వైఎస్సార్‌కు నివాళులర్పించి మాట్లాడుతున్న ఎంపీ విజయసాయిరెడ్డి
సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ అభివృద్ధే లక్ష్యంగా ప్రజాప్రతినిధులు, పార్టీశ్రేణులు పనిచేయాలని వైఎస్సార్ సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ వి.విజయసాయిరెడ్డి పిలుపునిచ్చారు. మరో 25 ఏళ్ల పాటు ఏపీ సీఎంగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాల ప్రజలు సుభిక్షంగా ఉండాలంటే జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండాలని చెప్పారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ 12వ వర్ధంతి సందర్భంగా గురువారం విశాఖ మద్దిలపాలెంలోని పార్టీ నగర కార్యాలయంలో ఆయన మాట్లాడారు. భూ వ్యవహారాల్లో తలదూరుస్తున్నానని ఇటీవల ప్రతిపక్షాలు తనపై ఆరోపణలు చేస్తున్నాయని, అవన్నీ వదంతులే తప్ప వాస్తవం లేదని చెప్పారు. డబ్బు పట్ల, భూముల కొనుగోలు, భూ ఆక్రమణల పట్ల తనకు ఎటువంటి అత్యాశ, ఆసక్తి లేవన్నారు. సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలకనుగుణంగా ఉత్తరాంధ్ర ప్రజలకు సేవచేసే అవకాశం కలిగిందని చెప్పారు. అంతేతప్ప ఆస్తులు సంపాదించాలన్న అత్యాశ లేదని స్పష్టం చేశారు. ప్రతిపక్షాలు, ఎల్లో మీడియా తనపై దుష్ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు.
విశాఖలో స్థిరపడాలనుకుంటున్నానని, దానికి కూడా ఐదు లేదా ఆరెకరాల వ్యవసాయ భూమిని మాత్రమే కొనుక్కుంటానని చెప్పారు. తనతో పాటు తన భార్య, అమ్మ మాత్రమే ఉంటారని తెలిపారు. భవంతులు, డబ్బులు సంపాదించి ఎవరికిచ్చుకుంటానన్నారు. త్వరలో రెండు టోల్ ఫ్రీ నంబర్లు కేటాయిస్తామని, తన పేరు చెప్పి ఎవరైనా భూఆక్రమణలు లేదా పంచాయితీలు చేస్తే క్రిమినల్ కేసులు పెడతామని హెచ్చరించారు. ఎవరైనా అధికార దుర్వినియోగానికి పాల్పడితే ఉపేక్షించేది లేదన్నారు. గతంలో తన దృష్టికి వచ్చిన కొన్ని సంఘటనలను వెంటనే సీపీ దృష్టికి తీసుకెళ్లి అరెస్ట్ చేయించానని ఆయన చెప్పారు. అంతకుముందు ఆయన వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, మేయర్ గొలగాని హరివెంకటకుమారి, ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్‌లు, కార్పొరేటర్లు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment