సాక్షి, న్యూఢిల్లీ: అభివృద్ధి పనులకు టీడీపీ అడ్డుపడుతుందని వైఎస్సార్‌సీపీ రాజ్యసభ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ మండిపడ్డారు. గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, రాష్ట్రాభివృద్ధికి రావాల్సిన నిధులను అడ్డుకుని.. టీడీపీ నీచ, దుష్ట రాజకీయాలు చేస్తోందని నిప్పులు చెరిగారు. పేదల ఇళ్ల స్థలాలకు అడ్డుపడుతున్నారని ధ్వజమెత్తారు. టీడీపీ నీచ రాజకీయాలతో ఏపీలోని పేదలకు అన్యాయం జరుగుతుందన్నారు.
చదవండి: సమస్యలకు శుభం కార్డు.. సీఎం జగన్‌కు ధన్యవాదాలు: చిరంజీవి
ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షానికి సైతం సముచిత పాత్ర ఉందని.. నిర్మాణాత్మక సూచనలు చేయాల్సిన బాధ్యత ప్రతిపక్షానిదని సుభాష్ చంద్రబోస్ హితవు పలికారు. చంద్రబాబు నేతృత్వంలోని ప్రతిపక్షం అభివృద్ధికి అడ్డుపుల్ల వేయడమే పనిగాపెట్టుకుందని మండిపడ్డారు. ఇందుకు పావుగా ఎంపీ రఘురామకృష్ణరాజును ఉపయోగించుకుంటున్నారన్నారు.
‘‘హడ్కో రుణాల మంజూరు నిలుపుదల చేయించాలంటూ ఆయనతో ఒక పిటిషన్ పెట్టించారు. గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులను ఎలాగైనా ఆపించాలని ప్రయత్నిస్తున్నారు. గృహ నిర్మాణానికి రావాల్సిన నిధులు రాకుండా అడ్డుకోవడంలోనూ ప్రధాన పాత్ర పోషించారు. గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని తీసుకొచ్చిన ఉద్దేశం ఉపాధి కల్పన, మనీ సర్క్యులేషన్‌లో ఉంచడమే. ఇందులో ఎంతమందికి పని కల్పించామన్నదే ముఖ్యం తప్ప, ఎంత పని జరిగిందన్నది ముఖ్యం కాదు. పేదవాడి ఇంటిస్థలాన్ని చదును చేయడానికి ఈ పథకాన్ని ఒప్పుకోకపోవడం దురదృష్టకరం. చంద్రబాబు, రఘురామకృష్ణ రాజు ఇద్దరూ కలిసి పిటిషన్లు పెట్టి స్టే తీసుకొచ్చారు. పేదవారిపై వీరికున్న చిత్తశుద్ధి ఏంటో దీన్నిబట్టి అర్థమవుతుందని’’ సుభాష్ చంద్రబోస్ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment