సాక్షి, అమరావతి: శాసన సభలో శుక్రవారం ప్రతిపక్షం ప్రవర్తించిన తీరు చాలా విచారకరమని, సభ చరిత్రలో దుర్దినమని మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. ఆయన శుక్రవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు. ‘ప్రతిపక్ష టీడీపీ ఒక పథకం ప్రకారం సభా సమయాన్ని వృథా చేస్తోంది. అవినీతికి పాల్పడ్డ చంద్రబాబుపై కేసు ఎత్తేయాలని రచ్చ చేస్తున్నారు. రెండు రోజులుగా సభలో టీడీపీ అసభ్యంగా ప్రవర్తిస్తోంది. చర్చకు రమ్మంటే ఎందుకు రావటంలేదో టీడీపీనే సమాధానం చెప్పాలి. స్కిల్ స్కామ్‌లో వాస్తవాలు తెలుసు కాబట్టే వారు పారిపోతున్నారు. స్కిల్ స్కామ్‌లో ఎంత అవినీతి జరిగిందో, ఎలా జరిగిందో మేం సభలో చెప్పాం. టీడీపీ ఏం చెప్తుందో సభలోనే చెప్పొచ్చుగా. చర్చలో పాల్గొంటే దొరికిపోతారన్నది టీడీపీ భయం.
తప్పు చేశారు కాబట్టే హైకోర్టు క్వాష్ పిటిషన్ కొట్టేసింది. వారు చంద్రబాబు అరెస్టుపై సమావేశాల్లో చర్చ కోరారు. అందుకు, మేమూ సరేనన్నాం. ఈరోజు చర్చ మొదలుపెట్టాం. మరి తెలుగుదేశం పార్టీ సభ్యులు సమావేశాల్లో లేకుండా ఎందుకు పారిపోయారు? చంద్రబాబు అరెస్టుపై వారి అభిప్రాయం ఎందుకు చెప్పలేదు? వారి పార్టీ అధినేత ఏ తప్పూ చేయలేదని, అసలు స్కిల్ డెవలప్‌మెంట్ స్కామే జరగలేదని మీరెందుకు చెప్పకుండా వెళ్లిపోయారు? నిజాలపై చర్చించే దమ్మూ ధైర్యం లేదని వారు బహిరంగంగా ఒప్పుకోవచ్చు కదా? చంద్రబాబు అరెస్టు, రిమాండ్‌తో రాజమండ్రి సెంట్రల్ జైలుకు పంపడంపై ప్రజల్లో చట్టబద్ధమైన వ్యవస్థల పట్ల నమ్మకం ఏర్పడింది.
న్యాయవ్యవస్థ, పోలీసులు చట్టాలకు లోబడే పనిచేస్తాయి గానీ రాజకీయ ప్రలోభాలకు లోబడి పనిచేయవు. స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్, చంద్రబాబు అరెస్టుపై సుదీర్ఘంగా చర్చించాం. స్కామ్ మొదలు నుంచి ఆయన చీకటి ఒప్పందాలు, షెల్ కంపెనీలకు ప్రజాధనం విడుదల చేయడానికి అధికారులపై పెట్టిన ఒత్తిళ్లు.. అన్నీ ప్రభుత్వం తరఫున పాయింట్లవారీగా వివరించాం. సీమెన్స్ ఒప్పందం మేరకు 90 ః 10 నిష్పత్తి వాటాల గురించి టీడీపీ సభ్యులే చెబుతున్నారు.
ప్రభుత్వ వాటా రూ.371 కోట్లు విడుదల నిజమేనని ఒప్పుకుంటున్న వారు సీమెన్స్ ఒప్పందం వాటా ఎందుకు రాలేదో చెప్పాలి కదా? డిజైన్‌టెక్ నుంచి షెల్ కంపెనీల ద్వారా చంద్రబాబుకు అందిన వందల కోట్ల రూపాయల గురించి లెక్కలు వివరిస్తే బాగుండేది కదా! చర్చలో పాల్గొంటే దొరికిపోతామన్నది ఆ పార్టీ సభ్యుల భయం. చంద్రబాబు ప్రజాధనం కొల్లగొట్టిన దొంగ అని, అధికారాన్ని అడ్డంపెట్టుకుని ఆయన అవినీతికి పాల్పడటం వాస్తవమని మేము మరోమారు నిరూపించాం. దీన్ని ప్రజలంతా గమనించి ఆలోచన చేయాలి’ అని బొత్స వివరించారు.
టీడీపీది అనవసర రాద్ధాంతం
స్కిల్ స్కాం, అందులో చంద్రబాబు అరెస్టు గురించి అసెంబ్లీలో చర్చించేందుకు అధికారపక్షం సిద్ధంగా ఉన్నా ప్రతిపక్ష తెలుగుదేశం సభ్యులు అనవసర రాద్ధాంతం చేస్తూ సభను అడ్డుకుంటున్నారు. బాలకృష్ణ మీసం తిప్పాల్సింది అసెంబ్లీలో కాదు. ఆయన తండ్రి ఎన్టీఆర్‌ను అవమానించిన సందర్భంలో తిప్పాల్సింది. ఎన్టీఆర్‌కు ఆయన తనయులే ద్రోహం చేశారనే అపోహ ఉంది.
ఆ అపవాదును తొలగించుకునేందుకు బాలకృష్ణ ప్రయత్నం చేయాలి. చంద్రబాబు తన కుటుంబానికి ఎంత అన్యాయం చేశారో బాలకృష్ణ తెలుసుకోవాలి. మీ అల్లుడు లోకేశ్ ఎన్నికల్లో గెలవకుండానే ఎమ్మెల్సీగా నామినేట్ అయి మంత్రి అయ్యాడు. హరికృష్ణను మంత్రిగా చేసి ఆ తర్వాత తొలగించారు. బాలకృష్ణ రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైనా మంత్రి కాలేకపోయారు. గురువారం సభలో టీడీపీ సభ్యులు పోడియంపైకి వెళ్ళి స్పీకర్‌ను మాన్‌హ్యాండిల్ చేయాలని ప్రయత్నం చేశారు. – మంత్రి అంబటి రాంబాబు
పచ్చ పార్టీ కి పిచ్చి పట్టింది
బాబు జైల్లో ఉండేసరికి పచ్చ పార్టీకి పిచ్చి పట్టింది. నిన్న తొడకొట్టిన బాలకృష్ణ ఇవాళ ఎందుకు పారిపోయాడు? బావ తుప్పు కాదు నిప్పు అని ఆయన చెప్పలేకపోయాడు. ధైర్యం ఉంటే బాబుపై కేసులు ఎత్తివేయమని కోర్టులోనూ ఇలాగే తొడకొట్టి, విజిల్స్ వేయండి. చంద్రబాబు సీటు మీద బాలకృష్ణ మనసు పడ్డాడో ఏమో.. ఆ సీటెక్కి కూర్చోలేక, నిల్చోలేక చిల్లర చేష్టలు చేశాడు. పేద పిల్లల స్కిల్ డెవలెప్‌మెంట్ సొమ్మును దోపిడీ చేశారని యువత ఆగ్రహంతో ఉంది.
రాష్ట్రం కష్టాల్లో ఉందని అబద్ధాలు చెప్పిన బాబు తాను మాత్రం దోచుకుని పక్క రాష్ట్రంలో ప్యాలెస్ కట్టుకున్నారు. దోచుకున్న సొమ్మును తిరిగి ఇస్తానని, క్షమించండి అని ప్రజల కాళ్లావేళ్లా పడి క్షమాపణలు కోరాలి. నిన్ననే స్కిల్ స్కామ్‌పై చర్చకు వాయిదా తీర్మానం ఇచ్చి, ఈ రోజు చర్చ జరుగుతుంటే ఎందుకు పారిపోయారు? మాట్లాడే ధైర్యం లేదా? లేక ఆ స్కాంలో మీకూ వాటాలున్నాయా? స్కామ్ నిజమా కాదా అని చెప్పే అవకాశం వచ్చినప్పుడు బాలకృష్ణ పారిపోయాడంటే అర్ధం ఏమిటి? బాబు నిప్పు అనుకుంటే సమావేశాలు ముగిసే లోపల చర్చకు రావాలి.
సోమ, మంగళ, బుధ వారాల్లో ఎప్పుడైనా చర్చకు మేం సిద్ధం. స్కిల్ స్కాం ఒక్కటే కాదు...ఫైబర్ గ్రిడ్, తాత్కాలిక సచివాలయం వంటి అన్ని స్కాంలపై చర్చకు సిద్ధంగా ఉన్నాం. లోకేశ్ ఢిల్లీ వెళ్లి బహిరంగ చర్చకు వస్తారా అని అడుగుతున్నాడు. ఎలాగూ లోకేశ్ అసెంబ్లీకి రాలేడు. ఎందుకంటే ఏ ఎన్నికలోనూ ఆయన గెలవలేడు. – మంత్రి ఆర్కే రోజా
తొడగొడితే హీరోలైపోరు
అసెంబ్లీలో మీసం తిప్పితేనో, తొడగొడితేనో హీరోలు కాదు. ప్రజల్లో విశ్వాసం పొంది గెలిచిన వారే నిజమైన హీరో. ఆ హీరో వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి. బాలకృష్ణ రీల్ హీరో మాత్రమే. రియల్ హీరో కాదు. స్కిల్ స్కామ్‌లో అడ్డంగా దొరికిన చంద్రబాబు అవినీతిపరుడు. – మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి
వ్యవస్థపై టీడీపీకి గౌరవం లేదు
రెండు రోజులుగా ప్రతిపక్షం తీరు సభా మర్యాదకు భంగం కలిగించేలా ఉంది. వ్యవస్థపై టీడీపీకి గౌరవం లేదు. స్కిల్ స్కాం మీద చర్చ కావాలంటారు. చర్చ మొదలుపెడితే పారిపోతారు. చంద్రబాబు సీట్లో నిలబడి బాలకృష్ణ విజిల్స్ వేస్తున్నారు. అచ్చెన్నాయుడు వీడియోలు తీశారు. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు. క్వాష్ కోసం సుప్రీంకి వెళ్లినా లాభం లేదు. – మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ
చంద్రబాబు పెద్ద మోసకారి
చంద్రబాబు పెద్ద మోసకారి. చంద్రబాబు అరెస్ట్ అక్రమమైతే టీడీపీ నేతలు ఎందుకు చర్చకు రావడంలేదు? సీమెన్స్ కంపెనీ ఒప్పందం చేసుకోలేదని చెప్పింది. ఆధారాలతో సహా చంద్రబాబు దొరికిపోయాడు. – ఎమ్మెల్యే కిలారి రోశయ్య
దద్దమ్మల పార్టీ టీడీపీ
స్కిల్ డెవలప్‌మెంట్ కేసుపై టీడీపీ నేతలు నిన్న వాయిదా తీర్మానం ఇచ్చారు. ఫార్మాట్‌లో రమ్మంటే రచ్చ చేశారు. వారికి కావాల్సింది చర్చ కాదు.. రచ్చ. చర్చకు అవకాశం ఉన్నా చర్చ జరగనివ్వడంలేదు. పిరికిపందల్లా, వెధవల్లా చర్చ నుంచి పారిపోతున్నారు. టీడీపీ అంటే తెలుగుదేశం పార్టీ కాదు తెలుగు దద్దమ్మల పార్టీ. – ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి
నిధులు ఏమయ్యాయి?
సీమెన్స్ ఒప్పందం ప్రకారం విడుదల చేసిన నిధులు ఏమయ్యాయో టీడీపీ సమాధానం చెప్పాలి. స్కిల్ స్కామ్‌పై చర్చ ఉందని తెలిసీ టీడీపీ నేతలు రకరకాల విన్యాసాలు చేశారు. ఈలలతో విన్యాసాలు చేసినా ప్రభుత్వం సంయమనం పాటించింది. సమాధానం చెప్పలేకే టీడీపీ నేతలు పారిపోయారు. త్వరలోనే లోకేశ్‌కు కూడా చంద్రబాబుకు పట్టిన గతే పడుతుంది. – ప్రభుత్వ విప్ కరణం ధర్మశ్రీ
బాబు తప్పు చేయలేదని నమ్మితే సభకు రండి
చంద్రబాబు తప్పు చేయలేదని నమ్మితే ప్రతిపక్ష సభ్యులు సభకు రావాలి. చర్చలో పాల్గొనాలి. రాష్ట్ర ఖజానాను దోపిడీ చేసిన గజ దొంగ చంద్రబాబు.ఫేక్ ఒప్పందంతో నిధులు మళ్లించారు. సభలో ప్రజా సమస్యలపై మాట్లాడకుండా సమయాన్ని వృథా చేస్తున్నారు. బాలకృష్ణ అసెంబ్లీలో కూడా స్క్రీన్ మీద నటిస్తున్నా అనుకుంటున్నాడు. అరెస్టు చేస్తారని లోకేశ్ ఢిల్లీ పారిపోయాడు. – ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్
గజదొంగ చంద్రబాబు
రాష్ట్ర ఖజానాను కొల్లగొట్టిన గజదొంగ చంద్రబాబు. సీమెన్స్ కంపెనీ పేరుతో ఫేక్ కంపెనీతో ఒప్పందం చేసుకుని షెల్ కంపెనీల ద్వారా రూ.371 కోట్లు దోపిడీ చేశారు. మండలిలో కొత్త సభ్యులు వచ్చారు. వారు పరిచయం చేసుకోవాలి. ప్రజా సమస్యలను ప్రస్తావించాలి. కానీ అలా జరగనివ్వడం లేదు. మెడలు వంచుతానంటూ రెడ్ బుక్ పెట్టిన లోకేశ్ ఢిల్లీ పారిపోయాడు. – ఎమ్మెల్సీలు పీవీవీ సూర్యనారాయణరాజు, బల్లి కళ్యాణ్ చక్రవర్తి
బాలకృష్ణకు మెంటల్
చంద్రబాబు పాపం పండి కటకటాల పాలయ్యాడు. త్వరలోనే మరిన్ని బాగోతాలు బయటకు వస్తాయి. టీడీపీ నేతలు నోరు అదుపులో పెట్టుకోవాలి. బాలకృష్ణ ఒక మెంటల్ కేసు. మెంటల్ సర్టిఫికెట్ కూడా ఉంది. – ఎమ్మెల్సీ పోతుల సునీత
డీఎస్సీ, 40వేల ఉద్యోగాల భర్తీకినోటిఫికేషన్ ఇవ్వలేదు
జాబ్ క్యాలెండర్, డీఎస్సీపై శాసన మండలిలో వాయిదా తీర్మానం ఇచ్చాం. 40 వేలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ఒక్క డీఎస్సీ నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు. త్వరలో భర్తీ చేస్తామంటున్న మంత్రి బొత్స ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయో ముందు తెలుసుకోవాలి. – ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు
పర్చూరులోనే అత్యధికంగా బోగస్ ఓట్లు
పర్చూరులోనే అత్యధిక బోగస్ ఓట్లు ఉన్నాయి. దీనిపై ఎన్నికల కమిషన్ అధికారికి వినతిపత్రం ఇచ్చాము. 2014కు ముందు బాపట్లలో 40 వేల బోగస్ ఓట్లు చేర్చారు. 2013–14 మధ్య 8 వేల బోగస్ ఓట్లు చేర్చారు. ఏ పోలింగ్ స్టేషన్లో ఏ ఐపీ అడ్రస్‌తో బోగస్ ఓట్లు చేర్చారో ఆధారాలతో ఎన్నికల కమిషన్‌కు వినతిపత్రం ఇచ్చాం. – మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్
Comments
Please login to add a commentAdd a comment