మౌనంగా ఉంటున్నాం అనుకోకు: ఠాక్రే | Will Face All Political Storms says Uddhav Thackeray | Sakshi
Sakshi News home page

మౌనంగా ఉంటున్నాం అనుకోకు.. ఠాక్రే హెచ్చరికలు

Published Sun, Sep 13 2020 2:30 PM | Last Updated on Sun, Sep 13 2020 8:46 PM

Will Face All Political Storms says Uddhav Thackeray - Sakshi

సాక్షి, ముంబై : మహారాష్ట్ర సర్కార్‌, బాలీవుడ్‌ బ్యూటీ కంగనా రనౌత్‌ మధ్య రాజుకున్న రాజకీయ వేడి తారస్థాయికి చేరింది. గత వారం రోజులుగా సాగుతున్న వీరిద్దరి మధ్య వివాదం తాజాగా రాష్ట్ర గవర్నర్‌ వద్దకు చేరనుంది. ఆదివారం సాయంత్రం కంగనా రనౌత్‌ గవర్నర్‌ భగత్‌సింగ్‌ కోశ్యారీతో భేటీ కానున్నారు. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే మీడియా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో విస్తరిస్తున్న కరోనా వైరస్‌తో పాటు తమను విమర్శిస్తున్న రాజకీయ పార్టీలతోనూ పోరాటం చేస్తున్నామని అన్నారు. తాము మౌనంగా ఉన్నామంటే దానికి అర్థం తమకు ఏమీ చేతకావట్లేదని అర్థం కాదని కంగనాను పరోక్షంగా హెచ్చరించారు. తాను రాజకీయాల్లోకి వచ్చిననాటి నుంచి ఎన్నో అవాంతరాలను, ఆటుపోట్లను ఎదుర్కొన్నా అని తాజా వివాదాల నేపథ్యంలో ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నానని ఠాక్రే స్పష్టం చేశారు. మహారాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు పెద్ద ఎత్తున కుట్రలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. (త్వరలో ఫలితం చూస్తావు : శివసేనే హెచ్చరిక)

అంతేకాకుండా మొదటితో పోలిస్తే రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు పెరిగిందన్నారు. వైరస్‌ను అరికట్టేందుకు ప్రభుత్వం పెద్ద ఎత్తున చర్యలను చేపడుతోందని వివిరించారు. అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా డోర్‌టూడోర్‌ వైద్య సేవలను విస్తరిస్తామన్నారు. కాగా ముంబై పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లా తయారైందని మహారాష్ట్ర ప్రభుత్వంపై, పోలీసులపై కంగనా రనౌత్ ఘాటు విమర్శలు చేసిస విషయం తెలిసిందే. అనంతరం కొన్ని గంటల్లోనే ముంబైలోని కంగనా ఆఫీస్‌ ఆక్రమ కట్టడమంటూ బీఎంసీ అధికారులు దాన్ని కూల్చి వేసేందుకు సిద్ధమయ్యారు. అయినా కంగనా రనౌత్‌ ఏమాత్రం భయపడకుండా శివసేన ప్రభుత్వాన్ని, కాంగ్రెస్‌ వైఖరిని ఎండగట్టారు. (సామాన్యులకు లేని భద్రత.. సెలబ్రిటీకి ఎందుకు)

 ఈ నేపథ్యంలోనే కోర్టును ఆశ్రయించిన ఆమె కార్యాలయం కూల్చడంపై హైకోర్టు నుంచి స్టే తెచ్చుకున్నారు. ఆదివారం సాయంత్రం నాలుగున్నర గంటలకు మహారాష్ట్ర గవర్నర్‌ భగత్‌సింగ్‌ కోశ్యారీను ప్రత్యేకంగా కంగనా కలవనున్నారు. బాంద్రాలోని కంగనా ఆఫీసును బీఎంసీ అధికారులు కూలగొట్టడంపై గవర్నర్‌ అంసతృప్తిని వ్యక్తం చేయడమే కాకుండా మహారాష్ట్ర చీఫ్‌ సెక్రటరీని వివరణ కూడా అడిగారు‌. ఈ నేపథ్యంలో కంగనా గవర్నర్‌ను కలవనుండటంతో మరింత ప్రాధాన్యత సంతరించుకుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement