సాక్షి, తాడేపల్లి: ఈ నెల 25 నుంచి ప్రారంభం కాబోతున్న శీతాకాల సమావేశాల సందర్భంగా.. పార్లమెంటులో అనుసరించాల్సిన వ్యూహాలపై వైఎస్సార్‌సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి దిశానిర్దేశం చేశారని ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ పేర్కొన్నారు. సోషల్ మీడియా కార్యకర్తల అక్రమ అరెస్టులు, నిర్బంధాలపై పార్లమెంటులో చర్చిస్తామని చెప్పారు. 41a నోటీసులు ఇవ్వకుండా అరెస్టులు చేయటంపై గట్టిగా నిలదీస్తామన్నారు. చట్టాలను అమలు చేయనప్పుడు ఇక ఆ చట్టాలు ఎందుకని గట్టిగా ప్రశ్నిస్తామని అన్నారు..
గురువారం వైఎస్ జగన్‌తో వైఎస్సార్‌సీపీ రాజ్యసభ, లోక్‌సభ ఎంపీలు గురువారం సమావేశం అయ్యారు. ఈ భేటీ అనంతరం ఎంపీ సుభాష్ చంద్రబోస్ మాట్లాడుతూ.. పోలవరం ఎత్తును తగ్గించాలనే కేంద్రం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నామని, పోలవరం ఎత్తు తగ్గిస్తే ఆందోళన చేస్తామని తెలిపారు. పోలవరం నిర్వాసితులకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ నిధులు వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణను వ్యతిరేకంగా పోరాటం చేస్తామని తెలిపారు. దాన్ని ప్రభుత్వ ఆధీనంలోనే నడపాలని, అవసరమైతే ఢిల్లీలో ధర్నా చేస్తామని చెప్పారు.
ప్రత్యేక హోదాపై గట్టిగా పోరాటం చేస్తామన్నారు. వక్ఫ్ సవరణ బిల్లును ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమోదించమని, ఆ బిల్లు రాజ్యాంగ విరుద్ధమని తెలిపారు. బలం ఉందని పార్లమెంటులో బిల్లును పాస్ చేస్తే న్యాయపోరాటం చేస్తామని పేర్కొన్నారు. ప్రాథమిక హక్కులకు భంగం కలిగిస్తే సహించేదిలేదని స్పష్టం చేశారు. పార్లమెంటును స్తంభింపచేయటానికి కూడా వెనుకాడమన్నారు.
Comments
Please login to add a commentAdd a comment