గుంటూరు, సాక్షి: చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వ పాలనలో రాష్ట్రం ఎటు వైపు వెళ్తుందో ఆలోచించాలని, పురోగతి వైపు వెళ్తుందా?.. తిరోగమనంలో వెళ్తోందా? గమనించాలని ఏపీ ప్రజలకు వైఎస్సార్‌సీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు ఇచ్చారు. రాష్ట్రంలో కొనసాగుతున్న అరాచకాలు, చంద్రబాబు విడుదల చేస్తున్న అబద్ధపు శ్వేత పత్రాలు, వైఎస్సార్‌సీపీ హయాంపై చేస్తున్న తప్పుడు ప్రచారాలపై తాడేపల్లిలోని తన కార్యాలయంలో జగన్ మీడియాతో మాట్లాడారు.
‘‘రాష్ట్రంలో గత 52 రోజులుగా దాడులు, అత్యాచారాలు, ఆస్తుల ధ్వంసం కొనసాగుతోంది. ప్రశ్నించే వాళ్లను అణచివేసే ధోరణితో పాలన ముందుకు సాగుతోంది. విధ్వంస పాలన కొనసాగుతుంటే.. పోలీసులు పూర్తిగా ప్రేక్షకపాత్ర వహిస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వం ఏడు నెలల ఓటాన్ బడ్జెట్ పెడుతోంది. పూర్థిస్థాయి బడ్జెట్ పెట్టే ధైర్యం లేంటే ఎంతటి దారుణమైన, అధ్వానమైన పాలనో అర్థం చేసుకోవాలి. ఫుల్ బడ్జెట్ పెడితే చంద్రబాబు నాయుడు మోసపూరిత హామీలు ఏమైతే ఇచ్చారో.. వాటికి కేటాయింపులు చూపించాల్సిన అవసరం వస్తుంది. అందుకే ఆ పని చేయడం లేదు.
.. చంద్రబాబు అంటేనే వంచన, గోబెల్స్ ప్రచారం. ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడవడం దగ్గరి నుంచి ప్రజల్నిమోసం చేయడం దాకా అన్నింటా ఇదే జరుగుతోంది. ఇప్పుడు రాష్ట్రం క్లిష్టపరిస్థితుల్లో ఉందని చంద్రబాబు గ్యాంగ్ ప్రచారం చేస్తోంది. రాష్ట్రం ఆర్థికంగా ధ్వంసం అయ్యింది. అందుకే పూర్తిస్థాయి బడ్జెట్ పెట్టడం లేదని చంద్రబాబు అంటున్నారు. నిజంగా అయిపోతుందా? అయ్యిందా? గమనిస్తే..
.. ఎన్నికల సమయంలో రూ. 14 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయని చెబుతూ.. సూపర్ సిక్స్ హామీలు ఇచ్చారు. ఇప్పుడు అధికారం వచ్చాక అది చూపించడానికి పడరాని పాట్లు పడుతున్నారు. గవర్నర్ ప్రసంగం వరకు వచ్చే సరికి రూ.10 లక్షల కోట్ల అప్పు అయ్యిందని చూపించారు. శ్వేత పత్రాలతో మభ్య పెట్టే యత్నం చేస్తున్నారు. నిజంగా అది ఒకసారి గమనిద్దాం. ఆర్బీఐ, కాగ్, స్టేట్ బడ్జెట్ ప్రకారం గమనిస్తే.. వాస్తవానికి ఈ ఏడాది జూన్ దాకా, అదీ చంద్రబాబు ప్రభుత్వం వచ్చేంత దాకా చూస్తే అప్పు రూ.5 లక్షల 18 వేల కోట్ల రూపాయలు మాత్రమే.
చంద్రబాబు 2019లో దిగిపోయే నాటికి రూ.2 లక్షల 72 వేల కోట్ల అప్పు ఉంది. వైఎస్సార్‌సీపీ హయాంలో ఆ అప్పు రూ.5 లక్షల 18 వేల కోట్లకు చేరింది. గ్యారెంటీలు, విద్యుత్ ఒప్పందాలు కలిపినా రూ. 7లక్షల 48 వేల కోట్లు మాత్రమే. అయినా గవర్నర్ ప్రసంగంలో అబద్ధం చెప్పించారు. ఇలా రూ. 14 లక్షల కోట్ల అప్పు ఉందని చెప్పడం ధర్మమా?. వాస్తవాలపై గవర్నర్‌కు లేఖ రాస్తాం. ఆయనతోనూ అబద్ధాలు చెప్పించిన విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్తాం.
చంద్రబాబు అధికారం చేపట్టేనాటికి రూ.7 వేల కోట్లకు పైగా ఖజానా సొమ్ము ఉంది. కానీ, మేం అధికారం చేపట్టేనాటికి రూ.100 కోట్లే ఉంది. ఆ విషయాన్ని ఈనాడు కూడా రాసింది. మేం అధికారంలో ఉండగా మేనిఫెస్టోలో ప్రతీ హామీని అమలు చేశాం. డీబీటీ ద్వారా బటన్ నొక్కి రూ.2.71 లక్షల కోట్లు లబ్ధిదారులకు జమ చేశాం. పార్టీ, ప్రాంతాలు కూడా చూడకుండా అందరికీ సంక్షేమం అందించాం. చంద్రబాబు హయాంలో 21.63 శాతం దాకా అప్పు చేశారు. వైఎస్సార్‌సీపీ హయాంలో 12.9 శాతం అప్పు చేశాం. కేంద్ర ఎకనామిక్ సర్వే మా ప్రభుత్వ పని తీరును మెచ్చుకుంది. అయినా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఆగమైనట్లు చిత్రీకరించడం ఎంత వరకు సమంజసం?. బడ్జెట్‌లోనూ ఈ లెక్కలన్నీ చెప్పాల్సి వస్తుందనే పూర్తిస్థాయి బడ్జెట్ పెట్టడం లేదు. అసలు లేని రూ.14 లక్షల కోట్ల అప్పు ఉందని చెప్పడం ధర్మమా?.
చంద్రబాబు హయాంలో 21.63 శాతం దాకా అప్పు చేశారు. వైఎస్సార్‌సీపీ హయాంలో 12.9 శాతం అప్పు చేశాం. కేంద్రం ఇచ్చిన అనుమతుల కన్నా తక్కువ అప్పే చేశాం. కోవిడ్ టైంలోనూ పూర్తి స్థాయి బడ్జెట్ పెట్టాం. ఆ టైంలో కేంద్రం నుంచి పన్నుల వాటా తగ్గింది. అయినా సంక్షేమం ఆపలేదు. ఈ లెక్కన ఎవరు ఆర్థికంగా ధ్వంసం చేసినట్లు? కేంద్ర ఎకనామిక్ సర్వే మా ప్రభుత్వ పని తీరును మెచ్చుకుంది. కేవలం.. బడ్జెట్‌లోనూ ఈ లెక్కలన్నీ చెప్పాల్సి వస్తుందనే చంద్రబాబు ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్ పెట్టడం లేదు.
ఇదీ చదవండి: సామాన్యులపై కక్ష సాధింపు ఎందుకు?.. జగన్ సూటి ప్రశ్న
Comments
Please login to add a commentAdd a comment