
సాక్షి, అనంతపురం జిల్లా: తాడిపత్రిలో టీడీపీ హింసా రాజకీయాలను ఖండిస్తున్నామని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి అన్నారు. ఎస్పీ అమిత్ బర్దర్ సమక్షంలోనే ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి కాన్వాయ్‌పై దాడి జరిగిందని.. ఎస్పీ, ఏఎస్పీ రామకృష్ణ చౌదరి ఏకపక్షంగా వ్యవహరించారని మండిపడ్డారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, పోలీసుల సహకారంతోనే తాడిపత్రిలో వైఎస్సార్‌సీపీ నేతలపై దాడులు జరిగాయన్నారు. ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంట్లో పోలీసుల దౌర్జన్యం అమానుషమని.. ఏఎస్పీ రామకృష్ణ చౌదరిని కూడా సస్పెండ్ చేయాలని అనంతవెంకటరామిరెడ్డి డిమాండ్ చేశారు.
చంద్రబాబు డైరెక్షన్‌లోనే..: విశ్వేశ్వరరెడ్డి
ఉరవకొండ వైఎస్సార్ సీపీ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ, ఓటమి భయంతోనే టీడీపీ హింసా రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు. చంద్రబాబు డైరెక్షన్‌లో ఇష్టారాజ్యంగా ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను బదిలీ చేయడం వల్లే ఎన్నికల్లో హింస చెలరేగిందన్నారు. రౌడీషీటర్లు, ఖూనీకోర్లను పయ్యావుల కేశవ్ పోలింగ్ ఏజెంట్లగా పెట్టారు. తాడిపత్రిలో టీడీపీ అరాచకాలకు పోలీసులే నైతిక బాధ్యత వహించాలని విశ్వేశ్వరరెడ్డి అన్నారు.
టీడీపీ దాడులు.. పిరికిపంద చర్య: వీరాంజనేయులు
టీడీపీ-జనసేన-బీజేపీలకు ఓటమి భయం పట్టుకుందని..అందుకే వైఎస్సార్ సీపీ నేతలు, కార్యకర్తలపై దాడులు చేస్తున్నారని వైఎస్సార్ సీపీ శింగనమల ఎమ్మెల్యే అభ్యర్థి వీరాంజనేయులు అన్నారు.తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటిపై దాడి పిరికిపంద చర్యగా భావిస్తున్నామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment