సాక్షి, అమరావతి: చంద్రబాబు పాలనలో బీసీలకు ఏమీ చేయలేదని, కేవలం వారిని ఓటు బ్యాంకుగా మాత్రమే వాడుకున్నారని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ధ్వజమెత్తారు. చంద్రబాబు చేసిన అరాచకాలు, అన్యాయాలు, అడ్డగోలుగా రాష్ట్రాన్ని దోచుకోవడం వల్ల, మరోవైపు ఆ తర్వాత వరుసగా కోవిడ్ సోకడం వల్ల ఆర్థిక పరిస్థితి ఇబ్బందిగా మారిందన్నారు. చంద్రబాబుకు ధైర్యం ఉంటే పెట్రో ధరలు ఎందుకు పెంచుతున్నారని కేంద్రాన్ని నిలదీయాలన్నారు. ఆ పని చేయకుండా, ఇప్పుడు సిగ్గు లేకుండా బాబు మాట్లాడుతున్న తీరు, చేస్తున్న ఆందోళనను ప్రజలు గమనిస్తున్నారన్న విషయం గుర్తుంచుకోవాలని చెప్పారు.
రాష్ట్ర గౌడ కార్పొరేషన్ చైర్మన్ మాదు శివరామకృష్ణ అధ్యక్షతన తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం గౌడ సంఘీయుల రాష్ట్ర స్థాయి నేతల సమావేశం ఘనంగా జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న సజ్జల మాట్లాడుతూ.. సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బీసీలకు అమలు చేస్తున్న పథకాల గురించి ఎంత దుష్ప్రచారం చేసినా అవి అందుకుంటున్న వారికి.. తమ జీవితాల్లో ఎంతమార్పు తెస్తున్నాయనేది తెలుసునని వివరించారు. కొన్ని దశాబ్దాల కిందట బాబాసాహెబ్ అంబేడ్కర్ అట్టడుగు వర్గాల వారి కోసం అధ్యయనం చేసి వారి రక్షణకు, అభ్యున్నతికి తోడ్పడి చరిత్రలో నిలిచిపోయారని గుర్తు చేశారు.
ఓ 20 సంవత్సరాల తర్వాత బీసీల గురించి అధ్యయనం చేయించి వారికి రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా అభివృద్ధి పథంలోకి తీసుకువెళ్లేలా చట్టాలు తెచ్చిన సీఎంగా వైఎస్ జగన్‌ను గుర్తు చేసుకుంటారని అభిప్రాయపడ్డారు. మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ కల్లుగీత కార్మికులకు సీఎం జగన్ అండగా నిలబడ్డారని తెలిపారు. ఎమ్మెల్యే జోగి రమేష్ మాట్లాడుతూ.. దేశంలోనే బీసీలకు ప్రత్యేక రాజ్యాంగం రచించిన మహనీయుడు సీఎం జగన్ అని కొనియాడారు. ఎమ్మెల్సీలు అప్పిరెడ్డి, జంగా కృష్ణమూర్తి, పోతుల సునీత మాట్లాడారు. మాజీ ఎమ్మెల్సీ మేకా శేషుబాబు, కృష్ణా, గుంటూరు డీసీఎంఎస్ చైర్‌పర్సన్స్ పడమట స్నిగ్ధ, భాగ్యలక్ష్మి, గౌడ కార్పొరేషన్ డైరెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.
బీసీలంటే ఓటు బ్యాంకేనా చంద్రబాబూ..
Published Fri, Aug 6 2021 4:11 AM | Last Updated on Fri, Aug 6 2021 5:23 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment