
సాక్షి, అమరావతి: ‘పోటీ చేసిన రెండు చోట్లా ఓడిపోయి నీలా బీరాలు పలుకుతున్న పిరికివాడు కాదు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.151 అసెంబ్లీ, 22 పార్లమెంట్ స్థానాలను కైవసం చేసుకున్న ధీరుడు.’ అంటూ జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌పై ఆంధ్రప్రదేశ్ ఇంటలెక్చువల్స్, సిటిజన్స్ ఫోరం (ఏపీఐసీ) అధ్యక్షుడు పి.విజయబాబు విరుచుకుపడ్డారు. సిద్ధం అంటే యుద్ధం అంటామంటున్న పవన్ అసలు తాను ఈ సారి ఎన్నికల్లో ఏ స్థానం నుంచి పోటీ చేయాలనుకుంటున్నాడో ముందు తేల్చుకుని దానికి సిద్ధమవ్వాలని విజయబాబు హితవు పలికారు.
విజయవాడలోని ఏపీఐసీ కార్యాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎన్నికలు సమీపిస్తున్నప్పుడైనా పవన్‌కళ్యాణ్ వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని, కానీ అతని వ్యాఖ్యలు రాజకీయాలపై అతని అవగాహనా రాహిత్యాన్ని, డొల్లతనాన్ని బయటపెడుతున్నాయని ఎద్దేవా చేశారు. పవన్‌కి అసలు అభివృద్ధి అంటే తెలుసునా అని ఆయన ప్రశ్నించారు. దోచుకుని సింగపూర్‌లో దాచుకోవడమేనా అభివృద్ధి అంటే అని నిలదీశారు.
కోవిడ్‌లో రెండేళ్లు మినహాయిస్తే..జగన్ చేసిన అప్పుల శాతం ఎంత, గత ప్రభుత్వంలో టీడీపీ చేసిన అప్పుల శాతం ఎంత అనేది బేరీజు వేసుకుంటే టీడీపీ చేసిన అప్పులే ఎక్కువని సాక్షాత్తూ కాగ్, ఫైనాన్స్‌కమిషన్ రిపోర్టులు స్పష్టం చేస్తున్నాయని ఆయన వెల్లడించారు. ఆ రిపోర్టులను పవన్‌కళ్యాణ్ చదువుకుంటే మంచిదని, కాపీలు ఆయన వద్ద లేకపోతే తాను పంపుతానని విజయబాబు చెప్పారు.
రాష్ట్ర విభజన నాటికి మిగులు రెవెన్యూలో ఉన్న ఏపీ బాబు అధికారంలోకి వచ్చాక పతనమైందన్నారు. జగన్ ప్రమాణ స్వీకారం చేసే నాటికి రాష్ట్ర ఖజానాలో కేవలం రూ.100 కోట్లు మాత్రమే చంద్రబాబు మిగిల్చారని వివరించారు. బాబు సీఎం కాక ముందు మొత్తం అప్పు రూ.1.53 లక్షల కోట్లు కాగా, ఆయన దిగిపోయే నాటికి దానిని రూ.4.12 లక్షల కోట్లు చేశారని విజయబాబు వెల్లడించారు.