పురూలియా జిల్లాలో ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతున్న మమత
కలైకుందా/గర్బేటా: పశ్చిమ బెంగాల్‌లో త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించాక, ఢిల్లీలో పరివర్తన్ (మార్పు) తీసుకొస్తానని ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత మమతా బెనర్జీ స్పష్టం చేశారు. ఈ ఎన్నికల్లో గెలిచాక తాను కేంద్ర రాజకీయాల్లో అడుగుపెడతానని, ప్రత్యామ్నాయంగా మారుతానని బీజేపీ భయపడుతోందని, అందుకే ఆ పార్టీ పెద్దలంతా బెంగాల్‌ను లక్ష్యంగా చేసుకున్నారని చెప్పారు. పరివర్తన్ అంటూ తాను ఇచ్చిన నినాదాన్ని బీజేపీ దొంగిలించిందని, దాన్ని అసోల్ పరివర్తన్ (అసలైన మార్పు) అంటూ రీమోడలింగ్ చేసిందని విమర్శించారు. మమతా బెనర్జీ గురువారం పశ్చిమ మేదినీపూర్ జిల్లాలో ఎన్నికల ప్రచార సభల్లో ప్రసంగించారు. అసెంబ్లీ ఎన్నికల్లో రిగ్గింగ్ చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలంతా అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. ఆమె ఇంకా ఏం మాట్లాడారంటే..
బీజేపీతో కూటమి కుమ్మక్కు
‘‘పోలీసులపై నాకు గౌరవం ఉంది. వారు తప్పుడు పనులు చేయరు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో గోల్‌మాల్ చేయాలని బీజేపీ నుంచి ఆదేశాలు వచ్చినట్లు తెలిసింది. ఒకప్పుడు మావోయిస్టులకు కంచుకోట అయిన జంగల్‌మహల్ సమగ్రాభివృద్ధికి మా ప్రభుత్వం ఎంతో కృషి చేసింది. బెంగాల్‌లో సీపీఎం–కాంగ్రెస్ కూటమి మతతత్వ బీజేపీతో చేతులు కలిపింది. అందుకే మార్క్సిస్టు మిత్రులు కూడా ఆ కూటమి అభ్యర్థులకు ఓటేయవద్దు. గాంధీజీని హత్య చేసిన వారితో సంబంధాలున్న వారికి ఒక్క ఓటు కూడా వేయొద్దు.
దుర్గాపూజకు రూ.50,000 ఇస్తాం
తృణమూల్ కాంగ్రెస్‌ను మళ్లీ గెలిపిస్తే బెంగాల్‌లో ఓడరేవులు, పరిశ్రమలు స్థాపిస్తాం. భారతీయ రైల్వేను అమ్మేయడానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కంకణం కట్టుకుంది. రైల్వే ఉద్యోగులు ఆ పార్టీని ఓడించాలి. మా పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తే విద్యార్థులు ఉన్నత చదువులు చదవడానికి తక్కువ వడ్డీతో రూ.10 లక్షల రుణం మంజూరు చేస్తాం. దుర్గాపూజ చేసుకోవడానికి కమ్యూనిటీ క్లబ్‌లకు రూ.50 వేల చొప్పున ఇస్తాం.
డబ్బు సంచులు తెస్తున్నారు
బీజేపీ అబద్ధాల పార్టీ, ఇచ్చిన హామీలను ఆ పార్టీ ఎప్పుడూ నెరవేర్చదు. నరేంద్ర మోదీ హామీ ఇచ్చినట్లుగా రూ.15 లక్షలు ప్రజలకు అందాయా? ప్రధానమంత్రిగా కుర్చీ ఎక్కాక ఆయన తన çహామీని తుంగలో తొక్కారు. బెంగాల్‌లో కరోనా మహమ్మారిని సమర్థంగా నియంత్రిస్తున్నాం. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో కరోనా మళ్లీ ఉధృతంగా వ్యాప్తి చెందుతోంది. రాష్ట్ర రాజధాని కోల్‌కతా నగర సంస్కృతిలో భాగమైన ‘కోల్‌కతా కాఫీ హౌస్’పై ఆధిపత్యం చెలాయించడానికి బీజేపీ గూండాలు కుట్ర పన్నుతున్నారు. దాని గొప్పదనం వారికి తెలియదు. నందిగ్రామ్‌లో బీజేపీ నేతలు నాపై దాడి చేశారు. ఇప్పుడు వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారు. కేంద్రంలోని బీజేపీ సర్కారు కోట్లాది రూపాయల అక్రమాలు సాగించింది. ప్రభుత్వ రంగ సంస్థల అమ్మకంతో పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారుతోంది. ఆ డబ్బుకు లెక్కాపత్రం ఉండడం లేదు. బీజేపీ నాయకులు పెద్ద ఎత్తున డబ్బు సంచులు హెలికాప్టర్లు, విమానాల్లో తీసుకొస్తున్నారు. బెంగాల్‌లో ఎలాగైనా నెగ్గాలని కుట్ర పన్నుతున్నారు’’ అని మమతా బెనర్జీ ధ్వజమెత్తారు.
Comments
Please login to add a commentAdd a comment