పల్నాడు, సాక్షి: రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని, దానిని దేశం దృష్టికి తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అంటున్నారు. వినుకొండలో హత్యకు గురైన యువ కార్యకర్త రషీద్ కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం.. ఆయన ఓ జాతీయ మీడియాతో మాట్లాడారు.
‘‘రషీద్‌ను దారుణంగా హత్య చేశారు. వ్యక్తిగత కారణాలని క్రియేట్ చేశారు. కానీ, కేవలం వైఎస్సార్‌సీపీ కోసం పని చేశాడని రషీద్‌ను హత్య చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయి. హత్యలు చేస్తున్నారు. మా ఎంపీ, ఎమ్మెల్యేలపై కూడా దాడి చేశారు. మిథున్‌రెడ్డి, రెడ్డప్పపై దాడి చేశారు. దాడి చేసింది కాకుండా.. వాళ్లపైనే మర్డర్ కేసు పెట్టారు.
గత ఐదేళ్లలో ఎన్నాడూ ఇలాంటి ఘటనలు జరగలేదు. లోకేష్ రెడ్‌బుక్ ప్రకారమే ఇదంతా జరుగుతోంది. దాడులపై కేంద్ర దర్యాప్తు సంస్థలు దర్యాప్తు చేయాలి. త్వరలో జరగబోయే అసెంబ్లీ సమావేశాల్లో నిరసన తెలియజేస్తాం. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకుంటాం.
.. ఏపీలో జరుగుతున్న దాడులపై, అరాచకపాలనపై ప్రధాని మోదీ సహా అందరినీ కలుస్తాం. రాష్ట్రంలో జరుగుతున్న దాడుల్ని వివరిస్తాం. రాష్ట్రపతి పాలన పెట్టాలని డిమాండ్ చేస్తాం. రాష్ట్ర అరాచక పాలనకు నిరసనగా ఢిల్లీలో ధర్నా చేస్తాం’’ అని అన్నారాయన.
ఇక.. వచ్చే బుధవారం ఢిల్లీలో జగన్ నేతృత్వంలో ధర్నా జరుగుతుందని, ఇందులో వైఎస్సార్‌సీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అంతా పాల్గొంటారని వైఎస్సార్‌సీపీ ప్రకటించింది.
Comments
Please login to add a commentAdd a comment