హుజూరాబాద్: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పాలనలోనే అన్ని వర్గాలకు న్యాయం జరిగిందని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చెప్పారు. సీఎం కేసీఆర్ పాల నలో నిరుద్యోగం నాలుగింతలు పెరిగిందన్నారు. మంగళవారం కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలం సిరిసేడులో షర్మిల నిరుద్యోగ నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతులకు ఉచిత విద్యుత్ అందించడంతో పాటు రుణమాఫీ చేసిన ఘనత వైఎస్సార్‌దేనని చెప్పారు.
భరోసా ఇవ్వని సర్కారు
దేశంలో నిరుద్యోగం ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో మనది ఒకటని షర్మిల తెలిపారు. రైతులు, నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే, ఇప్పుడున్న ప్రభుత్వం తామున్నామన్న ధైర్యం ఎందుకు ఇవ్వ డం లేదని ప్రశ్నించారు. అమాయక యువత ఉద్యోగాలు రాక నిరాశతో ఆత్మహత్యలు చేసుకుంటున్నా కేసీఆర్ పట్టించుకోవడం లేదని విమర్శించారు.
దొర బాంచన్ బతుకులకు స్వస్తి చెప్పండి
తెలంగాణలో పథకాలు రావాలంటే ఎమ్మెల్యేలు రాజీనామాలు చేయాల్సిన పరిస్థితులు వచ్చాయని షర్మిల చెప్పారు. దొర బాంచన్ బతుకులకు స్వస్తి చెప్పి ప్రతి ఒక్కరూ ఉద్యమించాలని పిలుపునిచ్చా రు. హుజూరాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో దళితుల బంధువుగా మారినట్లు కేసీఆర్ మాట్లాడుతున్నారని విమర్శించారు. రాష్ట్రంలోని దళితులంతా హుజూరాబాద్‌కు వచ్చి ఓటు నమోదు చేసుకొని రూ.10 లక్షల కోసం డిమాండ్ చేయాలన్నారు. నిరుద్యోగులెవరూ ఆత్మహత్య చేసుకోవద్దని, తాము అండగా ఉంటామని చెప్పారు. దీక్షకు ముందు.. ఉద్యోగం రాకపోవడంతో ఇటీవల రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న సిరిసేడు గ్రామానికి చెందిన మహ్మద్ షబ్బీర్ కుటుంబసభ్యులను షర్మిల పరామర్శించారు. ఆర్థిక సహాయం అందించడంతో పాటు కుటుంబంలో చదువుకున్న వారికి ప్రైవేట్‌గా మంచి ఉద్యోగం కల్పిస్తానని హామీ ఇచ్చారు.
ఫీల్డ్ అసిస్టెంట్ల సమ్మెలో పాల్గొననున్న షర్మిల
లక్డీకాపూల్: రాష్ట్రంలోని ఫీల్డ్ అసిస్టెంట్లు తమ సమస్యల పరిష్కారానికి తలపెట్టిన సమ్మెకు వైఎస్ షర్మిల సంఘీభావం తెలిపారు. బుధవారం ఉద యం 10.30కి ఆమె ఇందిరాపార్కులో నిర్వహించనున్న ఫీల్డ్ అసిస్టెంట్ల సమ్మెలో పాల్గొననున్నారు.
Comments
Please login to add a commentAdd a comment