
సాక్షి,తాడేపల్లి : రాష్ట్రంలో మహిళలకు భయం తప్ప భరోసా లేదని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి శ్యామల అన్నారు. శుక్రవారం (మార్చి7) తాడేపల్లి వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు.
‘వైఎస్సార్‌సీపీ తరుఫున మహిళా దినోత్సవం శుభాకాంక్షలు. ఏపీలో కూటమి ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేకుండా పోయింది. కూటమి నేతలకు క్రెడిబులిటీ లేదు. వైఎస్సార్‌సీపీ హయాంలో మహిళలకు అగ్రతాంబూలం కల్పించారు. నవరత్నాల్లో కూడా 90 శాతం మహిళలకే నిధులు కేటాయించింది. దిశ యాప్‌తో వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి రక్షణ కల్పించారు. జాతీయ స్థాయిలో 19 అవార్డులు వచ్చిన దిశ యాప్‌ను కూటమి ప్రభుత్వం నిర్విర్యం చేసింది. దిశ ప్రతులను ఇప్పటి హోమంత్రి అనిత తగల బెట్టారు.
కూటమి ప్రభుత్వంలో మహిళలపై 16,809 కేసులు నమోదయ్యాయని హోంమంత్రి ప్రకటించారు. వాటిల్లో ఎన్ని కేసుల్లో బాధితులకు న్యాయం చేశారు?. మచ్చుమర్రి, గుడ్లవల్లేరు ఘటనలు ప్రభుత్వ ఉదాసీనకు అద్దం పట్టాయి.పుంగనూరులో చిన్నారి హత్య జరిగితే హోంమంత్రి రాజకీయాలు మాట్లాడటం సిగ్గుచేటు.ఆడపిల్లలు, మహిళలకు రక్షణ కలిగింది కేవలం వైఎస్ జగన్ పాలనలోనే. ఒక సోదరుడిగా, బిడ్డగా ముందుండి వైఎస్ జగన్ నడిపించారు. నవరత్నాల పథకంతో మహిళలకు గౌరవం పెరిగింది.
ఎవరూ అడగకుండానే జగన్ మహిళలకు 50శాతం రిజర్వేషన్ కల్పించారు.జడ్పీ ఛైర్మన్లు, డిప్యూటీ ఛైర్మన్లు, మేయర్లు ఇలా సగానికిపైగా మహిళలకే కేటాయించారు. మహిళలపై అఘాయిత్యాలు జరుగుతుంటే పవన్ కళ్యాణ్ చోద్యం చూస్తున్నారా?.సూపర్ సిక్స్ హామీలన్నీ మోసం మోసం. ఉచిత బస్సు పథకంపై నిలువునా మోసం చేశారు. రాష్ట్రం అంతా ఉచిత బస్సు ద్వారా తిరగవచ్చని చంద్రబాబు చెబితే జిల్లాలకే పరిమితం చేస్తున్నట్టు మంత్రి సంధ్యారాణి ప్రకటించారు’అని అన్నారు.