సాక్షి, అమరావతి: ఆర్థిక నేరాలకు పాల్పడినందుకు సిగ్గుతో తల దించుకోవాల్సిందిపోయి తాను ఏ తప్పూ చేయలేదంటూ దబాయించడం టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, ఆయన గ్యాంగ్‌కే చెల్లిందని వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబుకు రిమాండ్ విధిస్తూ ఏసీబీ కోర్టు ఇచ్చిన తీర్పుపై ఆయన హర్షం వ్యక్తం చేశారు.
తీవ్ర ఆర్థిక నేరాలకు పాల్పడిన చంద్రబాబుకు న్యాయస్థానాలు తగిన శిక్షలు విధించడం ఖాయమన్నారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం రాత్రి ఆయన మీడియాతో మాట్లాడుతూ స్కిల్ స్కామ్‌కు రూపకర్త, నిర్మాత, దర్శకత్వం, విలన్ అన్నీ చంద్రబాబేననే బలమైన సాక్షాధారాలతోనే సీఐడీ పోలీసులు ఆయన్ను అరెస్టు చేశారని చెప్పారు. చంద్రబాబు గ్యాంగ్ శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా వ్యవహరిస్తోందని మండిపడ్డారు.
చంద్రబాబు కుమారుడు లోకేశ్, దత్తపుత్రుడు పవన్‌కళ్యాణ్, మిగిలిన చెత్త చెదారం వ్యవహరించిన తీరును రాష్ట్రం మొత్తం గమనించిందన్నారు. స్కిల్ స్కామ్‌లో ఏసీబీ కోర్టు చంద్రబాబును రిమాండ్‌కు పంపడం పెద్ద విషయంగా తాము అనుకోవడం లేదన్నారు. చంద్రబాబుపై బలమైన ఆధారాలున్నాయి కాబట్టి ఆయన పాల్పడిన ఆర్థికనేరం తప్పకుండా రుజువు అవుతుందన్నారు. మీడియాతో మాట్లాడుతూ సజ్జల రామకృష్ణారెడ్డి ఇంకా ఏమన్నారంటే..
ఖజానా లూటీకే స్కిల్ స్కీం..
చంద్రబాబును సీఐడీ పోలీసులు అరెస్టు చేసినప్పటి నుంచి టీడీపీ నేతలు, ఆయన కుటుంబ సభ్యులు ప్రపంచంలో జరగరాని ఘోరం జరిగినట్లు వ్యవహరించారు. దేశంలో చాలా కేసుల్లో మాజీ సీఎంలను అరెస్టు చేసినా ఎవరూ ఇలా బరితెగించి వ్యవహరించలేదు. ప్రభుత్వ ఖజానాను లూటీ చేయడం కోసమే ఒక స్కీంను పెట్టిన చంద్రబాబు లేని కంపెనీని తీసుకొచ్చి, ఒక కంపెనీ పేరును దొంగతనంగా వాడుకుని నేరం చేశారు.
స్కిల్ డెవలెప్‌మెంట్ కార్పొరేషన్‌ను పెట్టి ఒక బయటి వ్యక్తిని తెచ్చి నాలుగు డిపార్ట్‌మెంట్లకు సెక్రటరీగా నియమించారు. దానికో శాఖను సృష్టించి చంద్రబాబే నేరుగా నిర్వహించారు. యువతలో నైపుణ్యాలను పెంచేలా శిక్షణ ఇచ్చే స్కిల్ స్కీంలో 90 శాతం ప్రైవేట్ కంపెనీ గ్రాంట్ ఇన్ ఎయిడ్‌గా ఇస్తే 10 శాతం ప్రభుత్వం ఇస్తుందంటూ ఉత్తర్వులు జారీచేశారు. సీమెన్స్ కంపెనీకి తెలియకుండా తాను సృష్టించిన డొల్ల కంపెనీకి రూ.371 కోట్లు ఇచ్చేశారు.
ఆ సొమ్మును నేరుగా బయటకు పంపించి అక్కడి నుంచి షెల్ కంపెనీలకు పంపి, అక్కడి నుంచి తన ఇంటికి చంద్రబాబు తెచ్చుకున్నారు. ఈ కుంభకోణం అంతా చంద్రబాబుకు తెలుసు. ఎందుకంటే ఆ శాఖను నిర్వహిస్తున్నది ఆయనే. ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, కార్యదర్శి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేరుగా ముఖ్యమంత్రి చెప్పారు కాబట్టి చెల్లించాలని చెప్పారు. రూ.371 కోట్లు కొట్టేయాలని ఇంత గ్రాండ్‌గా ప్లాన్ చేశారు.
దత్తపుత్రుడి వీరంగమే ఎక్కువ..
చంద్రబాబు అరెస్టుపై సొంతపుత్రుడు లోకేశ్ కంటే దత్తపుత్రుడు పవన్ వీరంగం వేశాడు. రోడ్డుపై విలాసంగా కాలు మీద కాలు వేసుకుని పడుకున్నాడు. చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ వైఎస్ జగన్ ప్రభుత్వాన్ని తాలిబన్లు, చెడ్డీ గ్యాంగ్ అంటూ దూషిస్తూ ఈనాడులో బూతులన్నీ రామోజీరావు రాశాడు. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ కూడా అదే రీతిలో రోత రాతలు రాశాడు.
బాబు జీవితమంతా అవినీతిమయమే..
చంద్రబాబు 40 ఏళ్ల రాజకీయ జీవితంలో కుంభకోణాలు తప్ప ఏమైనా ఉన్నాయా? అవినీతి తప్ప సక్రమ మార్గంలో పది అడుగులైనా వేశాడా? కేవలం స్టేల ద్వారా, వ్యవస్థలను మేనేజ్ చేయడం ద్వారానే చంద్రబాబు రాజకీయంగా నిలబడుతున్నాడు. అలా బతుకుతూ బీరాలు పలుకుతూ తొడలు గొడుతూ చాలెంజ్ చేస్తున్నాడు. 40 ఏళ్ల జీవితంలో మచ్చలేని వాడినని, నన్ను ఎవరేం పీక్కుంటారని చంద్రబాబు అంటాడు. ఆర్థిక నేరానికి పాల్పడిన చంద్రబాబును సాక్ష్యాధారాలతో అరెస్టు చేస్తే తానేం తప్పు చేయలేదంటూ దబాయిస్తున్నాడు.
పబ్లిసిటీ డ్రామాలు..
నంద్యాలలో శనివారం సీఐడీ పోలీసులు అరెస్టు చేసినప్పటి నుంచి చంద్రబాబు పబ్లిసిటీ కోసం డ్రామాలాడారు. వయసులో వృద్ధుడు, మాజీ సీఎం అని గౌరవంగా హెలికాఫ్టర్ ఏర్పాటు చేశాం. అందులో విజయవాడ తీసుకెళ్తామని చెప్పిన సీఐడీ పోలీసులపై చంద్రబాబు రంకెలు వేశాడు. డీఐజీతో ఎదురుగా కూర్చుని ఒక కెమెరా పెట్టించుకుని దబాయించాడు. ఆ అధికారి గట్టిగా నిలబడ్డాడు కాబట్టి సరిపోయింది. ఒక పోలీసు అధికారిని లోకేశ్ బూతులు తిట్టాడు.
పోలీసులు ఏమైనా జీతగాళ్లు, పాలేర్లు అని అనుకుంటున్నారా చంద్రబాబు, లోకేశ్? హెలికాఫ్టర్‌లో మర్యాదగా వస్తే ఉదయం 11 గంటలకు దిగేవాడు. పబ్లిసిటీ కోసం డ్రామా చేశాడు. వారి పబ్లిసిటీ స్టంట్ ఆదివారం అచ్చెన్నాయుడు మాటల్లోనే తేలింది. చంద్రబాబు కోసం జనం ఎందుకు రావాలి? అవినీతి చేసి కోర్టుకు వెళ్తుంటే అల్లర్లు చేయాలా? వాళ్లు చేసిన హడావుడి వల్ల రాత్రి వేళ చంద్రబాబును సీఐడీ కార్యాలయానికి తెచ్చారు. దీనికీ సీఎం జగన్‌పై విమర్శలు చేస్తున్నారు.
స్పెషల్ ఫ్లైట్‌లో లాయర్ దేనికి?
చంద్రబాబు ఏ తప్పూ చేయనప్పుడు ఢిల్లీ నుంచి స్పెషల్ ఫ్లైట్‌లో లాయర్‌ను రప్పించడం దేనికి? రోజు రూ.కోటి, కోటిన్నర ఫీజుగా చెల్లించడం దేనికి? సీఎం జగన్ స్పెషల్ ఫ్లైట్‌లో విదేశాలకు వెళ్లారని ఈనాడులో వార్తలు రాశారు. చంద్రబాబును పరామర్శించేందుకు బాలకృష్ణ ఒక స్పెషల్ ఫ్లైట్, లాయర్ ఒక స్పెషల్ ఫ్లైట్‌లో వస్తే ఎందుకు రాయలేదు?.
నిజాయితీని ఆశించే వారంతా సంతోషిస్తారు..
తప్పులు జరగకూడదు.. పారదర్శకత ఉండాలి.. అవినీతిని తుదముట్టించాలనుకునే ప్రతి ఒక్కరూ చంద్రబాబు అరెస్టు, రిమాండ్‌తో సంతోషపడతారు. తప్పు చేసినప్పుడు ముఖానికి గుడ్డ కప్పుకుని వెళ్లాల్సిన చంద్రబాబు రొమ్ము విరుచుకుని తిరుగుతున్న తీరు చూసిన ప్రజలు ఛీత్కరిస్తున్నారు. ఇది మా విజయంగా భావించడం లేదు. ప్రజాధనానికి మనం ధర్మకర్తలమే. మనం ప్రజలకు జవాబుదారీ అనేలా ఉండాలనేది సీఎం జగన్ విధానం. దానికి పూర్తిగా వ్యతిరేకమైన వ్యక్తి చంద్రబాబు. స్కిల్ స్కాంపై కోర్టులో విచారణను చంద్రబాబు ఎదుర్కోవాలి. కోర్టు నిర్ణయం తీసుకుంటుంది.
చంద్రబాబు తప్పు చేశారు.. అది బయటకు రావాలి.. భవిష్యత్తులో మరొకరు అలా చేయకూడదన్నదే సీఎం జగన్ విధానం. అమరావతి భూ కుంభకోణం, అసైన్డు భూ కుంభకోణం, ఫైబర్ గ్రిడ్ స్కాం, సాగునీటి ప్రాజెక్టుల్లో అక్రమాలు.. ఇలా చంద్రబాబు పాల్పడిన అవినీతిపై విచారణ జరుపుతాం. స్కిల్ స్కామ్‌తో సహా అన్ని కుంభకోణాలను ఎన్నికల్లో ప్రజలకు వివరిస్తాం. రాష్ట్రం ఇప్పుడిప్పుడే వెలుగుల్లోకి వస్తోందని.. చంద్రబాబు వస్తే మళ్లీ చీకట్లోకి వెళ్లడం ఖాయమని ప్రజలను చైతన్యపరుస్తాం.
Comments
Please login to add a commentAdd a comment