సాక్షి, విశాఖపట్నం: ప్రధాని సభలో భద్రతా వైఫల్యానికి ఏపీ ప్రభుత్వానిదే బాధ్యతంటూ ప్రతిపక్షాలు చేస్తున్న రాద్ధాంతంపై వైఎస్సార్‌సీపీ కీలక నేత వైవీ సుబ్బారెడ్డి స్పందించారు. ప్రోటోకాల్ ప్రకారం ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని.. కూటమి చేస్తున్న ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదని పేర్కొన్నారాయన. అలాగే అనకాపల్లి ఎంపీ టికెట్ అభ్యర్థి పెండింగ్‌లో ఉండడంపైనా ఆయన స్పష్టత ఇచ్చారు.
విశాఖలో మంగళవారం ఉదయం వైఎస్సార్సీపీ ప్రాంతీయ సమన్వయకర్త వైవీ సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. పెండింగ్‌లో ఉంచిన అనకాపల్లి అభ్యర్థి విషయంలో ఓ నిర్ణయానికి రావాల్సి ఉంది. త్వరలోనే నిర్ణయం తీసుకుని ప్రకటన చేస్తాం. ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉంది కదా అని పేర్కొన్నారాయన. అలాగే.. ఈనెల 27 నుంచి మేమంతా సిద్ధం బస్సు యాత్ర ప్రారంభం అవుతుందని.. సిద్ధం సభలు జరగని ప్రతీ జిల్లాలో సీఎం జగన్ పర్యటిస్తారని సుబ్బారెడ్డి స్పష్టత ఇచ్చారు.
‘‘అన్ని ప్రాంతాల్లో బస్సు యాత్ర నిర్వహణపై కసరత్తు చేస్తున్నాం. టికెట్ల కేటాయింపుతో కార్యకర్తల్లో జోష్ పెరిగింది’’ అని పేర్కొన్నారాయన.
ఇక చిలకలూరిపేట ప్రజాగళంపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలపైనా వైవీ సుబ్బారెడ్డి స్పందిస్తూ.. ‘‘వాళ్లు కూటమిగా ఏర్పడి మొదటిసారి మీటింగ్ పెట్టకున్నారు. వాళ్లు ఎంతమందిని పిలిచారో.. ఏం చేశారో మనకు తెలియదు. దేశ ప్రధానికి ప్రోటోకాల్‌ను అనుసరించే భద్రతాపరంగా అన్ని ఏర్పాట్లు చేశాం’’ అని ఆయన అన్నారు.
మా నాయకుడు జగన్‌మోహన్‌రెడ్డి ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం వరకు త్వరలోనే బస్సు యాత్ర చేస్తారు. ఎవరు ఏ పక్కన నిలబడ్డారు.. ఏ పార్టీ ఏఏ సంక్షేమ పథకాలు తీసుకొచ్చాయి అనేదానిని ప్రజలు ప్రతీ ఒక్కటి గమనిస్తుంటారు. త్వరలో వాళ్ల ఓటు ద్వారా తీర్పు ఇస్తారు అని వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment