వారణాసిలో మోదీ ప్రత్యర్థి.. ఎవరీ 'అథర్ జమాల్ లారీ'? | Sakshi
Sakshi News home page

వారణాసిలో మోదీ ప్రత్యర్థి.. ఎవరీ 'అథర్ జమాల్ లారీ'?

Published Tue, Apr 16 2024 1:22 PM

Who is Athar Jamal Lari Against PM Modi in Varanasi - Sakshi

న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి మాయావతి నేతృత్వంలోని బీఎస్పీ పార్టీ 2024 లోక్‌సభ ఎన్నికలకు 11 మంది అభ్యర్థులతో కూడిన జాబితాను మంగళవారం విడుదల చేసింది. ఇందులో భారత ప్రధాని మోదీకి ప్రత్యర్థిగా వారణాసి నుంచి 'అథర్ జమాల్ లారీ'ని రంగంలోకి దించారు. ఇంతకీ అథర్ జమాల్ లారీ ఎవరు? ఆయన బ్యాగ్రౌండ్ ఏంటి అనే వివరాలు వివరంగా ఇక్కడ తెలుసుకుందాం.

వారణాసిలో జూన్ 1న లోక్‌సభ ఎన్నికల పోలింగ్ జరగనుంది. వారణాసి నరేంద్ర మోదీకి కంచుకోట. ఇప్పటికే 2014, 2019 లోక్‌సభ ఎన్నికల్లో రెండుసార్లు విజయం సొంతం చేసుకున్నారు. ఇప్పుడు మరోమారు వారణాసి నుంచే ఎన్నికల్లో పోటీ చేయనున్నారు.

అథర్ జమాల్ లారీ (Athar Jamal Lari) ఎవరు?
అథర్ జమాల్ లారీ వారణాసికి చెందిన స్థానిక వ్యక్తి. ఈయన 1980 నుంచి రాజీకీయాల్లో చురుకుగా పాల్గొంటున్నారు. ప్రస్తుతం బీఎస్పీ పార్టీలో ఉన్న అథర్ జమాల్.. ఇంతకు ముందు జనతాదళ్, సమాజ్‌వాదీ పార్టీ, అప్నా దళ్, క్వామీ ఏక్తా దళ్‌తో సహా అనేక రాజకీయ పార్టీలతో కలిసి పనిచేశారు.

లారీ గతంలో జరిగిన ఎన్నికల్లో పోటీ చేసి మూడుసార్లు అసెంబ్లీ ఎన్నికల్లో.. రెండుసార్లు లోక్‌సభ ఎన్నికల్లో విఫలమయ్యారు. వారణాసి లోక్‌సభ స్థానం నుంచి అథర్ జమాల్ పోటీ చేయడం ఇదే మొదటిసారి కాదు. 1984లో మొదటిసారి యూపీ స్థానం నుంచి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేశారు. ఆ సమయంలో కాంగ్రెస్‌ పార్టీకి చెందిన శ్యామ్‌లాల్‌ యాదవ్‌ విజయం సాధించగా.. లారీ 50329 ఓట్లను పొందారు.

2004 లోక్‌సభ ఎన్నికలలో వారణాసిలో మళ్లీ తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. అప్పుడు కూడా గెలువలేకపోయారు. 93228 ఓట్లతో మూడోస్ స్థానంలో నిలిచారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజేష్ కుమార్ మిశ్రా ఈ స్థానంలో గెలుపొందారు. 1991, 1993లో జనతాదళ్ టిక్కెట్‌పై వారణాసి కాంట్ స్థానం నుంచి ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేసి ఓటమిపాలయ్యారు.

2022లో యూపీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు లారీ సమాజ్‌వాదీ పార్టీలో చేరారు. ముస్లిం కమ్యూనిటీ నుంచి మద్దతు ఆశించి వారణాసి స్థానంలో లారీని బీఎస్పీ రంగంలోకి దింపిందని పలువురు భావిస్తున్నారు. ఈ నియోజకవర్గంలో మూడు లక్షల మంది ఓటర్లు ఉన్నారు. ఇదే అంచనాలతో మాయావతి 2009లో బీజేపీ అభ్యర్థి మురళీ మనోహర్ జోషిపై.. ముఖ్తార్ అన్సారీని రంగంలోకి దించారు. కానీ గెలుపొందలేకపోయారు. అయితే త్వరలో జరగనున్న ఎన్నికల్లో గెలుపోటములు ఎవరివనేది తెలుస్తుంది.

Advertisement
 
Advertisement