సాక్షి, అమరావతి/సాక్షి నెట్‌వర్క్ : విద్వేషపూరిత ప్రసంగాలతో వర్గ విభేదాలు రెచ్చగొట్టి శాంతిభద్రతలకు విఘాతం కలిగించేందుకు కుట్రపన్నిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వైఎస్సార్‌సీపీ పోలీసు శాఖను కోరింది. ఈమేరకు వైఎస్సార్‌సీపీ నేతలు, సోషల్ మీడియా విభాగం ఇన్‌చార్జిలు, కార్యకర్తలు రాష్ట్రవ్యాప్తంగా పోలీసు స్టేషన్లలో శుక్రవారం ఫిర్యాదులు చేశారు.
పాదయాత్ర కోసం పోలీసులు ఇచ్చిన అనుమతి నిబంధనలను ఉద్దేశపూర్వకంగానే ఉల్లంఘిస్తూ మరీ లోకేశ్, ఇతర టీడీపీ నేతలు విద్వేషపూరిత ప్రసంగాలు చేశారని, అసభ్య పదజాలంతో దూషించారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కార్యాలయం ప్రతిష్టకు భంగం కలిగించేలా దిగజారుడు రాజకీయాలకు పాల్పడ్డారని కూడా ఫిర్యాదు చేశారు. మంత్రులు, వైఎస్సార్‌సీపీ శాసన సభ్యులపై వ్యక్తిగత దూషణలకు పాల్పడటంతోపాటు వారి అంతుచూస్తామని బెదిరించడాన్ని కూడా ప్రముఖంగా ప్రస్తావించారు.
సమాజంలో వర్గ విభేదాలు రెచ్చగొట్టి రాష్ట్రవ్యాప్తంగా ఘర్షణలు, అలజడులు సృష్టించాలన్నది లోకేశ్ పన్నాగమని పేర్కొన్నారు. శాంతిభద్రతలను భగ్నం చేసేందుకు యత్నించిన లోకేశ్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని, పాదయాత్ర కోసం పోలీసులు ఇచ్చిన అనుమతి పత్రంలోని షరతులకు కట్టుబడేలా కట్టడి చేయాలని కోరారు.
ఏలూరు జిల్లా కొయ్యలగూడెం పోలీస్‌స్టేషన్‌లో జిల్లా సోషల్ మీడియా కన్వినర్ చిక్కాల దుర్గాప్రసాద్ నేతృత్వంలో స్టేషన్ హౌస్ ఆఫీసర్‌కు ఫిర్యాదు చేశారు. ఎవరిపై ఎన్ని ఎక్కువ పోలీసు కేసులు నమోదైతే వారికి తమ ప్రభుత్వం ఏర్పడ్డాక అంతటి ప్రాధాన్యం ఇస్తామంటూ ఘర్షణలను ప్రేరేపించేలా ప్రసంగిస్తున్నారని తెలిపారు. టీడీపీ మూకలను ఉగ్రవాదుల తరహాలో ప్రజలపై ఉసిగొల్పుతూ ప్రజల ప్రాణాలకు హాని కలిగించేలా లోకేశ్ ప్రసంగిస్తున్నారని ఫిర్యాదు చేశారు.
గుంటూరు జిల్లా సోషల్ మీడియా కన్వినర్ మేకా వెంకట్రామిరెడ్డి మంగళగిరి పట్టణ, రూరల్ పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు చేశారు. రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తున్న చంద్రబాబు, లోకేశ్, అచ్చెన్నాయుడుపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కోరారు. గుంటూరు జిల్లా తుళ్ళూరు పోలీస్ స్టేషన్‌లోనూ శుక్రవారం పలువురు ఫిర్యాదు చేశారు.
పాతగుంటూరు పోలీసు స్టేషన్‌లోనూ చంద్రబాబు, లోకేశ్, అచ్చెన్నాయుడుపై ఫిర్యాదు చేశారు. విశాఖ పెందుర్తి పోలీస్ స్టేషన్‌లోనూ వైఎస్సార్‌సీపీ నాయకులు లోకేశ్, అచ్చెన్నాయుడిపై ఫిర్యాదు చేశారు. తిరుపతి, చిత్తూరు జిల్లాల్లోని పలు నియోజకవర్గాల కన్వినర్లు కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు.
టీడీపీ నేతల దాడులపై పలు కేసులు నమోదు
హనుమాన్ జంక్షన్ : లోకేశ్ పాదయాత్ర సందర్భంగా కృష్ణా జిల్లా బాపులపాడు మండలం రంగన్నగూడెంలో వైఎస్సార్‌సీపీ శ్రేణులపై దాడులు చేసిన టీడీపీ నేతలపై వీరవల్లి పోలీసు స్టేషన్‌లో కేసులు నమోదయ్యాయి. వైఎస్సార్‌సీపీ గ్రామ కమిటీ అధ్యక్షుడు తలారి ఈశ్వరరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు టీడీపీ నేతలు యార్లగడ్డ వెంకట్రావు, మొవ్వా వేణుగోపాలరావు, మొవ్వా శ్రీనివాసరావు, వెనిగళ్ల జ్ఞానశేఖర్, కనకవల్లి శేషగిరి, కనకవల్లి చిన్న యాకోబ్, కొలుసు రంగారావు, మందపాటి రాంబాబు, ఆళ్ల గోపాలకృష్ణ తదితరులపై 307, 324 రెడ్‌విత్ 34 ఐపీసీ సెక్షన్లు, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసులు నమోదు చేశారు.
వైఎస్సార్‌సీపీ నేత తలారి వినయరత్నంపై దాడికి పాల్పడ్డ ఘటనపై ఇచ్చిన ఫిర్యాదు మేరకు టీడీపీ గన్నవరం ఇన్‌చార్జి యార్లగడ్డ వెంకట్రావు, మాజీ మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, కొల్లు రవీంద్ర, మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణ, టీడీపీ నేతలు మొవ్వా వేణుగోపాల్, పరసా కిరణ్, బెజవాడ కృష్ణ, పొలగాని వీరాంజనేయులు తదితరులపై ఐపీసీ సెక్షన్లు 323. 506 రెడ్ విత్ 34, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసులు నమోదు చేశారు.
వైఎస్సార్‌సీపీ నేత కసుకుర్తి చైతన్య ధర్మేంద్ర (చిన్ను)పై జరిగిన దాడిపై ఇచ్చిన ఫిర్యాదు మేరకు టీడీపీ నేతలు యార్లగడ్డ వెంకట్రావు, మొవ్వా వేణుగోపాల్, మొవ్వా శ్రీనివాసరావు, వెనిగళ్ల జ్ఞానశేఖర్, కనకవల్లి శేషగిరిరావు, కనకవల్లి చిన్న యాకోబ్, కొలుసు రంగారావు, మందపాటి రాంబాబు, ఆళ్ల గోపాలకృష్ణపై ఐపీసీ సెక్షన్లు 447, 427, 323, 506, 290 రెడ్‌విత్ 34 కింద కేసులు నమోదయ్యాయి.
టీడీపీ నేతలు అయ్యన్న, బుద్దాపై కేసులు
ఉంగుటూరు : కృష్ణా జిల్లా గన్నవరం మండలం చిన్న అవుటపల్లిలో ఇటీవల జరిగిన యువగళం బహిరంగ సభలో సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, మంత్రి రోజాపై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీడీపీ నేతలు అయ్యన్నపాత్రుడు, బుద్దా వెంకన్నలపై ఆత్కూరు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. మాజీ మంత్రి పేర్ని నాని చేసిన ఫిర్యాదు మేరకు వారిపై విడివిడిగా కేసులు నమోదు చేశారు. అయ్యన్నపై 153ఏ, 354ఏ1 (4), 504, 505(2), 509 ఐపీసీ సెక్షన్ల కింద, బుద్దా వెంకన్నపై 153, 153ఏ, 505(2), 506 ఐపీసీ సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment