ఎన్టీఆర్, సాక్షి: టీడీపీ కూటమి అరాచక పాలనపై చేపట్టిన ధర్నా సూపర్ సక్సెస్ కావడంతో వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తిరిగి ఏపీకి చేరుకున్నారు. గురువారం ఉదయం గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ఆయనకు, నేతలకు పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. జగన్‌ను అభిమానులు చుట్టుముట్టగా.. ఓపికగా ఆయన సెల్ఫీలు దిగారు.
ఏపీలో కూటమి ప్రభుత్వం కొలువు దీరినప్పటి నుంచి శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయి. హత్యలు, హత్యాచారాలు, దాడులు, వేధింపులు, విధ్వంస ఘటనలు పెరిగిపోయాయి. ప్రత్యేకించి వైఎస్సార్‌సీపీని లక్ష్యంగా చేసుకుని హింసాపర్వం కొనసాగింది. ఈ నరమేధాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లినా లాభం లేకపోయింది. అదే సమయంలో.. వినుకొండ హత్యాఘటన, వైఎస్సార్‌సీపీ ఎంపీ..మాజీ ఎంపీలపై దాడి ఘటన రాష్ట్రాన్ని ఉలిక్కిపడేలా చేసింది. ఆపై కూటమి పాలన అరాచకాలపై గవర్నర్‌కు సైతం ఫిర్యాదు చేసినా ఫలితం కనిపించలేదు. దీంతో..
ఈ పరిస్థితుల్ని దేశం దృష్టికి తీసుకెళ్లాలని వైఎస్ జగన్ భావించారు. దేశ రాజధానిలో వైస్సార్‌సీపీ ధర్నాచేపట్టగా.. పలు జాతీయ పార్టీల సంఘీభావంతో అది విజయవంతం అయ్యింది. సమాజ్‌వాదీ పార్టీ, శివసేన ఉద్దవ్ థాక్రే వర్గం, ఆప్, అన్నాడీఎంకే.. తదితర పార్టీలు వైఎస్సార్‌సీపీ ధర్నాకు సంఘీభావం తెలిపాయి. ఆ సమయంలో చంద్రబాబు బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఏపీలో జరుగుతున్న రాజకీయ హత్యలను వైఎస్ జగన్ దేశ రాజధానిలో ఎండగట్టారు. వీడియో, ఫోటో సాక్ష్యాలతో జాతీయ నాయకులకు ఏపీలోని అరాచక పరిస్థితులను వివరించారాయన.
ఇదీ చదవండి: రెడ్‌బుక్ రాజ్యాంగం అమలవుతోంది.. అరాచకాన్ని అడ్డుకుందాం
చంద్రబాబు గత నెలన్నర పాలనలో జరిగిన నేరాలను ఘోరాలను తెలుసుకుని ఆ నేతలు నివ్వెరపోయారు. ‘‘ఏపీలో రాజ్యాంగబద్ధ పాలన జరుగుతోందా?’’ అని ప్రశ్నించిన ఆయా పార్టీల నేతలు.. కేంద్ర హోంశాఖ జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు ప్రభుత్వానికి అధికారంలో కొనసాగే హక్కు లేదని మండిపడ్డారు. అధికారం శాశ్వతం కాదని.. జగన్‌ను మళ్లీ ఆశీర్వదించే అధికారం కట్టబెట్టే అవకాశం ఉందని అన్నారు. అలాగే.. శాంతిభద్రతలు నెలకొల్పేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని కోరారు. ప్రభుత్వ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఈ పోరాటంలో వైఎస్ జగన్ వెంటే ఉంటామని, న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తాయని ఆ పార్టీల నేతలు హామీ ఇచ్చారు.
మరోవైపు.. నారా లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని, కక్షపూరిత రాజకీయాల్ని జాతీయ మీడియా ముందు ప్రస్తావించిన వైఎస్ జగన్, ప్రజాస్యామ్య పరిరక్షణకు అంతా తమకు మద్దతు ప్రకటించాలని జాతీయ మీడియా ద్వారా విజ్ఞప్తి చేశారు. రాష్ట్రపతి, ప్రధాని సహా కేంద్ర మంత్రులకూ ఏపీలో పరిస్థితులను వివరిస్తామని, రాష్ట్రపతి పాలనకు డిమాండ్ చేస్తామని జగన్ చెబుతున్నారు. అపాయింట్‌మెంట్ దొరకగానే త్వరలో జగన్ మరోసారి ఢిల్లీ వెళ్లే అవకాశం ఉంది.
క్లిక్ చేయండి: ఈ పోరాటంలో జగన్‌కు మా మద్దతు ఉంది
Comments
Please login to add a commentAdd a comment