టీడీపీ హింసాకాండకు సంబంధించిన దృశ్యాలను చూస్తున్న యూపీ మాజీ సీఎం అఖిలేశ్‌యాదవ్, వైఎస్ జగన్, ఐయూఎంఎల్ ఎంపీ వాహబ్ తదితరులు
ఏపీలో ఆటవిక పాలనపై జాతీయ పార్టీల ఆగ్రహం
చంద్రబాబు ప్రభుత్వం సాగిస్తున్న దమనకాండపై హోరెత్తిన ఢిల్లీ
టీడీపీ కూటమి ప్రభుత్వానికి పాలించే అర్హత లేదు.. మరో మణిపూర్‌గా మారకుండా కేంద్రం చర్యలు తీసుకోవాలి
దారుణకాండపై సుప్రీంకోర్టు సుమోటోగా కేసు నమోదు చేయాలి
ఆ ప్రభుత్వాన్ని ఎందుకు బర్తరఫ్ చేయకూడదు?
సమాజ్‌వాదీ పార్టీ, టీఎంసీ, శివసేన (ఉద్ధవ్), ఆప్, ఏఐఏడీఎంకే, జార్ఖండ్ ముక్తి మోర్చా, ఐయూఎంఎల్, ఎంఐఎం, వీసీకే సహా పలు పార్టీల మండిపాటు విధ్వంసకాండకు సంబంధించిన వీడియో, ఫొటో ప్రదర్శనలు తిలకించిన నేతలు రాష్ట్రంలో పరిస్థితులపై జాతీయ, ప్రాంతీయ పార్టీల నేతల విస్మయం వైఎస్సార్‌సీపీ పోరాటాలకు మద్దతుగా ఉంటామని హామీ ఏపీలో అరాచకాన్ని చూసి విస్తుపోయిన జాతీయ మీడియా
ఇలాగైతే ఎక్కువ రోజులు అధికారంలో ఉండరు
పట్టపగలే దాడులు, హత్యలు చేయడం, ఆస్తులు ధ్వంసం చేయడం, ప్రజా ప్రతినిధులపై ఏకంగా హత్యాయత్నం చేయడం.. ఇలాంటి బుల్డోజర్ సంస్కృతితో ప్రజలకు ఎలాంటి సందేశం ఇస్తున్నారు? ఇలాగైతే ఎక్కువ రోజులు అధికారంలో ఉండరు.
– ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం, సమాజ్‌వాదీ పార్టీ నేత అఖిలేశ్‌యాదవ్
ఇది ప్రభుత్వ ఉగ్రవాదం
ఏపీలో ప్రభుత్వమే స్వయంగా ఉగ్రవాదానికి పాల్పడుతోంది. ప్రభుత్వ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడుతున్న జగన్‌కు అండగా నిలుస్తాం.
– ఐయూఎంఎల్ ఎంపీ వాహబ్
కేంద్రం జోక్యం చేసుకోవాలి
ప్రజలందరినీ రక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుంది. కానీ, ఏపీలో అది జరగడం లేదు. దౌర్జన్యాలు, అరాచకాలను కేంద్రం అడ్డుకోవాలి
– ఏఐఏడీఎంకే ఎంపీ తంబిదొరై
శాంతి భద్రతలను కాపాడాలి
ఏపీలో జరుగుతున్న దౌర్జన్యాలపై ఫొటోలు, వీడియోలు చూశాం. అక్కడి పరిస్థితి చాలా దారుణంగా ఉంది. కేంద్రం శాంతిభద్రతలను కాపాడాలి.
– వీసీకే అధినేత తిరుమావలవన్
ఒక్కరోజు కూడా పాలించే అర్హత లేదు
ఆంధ్రప్రదేశ్‌లో అరాచకం రాజ్యమేలుతోంది. అక్కడ అసలు ప్రజాస్వామ్యం, రాజ్యాంగం ఉన్నాయా? ఏపీ ప్రభుత్వానికి ఒక్క రోజు కూడా పాలించే హక్కు లేదు.
– శివసేన (ఉద్ధవ్) ఎంపీ సంజయ్ రౌత్
ఏపీలో పరిస్థితి దిగ్భ్రాంతికరం
ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితి చూసి దిగ్భ్రాంతికి గురయ్యా. ఏ స్థాయిలో దౌర్జన్యాలు జరిగాయో చూస్తే బాధ అనిపిస్తోంది.
– తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ నదీముల్
వారికీ, దేశద్రోహులకు తేడా ఏముంది?
ఇది చాలా బాధాకరం. ఎన్నికల్లో గెలిచిన పార్టీ, ఓడిన వారిపై దాడులు చేసి ప్రాణాలు తీయడం ఏంటి? వారికి,దేశద్రోహులకు తేడా ఏముంది?
– ఆప్ ఎమ్మెల్యే రాజేంద్రపాల్‌గౌతమ్
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో సాగుతున్న నరమేధం, ఆటవిక పాలన, హత్యా రాజకీయాలకు నిరసనగా దేశ రాజధాని ఢిల్లీలో వైఎస్సార్‌సీపీ కదంతొక్కింది. కూటమి ప్రభుత్వ ఏర్పాటు తర్వాత రాష్ట్రంలో టీడీపీ కొనసాగిస్తున్న మారణహోమంపై కన్నెర్ర జేసింది. ప్రతిపక్ష పార్టీల నేతలు, కార్యకర్తలే లక్ష్యంగా సాగుతున్న హత్యలు, విధ్వంసకాండకు వ్యతిరేకంగా జంతర్‌మంతర్ వేదికగా బలంగా గళమెత్తింది. హత్యా రాజకీయాలకు ఫుల్ స్టాఫ్ పడేలా రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టాలన్న డిమాండ్‌తో హోరెత్తించింది.
టీడీపీ అరాచకంపై పిడికిలి బిగించిన వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్, టీఎంసీ, శివసేన (ఉద్ధవ్ థాక్రే), ఆప్, ఏఐడీంకే, జార్ఖండ్ ముక్తి మోర్చా, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్, వీసీకే సహా పలు పార్టీల ఎంపీలు సంఘీభావం తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రజాస్వామ్య పరిరక్షణకు చేస్తున్న పోరాటానికి సంపూర్ణంగా మద్దుతు ఇస్తామని ప్రకటించారు.
పిడికిలి బిగించి, గళమెత్తి..
రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, అభిమానులపై సాగుతున్న హత్యలు, హత్యాచారాలు, దాడులు, ఆస్తుల విధ్వంసాలను యావత్తు దేశం దృష్టికి తీసుకెళ్లేందుకు ఢిల్లీలో జంతర్‌మంతర్ వేదికగా బుధవారం వైఎస్ జగన్ చేపట్టిన ధర్నాకు మంచి స్పందన లభించింది. బుధవారం ఉదయం ధర్నాకు ముందు ఢిల్లీలో భారీ వర్షం కాస్త కలవరపాటుకు గురిచేసినా, ఉదయం 11 గంటలకు ముందే పెద్ద సంఖ్యలో వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు ధర్నా స్థలికి చేరుకున్నారు.
ధర్నా ప్రాంతానికి వైఎస్ జగన్ వచ్చే సమయానికే ఆ ప్రాంతమంతా ఆ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన వేలాది మంది నేతలు, కార్యకర్తలతో నిండిపోయింది. వైఎస్ జగన్ ధర్నా వేదికపైకి వచ్చిన వెంటనే ఆయన్ను కలిసేందుకు నేతలు పోటీపడ్డారు. ఫొటో గ్యాలరీని వైఎస్ జగన్ తిలకిస్తున్న సమయంలో ‘సేవ్ ఏపీ.. ఫ్రమ్ టీడీపీ’, ‘నరరూప రాక్షసుడు.. నారా బాబు’ అంటూ నేతలు, కార్యకర్తలు బిగ్గరగా నినాదాలు చేశారు.
కార్యక్రమం ఆసాంతం నేతలు, కార్యకర్తలు టీడీపీ పాలనకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూనే ఉన్నారు. టీడీపీ పాలనపై వైఎస్ జగన్ చేసే పోరాటాలకు వెన్నంటి ఉంటామని పిడికిలి బిగించి మద్దతు పలికారు. సాయంత్రం నాలుగు గంటలకు ధర్నా ముగిసేంత వరకు ఆ ప్రాంగణం నేతలతో కిక్కిరిసిపోయింది. భారీగా నేతలు, కార్యకర్తలు తరలిరావడంతో వందల సంఖ్యలో ఢిల్లీ పోలీసులు.. పెద్ద సంఖ్యలో బారికేడ్లు ఏర్పాటు చేశారు.
దమనకాండను కళ్లకు కట్టిన పోస్టర్లు
ధర్నా వేదికకు ఇరువైపులా ఏర్పాటు చేసిన ఫొటో గ్యాలరీ రాష్ట్రంలో సాగుతున్న దమనకాండను కళ్లకు కట్టింది. నంద్యాల, పల్నాడు, చిత్తూరు, బాపట్ల, కృష్ణా నెల్లూరు సహా వివిధ జిల్లాల్లో టీడీపీ కొనసాగించిన విధ్వంసకాండ, హత్యలు, దాడుల ఫొటోలు హత్యా రాజకీయాలను అద్దంలా చూపాయి. ధర్నాకు వచ్చిన ప్రతి ఒక్కరూ ఫొటోలను వీక్షించి తీవ్ర ఉద్వేగానికి లోనయ్యారు. కొందరు ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు వారి వారి జిల్లాల్లో జరిగిన దాడుల ఫొటోలను ఇతర జిల్లాల నేతలకు చూపిస్తూ, టీడీపీ నేతల అరాచకాన్ని తూర్పార పట్టారు.
ధర్నాను కవర్ చేసిన జాతీయ మీడియా సైతం ఫొటో గ్యాలరీని తమ తమ ఛానళ్లలో చూపించేందుకు ప్రాధాన్యమిచ్చింది. సభా వేదికపై ప్రదర్శించిన వీడియోలు సైతం కార్యక్రమానికి వచ్చిన వారిని తీవ్ర ఉద్వేగానికి గురిచేశాయి. ముఖ్యంగా పల్నాడు జిల్లా వినుకొండలో ఇటీవల హత్యకు గురైన రషీద్ వీడియోను చూసిన వారంతా ఒక్కసారి ఖిన్నులైపోవడం కనిపించింది. ఇంత దారుణాన్ని తమ జీవితంలో చూడలేదని అభిప్రాయపడ్డారు. నరమేధానికి సంబంధించిన ఫొటోలు, ఫ్లకార్డులను సైతం నేతలు, కార్యకర్తలు చేత పట్టుకొని జంతర్ మంతర్ చుట్టూతా ప్రదర్శన నిర్వహించారు.
కదిలివచ్చి మద్దతు పలికిన పార్టీలు
వైఎస్ జగన్ ధర్నాకు మద్దతుగా సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్, ఆ పార్టీ సీనియర్ ఎంపీ రాంగోపాల్ యాదవ్, శివసేన (ఉధ్దవ్ థాక్రే)పార్టీ ఎంపీలు సంజయ్ రౌత్, ప్రియాంక చతుర్వేది, అరవింద్ సావంత్, ఏఐఎడీఎంకే సీనియర్ ఎంపీ తంబిదొరై, మరో ఎంపీ నటరాజన్ చంద్రశేఖరన్, తృణముల్ కాంగ్రెస్ ఎంపీ నదీముల్ హక్, వీసీకే పార్టీ అధ్యక్షుడు తిరుమా వలవన్, ఆ పార్టీ ఎంపీ రవికుమార్, ఆమ్ ఆద్మీ పార్టీ నేత రాజేంద్రపాల్ గౌతమ్, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ ఎంపీలు అబ్ధుల్ వాహబ్, హ్యారిస్ బీరన్, జేఎంఎం ఎంపీ విజయ్ హన్సక్ తదితరులు వైఎస్ జగన్ ధర్నాకు హాజరై సంఘీభావం ప్రకటించారు.
ఈ సందర్భంగా అఖిలేశ్ యాదవ్ సహా మిగతా నేతలంతా సభా వేదికపై ప్రదర్శించిన వీడియోలను, ఫొటో గ్యాలరీని వీక్షించారు. ఏపీలోని వివిధ జిల్లాల్లో జరిగిన దమనకాండను వైఎస్ జగన్ స్వయంగా నేతలకు వివరించారు. పార్టీ కార్యాలయాలపై బుల్డోజర్‌లతో దాడులు, వైఎస్‌ఆర్ విగ్రహాల విధ్వంసం, కార్యకర్తలను నడిరోడ్డుపై నరికి చంపుతున్న దృశ్యాలను చూసిన నేతలు ఒక్కసారిగా విస్మయం వ్యక్తం చేశారు. వైఎస్సార్‌సీపీ కార్యకర్తల ఇళ్లలోకి చొరబడి సైతం దాడులకు తెగబడ్డ వైనాలు, స్వయంగా ఎంపీ మిథున్‌రెడ్డిపై జరిగిన దాడి దృశ్యాలను చూసి రాష్ట్రంలో అసలు శాంతిభద్రతలు ఉన్నాయా? అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
ఈ దృశ్యాలను చూసిన అనంతరం మాట్లాడిన నేతలు రాష్ట్రంలో ఆటవిక పాలన కొనసాగుతోందని, కేంద్రం చొరవ చూపి ఈ దమనకాండను ఆపాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యంలో నరమేధానికి చోటు లేదని, నేరమయ రాజకీయాలు మానుకుంటేనే పార్టీలు మనుగడ సాధిస్తాయని అఖిలేశ్ యాదవ్ పేర్కొన్నారు. బుల్డోజర్ సంస్కృతిని పెంచి పోషిస్తూ, ప్రజలకు ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారని టీడీపీ ప్రభుత్వాన్ని నిలదీశారు. అన్యాయాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న వైఎస్ జగన్‌కు అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
రాష్ట్రంలోని టీడీపీ ప్రభుత్వానికి కనీసం ఒక్క రోజు కూడా అధికారంలో కొనసాగే హక్కులేదని ఉధ్దవ్ శివసేన ఎంపీ సంజయ్ రౌత్ స్పష్టం చేశారు. రాష్ట్ర పరిస్థితులపై కేంద్ర హోం శాఖ మంత్రి వెంటనే స్పందించి, ప్రత్యేక బృందాన్ని రాష్ట్రానికి పంపాలని డిమాండ్ చేశారు. ఇదే పార్టీకి చెందిన మరో ఎంపీ అరవింద్ సావంత్ సైతం టీడీపీ మంత్రి నారా లోకేశ్ తీరును తూర్పారబట్టారు. ‘ఏపీలో సీఎం కొడుకు ఏకంగా రెడ్‌బుక్ పట్టుకొని తిరుగుతున్నాడు.
విపక్షంపై దాడులను ప్రోత్సహిస్తున్నాడు. ప్రజాస్వామ్యంలో ఈ తరహా విధానం ఎంత వరకు సమంజసం?’ అని నిలదీశారు. మిగతా పార్టీల ఎంపీలు సైతం టీడీపీ అరాచకాలను ఖండించారు. నరమేధాన్ని అడ్డుకునే చర్యల్లో భాగంగా వైఎస్ జగన్ చేసే ప్రతి పోరాటానికి మద్దతుగా ఉంటామని సభా వేదికగా ప్రకటించారు. కాగా, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఈ కార్యక్రమం అనంతరం వైఎస్ జగన్‌ను విడిగా కలిసి సంఘీభావం తెలిపారు.
జగన్ ఇంటర్వ్యూకు పోటాపోటీ
టీడీపీ అరాచక పాలనపై గళమెత్తిన వైఎస్ జగన్ ఇంటర్వ్యూలను తీసుకునేందుకు జాతీయ మీడియా పోటీ పడింది. ఏఎన్‌ఐ, పీటీఐ, రిపబ్లిక్ టీవీ, ఇండియా టుడే, ఎన్‌డీటీవీ సహా పలు ఛానళ్లు ఇంటర్వ్యూలు తీసుకున్నాయి. సాయంత్రం 4 గంటలకు సైతం ఇంకా చాలా మంది జర్నలిస్టులు ఇంటర్వ్యూలకు పోటీ పడుతుండటంతో మిగతా వారికి మరో సమయంలో ఇస్తామని నేతలు సర్ది చెప్పాల్సి వచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment