సాక్షి ప్రతినిధి, ఒంగోలు: టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు జిల్లాలో మూడు రోజుల పర్యటన ప్రజల్ని ఆకట్టుకోలేకపోయింది. ఆ పార్టీ కేడర్‌లో సైతం జోష్ నింపలేకపోయింది. వైఎస్సార్ కడప జిల్లా నుంచి జిల్లాలోని గిద్దలూరుకు బుధవారం రాత్రి ఆయన చేరుకున్నారు. అదేరోజు రాత్రి నిర్వహించిన బహిరంగ సభ జనం లేక వెలవెలబోయింది. మొదటి సబే అట్టర్ ప్లాప్ కావడంతో అక్కడి నుంచే టీడీపీ నాయకులు, కేడర్‌పై చంద్రబాబు అసహనాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు.
మూడు రోజుల పర్యటనలో చంద్రబాబు పార్టీ కేడర్‌లో ఊపు ఇవ్వలేకపోయారన్నది ఆ పార్టీ నేతల నోటి నుంచే వినిపిస్తోంది. గిద్దలూరు నుంచి ఆ రోజు రాత్రి 11 గంటలకు బయలుదేరి మార్కాపురం చేరుకున్నారు. మార్కాపురంలోనే బస చేశారు. గురువారం రెండో రోజు చంద్రబాబు పుట్టిన రోజు అక్కడే నిర్వహించుకున్నారు. తొలుత పుట్టిన రోజు వేడుకలను మార్కాపురంలో భారీగా నిర్వహించాలనుకున్నారు. జిల్లా వ్యాప్తంగా జన సమీకరణ చేయాలని చూశారు. కానీ, విఫలమయ్యారు. ఒక పక్క పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటూ ఉండగానే మహిళలు లేచి వెళ్లిపోవడం కనిపించింది.
ఇక అదే రోజు సాయంత్రం మార్కాపురంలో నిర్వహించిన సభ సైతం తుస్సుమనిపించింది. వెలిగొండ ప్రాజెక్టు మీద చెప్పిందే చెప్పి.. మళ్లీ..మళ్లీ చెప్పి ప్రజలను విసుగెత్తించారు. తాను అధికారంలో ఉండగా ఒక టన్నెల్‌ను కూడా 5 కిలోమీటర్లు పూర్తి చేయించలేని ఆయన.. మళ్లీ అధికారంలోకి వస్తే వెలిగొండను ప్రారంభించి పశ్చిమ ప్రకాశం ప్రజల కష్టాలు తీరుస్తానంటూ ఊకదంపుడు ఉపన్యాసాలిచ్చారు. ముచ్చటగా మూడో రోజు సైతం శుక్రవారం ఉదయం నుంచి సాయంత్రం వరకూ చంద్రబాబు మార్కాపురంలోనే కాలక్షేపం చేశారు.
ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం డాక్టర్లు, ఎంపిక చేసిన మీడియా ప్రతినిధులు, రైతులతో విడివిడిగా ముఖాముఖీలు ఉంటాయని నాయకులు తెలిపారు. అయితే, అలాంటివేమీ జరగులేదు. ఎంపిక చేసుకున్న కొద్దిమంది రైతులతో మాత్రమే ముఖాముఖి నిర్వహించి ముగించారు. అది కూడా మధ్యాహ్నం 12 గంటల నుంచి ఒంటి గంట వరకే జరిగింది.
సెల్ఫీలతో కాలక్షేపం..
మధ్యాహ్నం నుంచి చంద్రబాబు పార్టీ నేతలు, కార్యకర్తలతో సెల్ఫీలు దిగుతూ గడిపారు. సాయంత్రం 5 గంటలకు మార్కాపురం నుంచి యర్రగొండపాలెం బయలుదేరి వెళ్లారు. బయలుదేరినప్పటి నుంచే చంద్రబాబు కేడర్‌పై కొంత అసహనం వ్యక్తం చేస్తూ వచ్చారు.
దళితుల నిరసన సెగ...
యర్రగొండపాలెం పర్యటనకు వచ్చిన చంద్రబాబుకు దళితుల నుంచి సెగ ఎదురైంది. దళితులు చంద్రబాబు పర్యటనను అడ్డుకున్నారు. దళితులపై చేసిన వాఖ్యలకు క్షమాపణ చెప్పాలంటూ రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖామంత్రి ఆదిమూలపు సురేష్ ఆధ్వర్యంలో చంద్రబాబు పర్యటనను అడ్డుకునే ప్రయత్నం చేశారు. నల్ల టీ షర్టులు, ప్లకార్డులు, నల్ల బెలూన్లు ప్రదర్శించి చంద్రబాబుకు తీవ్రస్థాయిలో నిరసన వ్యక్తం చేశారు. చంద్రబాబు గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు.
దళితుల వ్యతిరేకి చంద్రబాబు అంటూ ఆయన పర్యటనను అడ్డుకునే ప్రయత్నం చేశారు. దళితులను రెచ్చగొట్టే ప్రయత్నాలను చంద్రబాబు స్వయంగా చేశారు. నిరసన వ్యక్తం చేస్తున్న వారికి వేలు చూపించి మరీ బెదిరించారు. చంద్రబాబు ప్రసంగంతో టీడీపీ కేడర్ కూడా రెచ్చిపోయి దళితులపైకి రాళ్లు రువ్వడంతో వైఎస్సార్ సీపీ నేతలతో పాటు పలువురు పోలీసులకు కూడా గాయాలయ్యాయి. చంద్రబాబు వ్యవహరించిన తీరు పలు విమర్శలకు దారితీసింది.
బయటపడిన విభేదాలు...
చంద్రబాబు పర్యటనలో గిద్దలూరు, యర్రగొండపాలెం నియోజకవర్గాల్లో టీడీపీ నేతల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. అధినేత పర్యటన సందర్భంగా తమను పట్టించుకోలేదంటూ గిద్దలూరులో సాయికల్పన అలకబూనారు. అశోక్‌రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే యర్రగొండపాలెం పట్టణంలో గ్రూపుల వారీగా అధినేత జన్మదిన వేడుకలు నిర్వహించారు. కొంత మంది నేతలు మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ తీరుపై కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు.
పశ్చిమ ప్రకాశంలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు పర్యటన ఫ్లాప్ షోగా మిగిలిపోయింది. మూడు రోజులు ఆయన ఇక్కడే ఉన్నా కేడర్‌లో ఏమాత్రం జోష్ కనిపించలేదు. ఆయన పార్టీ కేడర్‌పై అసహనం వ్యక్తం చేయడంతో పార్టీ నేతలు, కార్యకర్తలు చిన్నబుచ్చుకున్నారు. మూడు ప్రాంతాల్లో నిర్వహించిన సభల్లో ఆయన చేసిన ప్రసంగాలు ప్రజల్ని ఆకట్టుకోలేకపోయాయి. వెలిగొండ ప్రాజెక్టు, పశ్చిమ ప్రాంతం అభివృద్ధిపై ఆయన దశాబ్దకాలంగా చెబుతున్న అబద్దాలే తిరిగి చెప్పారని ప్రజల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి.
Comments
Please login to add a commentAdd a comment