నగరి (చిత్తూరు జిల్లా)/సాక్షి, విశాఖపట్నం/రాజమహేంద్రవరం రూరల్/కార్వేటినగరం (చిత్తూరు జిల్లా): గుంటూరు జిల్లా తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ఆదివారం చేసిన వ్యాఖ్యలపై పలువురు మంత్రులు మండిపడ్డారు. గతంలో అమ్ముడుపోయిన ఎమ్మెల్యేలకు పట్టిన గతే ఇప్పుడు అమ్ముడుబోయిన వారికీ పడుతుందన్నారు. ఆమె చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్ట్ చదివినట్లు అనిపిస్తోందన్నారు. మంత్రులు ఆర్కే రోజా, గుడివాడ అమర్‌నాథ్, ఆదిమూలపు సురేష్, తానేటి వనిత ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి ఆదివారం వేర్వేరుచోట్ల మీడియాతో మాట్లాడారు. వారేమన్నారంటే..
చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్ట్ అది: తానేటి వనిత
శ్రీదేవి వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని, చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్ట్ చదివినట్లు అనిపిస్తోందని హోంమంత్రి తానేటి వనిత రాజమహేంద్రవరంలో అన్నారు. శ్రీదేవి వ్యాఖ్యలను ఆమె ఖండించారు. శ్రీదేవికి వైఎస్సార్‌సీపీ చాలా గౌరవం, గుర్తింపు ఇచ్చిందని గుర్తుచేశారు. మొన్నటి వరకూ సోషల్ మీడియాలో ఆమెను తీవ్రంగా ట్రోల్ చేసిన వారి పక్షానే శ్రీదేవి చేరిందని ఎద్దేవా చేశారు. అమరావతిని రాజధానిగా ఉంచడానికి ప్రయత్నిస్తానని శ్రీదేవి చెప్పడం హాస్యాస్పదమన్నారు. ఆమె తెలంగాణ వెళ్లి ప్రెస్‌మీట్ పెట్టాల్సిన అవసరమేంటని ప్రశ్నించారు.
శ్రీదేవి వ్యాఖ్యలు విడ్డూరం: ఆదిమూలపు
మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ.. తల్లిపాలు తాగి రొమ్ము గుద్దిన చందంగా శ్రీదేవి వ్యవహరించారని విమర్శించారు. సీఎం జగన్ ప్రభుత్వం దళితులను అవమానిస్తోందని శ్రీదేవి వ్యాఖ్యానించడం విడ్డూరంగా ఉందన్నారు. దళితులను అక్కున చేర్చుకున్నదే వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అని, దళితులు గుండెల్లో పెట్టుకుని చూసుకుంటున్నారన్నారు. చంద్రబాబు వాపును చూసి బలుపు అనుకుంటున్నాడని సురేష్ వ్యాఖ్యానించారు. రానున్న ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ విజయం తథ్యమన్నారు.
వారికి పట్టిన గతే వీరికి: నారాయణస్వామి
సీఎం జగన్ అండతో గెలిచి ఆయనకు వెన్నుపోటు పొడిచిన వారు చరిత్రహీనులుగా మిగిలిపోతారని ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి అన్నారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ భూస్థాపితం కావడం ఖాయమన్నారు. గతంలో అమ్ముడుబోయిన ఎమ్మెల్యేలకు పట్టిన గతే ఇప్పుడు అమ్ముడుబోయిన ఎమ్మెల్యేలకూ పడుతుందన్నారు. ఇక స్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణంలో ఆధారాలతో అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబుకు జైలు కూడు తప్పదన్నారు.
వారికి రాజకీయంగా పుట్టగతులుండవు: రోజా
సీఎం జగనన్న అండతో వైఎస్సార్‌సీపీ గుర్తుపై గెలిచి ఎమ్మెల్సీ ఎన్నికల్లో పక్కదారి పట్టిన నలుగురు ఎమ్మెల్యేలకు రాజకీయంగా పుట్టగతులు ఉండవని రోజా అన్నారు. నీచ రాజకీయాలతో నాలుగు సీట్లు గెలిచి ఏదో సాధించినట్లు చంద్రబాబు, ఎల్లో మీడియా చేసే తాటాకు చప్పుళ్లకు భయపడ్డానికి జగనన్న కుందేలు కాదు సింహమన్నారు.
14 ఏళ్లు సీఎంగా ఉన్నానని చెప్పుకునే చంద్రబాబునాయుడు ఏనాడు న్యాయంగా రాజకీయం చేయలేదన్నారు. ఆయన ఎమ్మెల్యేలను కొనగలడేమోగానీ.. కోట్లాదిమంది ప్రజల గుండెల్లో జగనన్నకు ఉన్న అభిమానాన్ని కొనలేడన్నారు. 2019 మాదిరిగానే 2024లో కూడా జగనన్న అదే రీతిలో సమాధానం చెప్పడం ఖాయమన్నారు.
ఉండవల్లి శ్రీదేవి కాదు.. ఊసరవెల్లి శ్రీదేవి: అమర్‌నాథ్
ఇటీవల ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉండవల్లి శ్రీదేవి వైఖరి తనకు మొదటి నుంచి అనుమానం కలిగిస్తూనే ఉందని మంత్రి గుడివాడ అమర్‌నాథ్ ఆదివారం విశాఖలో అన్నారు. పోలింగ్ సమయానికి ముందు శ్రీదేవి తన కూతురుతో వచ్చి సీఎం జగన్‌తో ఫొటో కూడా తీయించుకుని సినీనటి శ్రీదేవిని మైమరిపించేలా నటించారన్నారు.
టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థికి ఓటువేసి.. ఇప్పుడు దళిత కులం కార్డు అడ్డుపెట్టుకుని అందరి మీద విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు నుంచి ముడుపులు తీసుకున్నప్పుడు కులం కార్డు గుర్తురాలేదా? అని అమర్‌నాథ్ ప్రశ్నించారు. ఇక నుంచి అందరూ ఆమెను ఉండవల్లి శ్రీదేవి అనేకన్నా.. ఊసరవెల్లి శ్రీదేవి అనడం బెటర్ అని ఆయన వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment