సాక్షి, పల్నాడు: సీఎం జగన్ పాలనలో సామాజిక విప్లవ కల నెరవేరిందని, తిరిగి ఆయనే ముఖ్యమంత్రి అయ్యి తీరుతారని ధీమా వ్యక్తం చేశారు వైఎస్సార్‌సీపీ కీలక నేతలు. మంగళవారం సాయంత్రం పల్నాడు జిల్లా వినుకొండలో వైఎస్సార్‌సీపీ సామాజిక సాధికార బస్సు యాత్ర అనుబంధ బహిరంగ సభ జరిగింది.
చంద్రబాబు హయాంలో వివిధ సామాజిక వర్గాలకు ఎంతటి అన్యాయం జరిగిందని వివరిస్తూనే.. జగనన్న పాలనలో ఆయా వర్గాలకు దక్కిన ప్రాధాన్యతలను సభకు హాజరైన ప్రజలకు వివరించారు వైఎస్సార్‌సీపీ నేతలు.
ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మ నాయుడు మాట్లాడుతూ..
దివంగత నేత వైఎస్సార్.. బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలకు ఎంతో చేశాడు. ఇవాళ ఆయా వర్గాలకు చెందినవాళ్లు విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్నారంటే ఆ మహానేత తెచ్చిన ఫీజు రీయింబర్స్‌మెంట్ కారణం. వినుకొండలో మంచి నీటి సమస్యను పరిష్కరించాం. అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు ఏం చేయలేదు. కానీ, అధికారం ఇస్తే మాత్రం బెంజ్ కారు ఇస్తానంటారు.. రైతు రుణ మాఫీ చేస్తానంటారు. వినుకొండలో ఒక్క అభివృద్ధి పని చేశామని టీడీపీ నేతలు చెప్పినా.. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.
మంత్రి మేరుగ నాగార్జున మాట్లాడుతూ..
సామాజిక విప్లవం రావాలని విప్లవకారులు కోరుకున్నారు. ఎస్సీ కులంలో ఎవరూ పుట్టకూడదని చంద్రబాబు అన్నారు. బీసీల తోకలు కత్తిరిస్తామన్నారు. వైఎస్ జగన్ మాత్రం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలను గుండెల్లో పెట్టుకొని చూసుకున్నారు. పేద వాడు చదువుకోవాలని, వైద్యం చేయించుకోవాలని జగన్ ఆలోచించి అనేక కార్యక్రమాలు చేశారు. చంద్రబాబు దళిత హక్కులను కాలరాశారు. అంబేద్కర్ విగ్రహానికి అవమానం చేసి ముళ్ళపొదల్లో చంద్రబాబు కడితే.. విజయవాడ నడిబొడ్డున జగన్ అంబేద్కర్‌కు భారీ విగ్రహం పెట్టారు. వైఎస్ జగన్ మరో అంబేద్కర్.. పూలే. చంద్రబాబు దొరికిపోయిన దొంగ.. మోసకారి. ఆరు నూరైనా తిరిగి వైఎస్ జగనే ముఖ్యమంత్రి అవుతారు.
మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ..
వైఎస్ జగన్ చేసిన కార్యక్రమాలు సాధికారితకు నిదర్శనం. జాషువా పుట్టి పెరిగిన గడ్డ వినుకొండ. జాషువా జయంతిని అధికారికంగా జరుపుకోవాలని జగన్ ప్రభుత్వం ఆదేశించింది. కోర్టులో కూడా అబద్దం చెప్పి చంద్రబాబు బెయిల్ తెచ్చుకున్నారు. కోర్టులను మోసి చేసిన వ్యక్తి మనల్ని మోసం చేయడా?. బ్రహ్మన్నకు(ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మ నాయుడును ఉద్దేశించి..) మరోసారి అవకాశం ఇవ్వండి.
ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడుతూ..
మంచి చేయకపోతే ఎవరినైనా ఏట్లో వేస్తామని వినుకొండ ప్రజలు గత ఎన్నికల్లో చెప్పారు. ఈ ప్రాంతం వెనుకబడిన ఉండటానికి ప్రధాన కారణం నీళ్ళు లేకపోవడమే. వరికిపూడిసెల తీసుకొచ్చి బొల్లాపల్లి మండలానికి సాగు త్రాగు నీరు ఇస్తామని చెప్పాం. ఇందులో భాగంగానే అన్ని అనుమతులు తీసుకొచ్చి శంకుస్థాపన చేయడానికి సిద్ధమయ్యాం. ఈ నెల 17న మాచర్లలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేతుల మీదుగా శంకుస్థాపన చేయించి పనులు కూడా ప్రారంభిస్తాం.
మంత్రి విడదల రజిని మాట్లాడుతూ..
జగన్ అన్న కటౌట్ చూపించి సామాజిక సాధికార బస్సు యాత్ర చేస్తాం. జగన్ లేకుండానే ఇంతమంది వస్తే.. జగనన్న వస్తే జనసునామీ వచ్చేది. ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ఎదిగినప్పుడే సాధికారిత సాధ్యమవుతుంది. పదవుల్లో అత్యధిక శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకే ఇచ్చారు. వార్డు మెంబర్ నుండి రాజ్యసభ ఎంపీ వరకూ అవకాశం ఇచ్చారు. రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు డీబీటీ(డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్.. నేరుగా లబ్ధిదారుల ఖాతాలోకే) ద్వారా పేదలకు పంచారు. ఒక బీసీ మహిళకు మంత్రి పదవి ఇచ్చిన ఘనత జగనన్నకే దక్కింది. పద్నాలుగు ఏళ్ళు సీఎంగా చేసి.. నలభై ఏళ్ల సీనియర్ అని చెప్పుకుంటున్న చంద్రబాబు తోకను బీసీలు కత్తిరించబోతున్నారు. చంద్రబాబును దళితులు ఓడించి.. ఆయన్ని ఆత్మవిమర్శ చేసుకునేలా చేయబోతున్నారు.
ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా సలహదారు అలీ మాట్లాడుతూ..
బ్రహ్మ నాయుడుని యాభై నాలుగు వేల ఓట్ల మెజారిటీతో గెలిపించాలి. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలను ఎత్తుకొని జగన్ ముందు వరుసలో కూర్చో బెట్టారు. వైఎస్ తోనూ ఆయన కుమారుడు జగన్ తోనూ నా ప్రయాణం సాగింది. జగనన్న కోసం ఎంతదూరమైన, ఎక్కడికైనా వెళ్తాను. మైనారిటీలు త్వరలోనే శుభ వార్త వింటారు.
Comments
Please login to add a commentAdd a comment