డెహ్రాడూన్: హిజాబ్ వివాదం కర్నాటకలో ప్రారంభమై దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. హిజాబ్ అంశం చినికి చినికి చివరకు సుప్రీంకోర్టుకు వరకు వెళ్లిన విషయం తెలిసిందే. అత్యున్నత న్యాయస్థానం సైతం ఈ అంశాన్ని పెద్దది చేయకండి అంటూ వ్యాఖ‍్యానించింది. ఇదిలా ఉండగా అసెంబ్లీ ఎన్నికల వేళ ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీ సంచలన వ్యాఖ్యలు చేశారు. మళ్లీ తాము అధికారంలోకి వస్తే రాష్ట్రంలో యూనిఫామ్ సివిల్ కోడ్‌ను అమలుచేస్తామని తెలిపారు. దీని కోసం ఓ కమిటీని సైతం ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించారు.
అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా పుష్కర్ సింగ్ ధామీ శనివారం ఖతిమాలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో బీజేపీ నేతృత్వంలో తాము అధికారంలోకి వస్తే యూనిఫామ్ సివిల్ కోడ్ ను తీసుకురానున్నట్టు పేర్కొన్నారు. యూనిఫామ్ సివిల్ కోడ్ ముసాయిదా కోసం ఒక కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. ఈ తరహా కోడ్‌ను అమలు చేయడం వల్ల ఉత్తరాఖండ్ లో ప్రతీ ఒక్కరికీ సమాన హక్కులు కలుగుతాయని అన్నారు. ఇది సామాజిక సామరస్యాన్ని పెంపొందించడమే కాకుండా మహిళా సాధికారత బలోపేతానికి దోహదపడుతుందన్నారు.
చదవండి: హిజాబ్ వివాదం.. కొత్త మలుపు! ఐబీ హెచ్చరికలు
‘దేవభూమి’ సంస్కృతి, వారసత్వాన్ని చాటిచెప్పడమే తమ ప్రధాన కర్తవ్యమని, తాము దీని కోసం కట్టుబడి ఉన్నట్టు వెల్లడించారు. ఇదిలా ఉండగా శనివారంతో ఉత్తరాఖండ్‌లో ఎన్నికల ప్రచారం ముగియనుంది. రాష్ట్రంలో ఫిబ్రవరి 14(సోమవారం)న పోలింగ్ జరుగనుంది. మార్చి 10వ తేదీన ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment