ఒక మహిళపై అమానుషంగా దాడి చేశారనే విమర్శలు ఉత్తర ప్రదేశ్ పోలీసుల్ని చుట్టుముట్టాయి. కాన్పూర్ డెహత్ జిల్లాకు చెందిన ఓ పోలీస్ అధికారి.. ఓ వ్యక్తిని అక్రమంగా అరెస్ట్ చేయడంతో పాటు అతని భార్యపై దాడి చేశాడనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
కాన్పూర్ డెహత్(దెహత్) జిల్లా దుర్గాదాస్‌పూర్ గ్రామంలో శనివారం జరిగిన ఈ ఘటన తాలుకా వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. తన భర్త అక్రమంగా అరెస్ట్ చేశారని, వదిలిపెట్టాలంటే డబ్బు ఇవ్వాలని భోగిన్‌పూర్ ఎస్సై మహేంద్ర పటేల్ డిమాండ్ చేశాడని బాధితురాలు ఆరోపిస్తోంది. ఇవ్వనని చెప్పడంతో తనను లాగేసి నేల మీద పడేసి కొట్టాడని, మీద కూర్చుని ముఖం మీద దాడి చేశాడని, గ్రామస్తుల జోక్యం చేసుకోవడంతో తను వదిలేశాడని వాపోయిందామె.
అయితే ఆ సమయంలో స్నేహితులతో శివం యాదవ్ జూదం ఆడుతున్నాడని. అరెస్ట్ చేసి తీసుకెళ్తుంటే అతని భార్య ఆర్తి, తల్లి తమను అడ్డుకోవాలని ప్రయత్నించారని, ఈ క్రమంలో వాళ్లే తన బృందంపై దాడి చేశారని ఎస్సై పటేల్ చెప్తున్నారు. ఇదిలా ఉంటే ఈ ఘటనపై కాన్పూర్ ఎస్పీ చౌదరి స్పందిస్తూ.. శివం పారిపోయేందుకు సాయం చేసేందుకే అతని భార్య తనను అడ్డగించే ప్రయత్నం చేస్తున్నారని పటేల్ భావించాడని, అందుకే అలా ప్రవర్తించాడని తెలిపారు. పటేల్‌ను భోగిన్‌పూర్ విధుల నుంచి తప్పించామని, ఘటనపై దర్యాప్తు చేయించి కారకులపై కఠిన చర్యలు తీసుకుంటామని కాన్పూర్ ఎస్పీ చౌదరి తెలిపారు. మరోవైపు సమాజ్‌వాదీ పార్టీ ఈ ఘటనపై రాజకీయ విమర్శలు చేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment