![YSRCP Fourth List Suspense Continue - Sakshi](/styles/webp/s3/article_images/2024/01/17/YS_Jagan_Fourth_List.jpg.webp?itok=Jllk42rb)
గుంటూరు, సాక్షి: అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో గెలుపే లక్ష్యంగా వైఎస్సార్‌సీపీ మార్పులు చేర్పులు చేస్తోంది. సామాజిక సమీకరణాలతో పాటు సిట్టింగ్‌ల గెలుపోటములు.. ఇతర పరిస్థితుల్ని బేరీజు వేసుకుని ఇన్‌ఛార్జిలను ప్రకటిస్తూ వస్తోంది. ఈ క్రమంలో నాలుగో జాబితా ప్రకటనపై ఆసక్తి నెలకొంది.
సంక్రాంతి పండుగ కారణంతో.. మూడు రోజులపాటు అభ్యర్థుల మార్పులు-చేర్పుల కసరత్తుకి బ్రేక్ పడింది. తిరిగి ఇవాళ మళ్లీ ఆ చర్చలు కొనసాగనున్నాయి. వాస్తవానికి నాలుగో జాబితా పండుగ ముందే విడుదల కావాల్సి ఉంది. ఐదారు స్థానాలకు మార్పుల విషయంలో స్పష్టత వచ్చినప్పటికీ.. ఆ నిర్ణయాన్ని వాయిదా వేసింది. దీంతో నేడో.. రేపో ఆ జాబితా వెలువడే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇక.. సీట్ల మార్పుల విషయంలో పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పూర్తి స్పష్టతతో ఉన్నారు. ‘‘మొత్తం 175కు 175 సీట్లు మనం గెలవాలి. ఆ ప్రయత్నం చేద్దాం. ఆ మేరకు ఎక్కడైనా అభ్యర్థి బలహీనంగా ఉంటే, పార్టీ బలంగా ఉండడం కోసం మార్పులు, చేర్పులు అవసరమవుతాయి. అందుకు మీరంతా సహకరించండి. రాబోయే రోజుల్లో తగిన గుర్తింపు ఇస్తాం’’ అని చెబుతూ వస్తున్నారు. అందుకు తగ్గట్లే క్షేత్రస్థాయిలో సర్వేల ఆధారంగా.. మార్పులతో ఇప్పటికే మూడు జాబితాలు విడుదల చేశారు.
పార్లమెంటు, అసెంబ్లీ స్థానాలకు కలిపి ఇప్పటిదాకా 59 స్థానాలకు ఇన్‌ఛార్జిలను మార్చింది వైఎస్సార్‌సీపీ. తొలి జాబితాలో 11 స్థానాలకు, రెండో జాబితాలో 27 స్థానాలకు.. ఇక మూడో జాబితాలో 21 స్థానాలకు ఇన్‌ఛార్జిలకు మార్చేసింది. పలుచోట్ల సిట్టింగ్‌ల స్థానాల్ని మార్చగా, సామాజిక న్యాయం పాటిస్తూ కొత్త వాళ్లకు అవకాశం కల్పించింది. అలాగే.. యువరక్తాన్ని ప్రొత్సహించే క్రమంలో వారసులకు సైతం జాబితాల్లో చోటు కల్పించింది.
ఇదీ చదవండి: వైఎస్సార్‌సీపీ తొలి జాబితా
ఇదీ చదవండి: వైఎస్సార్‌సీపీ రెండో జాబితా
ఇదీ చదవండి: వైఎస్సార్‌సీపీ మూడో జాబితా
25 నుంచి రాష్ట్ర పర్యటన
అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో.. కీలక సమావేశాల నిర్వహణకు అధికార వైఎస్సార్‌సీపీ సిద్ధమైంది. ఇందుకోసం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్ర పర్యటనకు సిద్ధమయ్యారు. మొదటగా సీఎం జగన్ ఉత్తరాంధ్ర జిల్లాల్లో పర్యటిస్తారు. ఈ నెల 25వ తేదీ నుంచి ఈ రీజనల్ క్యాడర్ సమావేశాలు మొదలు కానుండగా.. తొలి సమావేశానికి విశాఖ భీమిలి వేదిక కానుంది. పార్టీ కేడర్‌ను ఎన్నికలకు సన్నద్ధం చేయడమే లక్ష్యంగా ఈ భేటీలు జరపనుంది వైఎస్సార్‌సీపీ. కేడర్‌కు ఈ భేటీలో సీఎం జగన్ దిశానిర్దేశం చేస్తారు. రాష్ట్రవ్యాప్తంగా ఐదు ప్రాంతాల్లో.. నాలుగు నుంచి ఆరు జిల్లాలకు కలిపి ఒకే కేడర్ సమావేశంగా నిర్వహించనున్నట్లు పార్టీ తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment