాయి. కొన్ని సందర్భాల్లో మినహాయించి చాలా సందర్భాల్లో ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు నిజమయ్యాయి. ఈనేపథ్యంలో ఉత్తరాఖండ్‌కు సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ వివరాలు..
హోరాహోరీగా సాగిన ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీజేపీ మరోసారి గట్టెక్కేందుకు పరిస్థితులు అంత సులభంగా లేనట్టు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు చెప్తున్నాయి. కాంగ్రెస్ గతంలో కంటే మరింత పుంజుకునే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. 70 అసెంబ్లీ స్థానాలు గల రాష్ట్ర అసెంబ్లీకి ఫిబ్రవరి 16, 23 తేదీల్లో రెండు విడతల్లో ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే.
ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే 36 సీట్లు కావాలి. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 46.5 శాతం, కాంగ్రెస్ 33.5 శాతం ఓట్లు సాధించాయి. బీఎస్పీ 7 శాతం ఓట్లు సాధించాయి. కాగా, తాజా ఎన్నికల్లో పోటీ ప్రధానంగా బీజేపీ, కాంగ్రెస్ మధ్యే ఉన్నప్పటికీ ఈసారి ఆప్ కూడా రంగంలోకి దిగడంతో రసవత్తరంగా మారింది. ప్రస్తుత సీఎం పుష్కర్ సింగ్ ధామి బీజేపీని ఒడ్డున పడేస్తారా? లేక కాంగ్రెస్ కమలానికి షాకిస్తుందా తేలాలంటే మార్చి 10 వరకు వేచి చూడాల్సిందే!
Comments
Please login to add a commentAdd a comment